Monday, April 29, 2024

సీమ జలవిలయం

- Advertisement -
- Advertisement -

Uninterrupted rains in Andhra Pradesh

16 మంది మృతి, 70 మంది గల్లంతు

చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్‌టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు బాధితులు
భక్తులు తిరుమలకు రావద్దొంటూ ప్రకటన, ఎపి సిఎంకు ప్రధాని మోడీ ఫోన్

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 16మంది మృత్యువాత పడగా, మరో 70మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతు కాగా ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్‌టిసి బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గల్లంతైన వారి కోసం స్థానిక పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్,ఎస్‌డిఎఫ్,అగ్నిమాపక శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ముఖ్యంగా రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి పెరగడంతో పాటు ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం ఎర్త్ బండ్ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది.

జలాశయ పరివాహక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈక్రమంలో గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. ఈ క్రమంలో చెయ్యేరు నది దాటేందుగు యత్నిస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మునిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్ టాప్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అలాగే రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహం. నందలూరు -రాజంపేట మధ్య రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దీనివల్ల రైళ్ల రాకపోకలు స్తంభించాయి. అనంతపురంలోని చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద 11 మంది ఆ నదిలో చిక్కుకుపోయారు.

వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.అలాగే అనంతపురం జిల్లా డికె పల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ప్రవాహంలో ఓ పొక్లెయిన్ కొట్టుకుపోయింది. అలాగే కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద మద్ధిలేరు వాగు ప్రవాహంలో ఇద్దరు వృద్ధులు చిక్కుకున్నారు. వారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద నిర్మించిన సత్రాల కాపలా దారులుగా ఉన్న వృద్ధుల నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైన వృద్ధులు సమస్యను ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఇవొకు సమాచారమిచ్చారు. వృద్ధులు వరదనీటి ప్రవాహంలో చిక్కుకున్న విషయం తెలిసిన అగ్నిమాపక శాఖ అధికారులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

వాయు గుండం ప్రభావం..భారీ నుంచి అతి భారీ వర్షాలు 

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి – చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.దీని ప్రభావంతో తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.

పలు రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు 

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వు అధికారులు పేర్కొన్నారు. తడ – సుళ్లూరుపేట మార్గంలో ప్రవహిస్తోన్న వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరటంతోఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లింపును పాక్షికంగా రద్దు చేశారు. శుక్రవారం నాడు తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – చెన్నై రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సెంట్రల్- ముంబై సిఎస్ ఎంటి, గుంతకల్- రేణిగుంట రైళ్లు రద్దుచేశారు. బిట్రగుంట- చెన్నై సెంట్రల్ , చెన్నై సెంట్రల్- బిట్రగుంట , విజయవాడ -చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – విజయవాడ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, రైళ్లు రద్దయ్యాయి.ఎల్.టి.టి ముంబై- చెన్నై సెంట్రల్, సిఎస్‌టి ముంబై- నాగర్ సోల్, మధురై-ఎల్.టి.టి ముంబై రైళ్లు రద్దు చేశారు. చెంగల్పట్టు- కాచిగూడ, చెన్నై సెంట్రల్- ఎల్.టీ.టీ ముంబై రైళ్లు రద్దు చేశారు. తడ- సుళ్లూరు పేట మధ్య నడిచే 4 రైళ్లు, నందలూరు- రాజం పేట మధ్య నడిచే 12 రైళ్లు దారి మళ్లించి నడుపుతున్నారు.

తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తూ టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి భక్తులను అనుమతించమని వెల్లడించారు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి వివరించింది. రెండు ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. రెండో ఘాట్ రోడ్లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డారు. వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో 2 ఘాట్ రోడ్లను మూసివేశారు. ఫలితంగా కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

తిరుమల గిరులు, ఆలయ పరిసరాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల పరిస్థితులు భీతావహమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో్లకి నీరు చేరి చెరువును తలపించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

భక్తులు తిరుమలకు రావొద్దు 

భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు. శుక్ర,శనివారాల్లో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు.తిరుమల అలిపిరి శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే టిడిపి మూసివేసింది. ఈక్రమంలో శని,ఆదివారాలు సైతం భక్తులకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి. మొదటి కనుమ రహదారిలో మాత్రమే భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతుండటంతో రెండు ఘాట్‌రోడ్లను మూసివేసింది. అలాగే పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం టిటిడి మూసివేసింది. కండపోత వర్షానికి టూరిజం హోటల్ ప్రహరీగోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద నారాయణ అనే కార్మికుడి కాలు ఇరుక్కుపోవడంతో కట్టర్లతో ఇనుపకడ్డీలు కత్తిరించి అతికష్టం మీద బయటకు తీశారు.

చిత్తూరులో వాన బీభత్సం 

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా తిరుచానూరులోని వసుంధర నగర్లో భవనం నేలకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కలికిరిలోని మదనపల్లి -తిరుపతి ప్రధాన రహదారిపై కలికిరి పెద్ద చెరువు మొరవ నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో రాకపోకలను దారి మళ్లించారు. రేణిగుంటలోని ఓ చర్చిలో చిక్కుకున్న వారిని ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వద్ద వంతెన కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. సమీపంలోని శివాలయం నీట మునిగింది.

సిఎంకు ప్రధాని మోదీ ఫోన్…. వరద పరిస్థితులపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌లో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో శుక్రవారం నాడు ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

నేడు సిఎం ఏరియల్ సర్వే 

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సిఎం వైఎస్ జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News