Monday, April 29, 2024

తెలంగాణకు మూడు షుగర్ ఫ్యాక్టరీలు:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ బేగంపేట నుండి హెలికాప్టర్‌లో కోరుట్ల చేరుకున్న ఆయనకు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, పలువురు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెట్‌పల్లి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్’షా మాట్లాడుతూ ఈ ప్రాంత రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేశారన్నారు. చెరుకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా 3 షుగర్ ఫ్యాక్టరీలను అందుబాటులోకి తెస్తామన్నారు.

ఈ ఏడాది తెలంగాణ ప్రజలకు 3 దీపావళి పండుగలు వచ్చాయన్నారు. ఒకటి మొన్న జరిగిందని, డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపుతో రెండవది, జనవరిలో అయోధ్య రామ మందిర ప్రారంభంతో మూడవ దీపావళి అన్నారు. ఈ ప్రాంతంలోని బీడీ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో కారు స్టీరింగ్ ఓవైసీ కుటుంబం చేతిలో ఉందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తుల చిరకాల కోరిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం తుది దశకు చేరిందన్నారు. జనవరిలో అయోధ్యలోని రామ మందిరం ప్రారంభిస్తామని, ఉచితంగా రాములవారి దర్శనానికి తీసుకెళ్తామన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ను గెలిపిస్తే పార్టీ ఆయన్ను మరింత పెద్దవాన్ని చేస్తుందని అమిత్’షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సెగ్మెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి, ఆర్మూర్ అభ్యర్థి పైడి రాకేశ్’రెడ్డి, బాల్కొండ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణతో పాటు బిజెపి శ్రేణి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News