న్యూఢిల్లీ: ఎంతో ప్రతిభ కలిగి 28 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న భారత అండర్-19 జట్టు మాజీ సారథి ఉన్ముక్త్ చంద్ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించాడు. గత రెండేళ్లుగా అవకాశాలు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని వాపోయాడు. తాను బయట ఉండి, అర్హత లేని ఎవరెవరికో అవకాశాలు లభిస్తుంటే మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఉన్ముక్త్ మాట్లాడుతూ.. ‘గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అవకాశం రాలేదు. జట్టులోని సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే నేను డగౌట్‌కు పరిమితం కావలసి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్‌లో కూర్చోవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్‌గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక భారత్‌లో నాకు అవకాశాలు రావని నిర్ధారించుకుని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది’ అని చెప్పాడు. ప్రస్తుతం యుఎస్ లీగ్‌లో ఆడుతున్న ఉన్ముక్త్ తన క్రికెట్ భవిష్యత్తు కోసం యుఎస్‌ను ఎంచుకోవడంపై కూడా స్పందించాడు. మూడు నెలల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్‌ను దగ్గరినుంచి చూశానని, అక్కడ పలు మ్యాచ్‌లు కూడా ఆడానని, అక్కడి పరిస్థితులపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే అక్కడ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు.
అప్పటికే కోరె ఆండర్సన్, నమిత్ పటేల్, గుర్మీత్ సింగ్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు యుఎస్ లీగ్‌లో అడుతున్నారని, వారి సలహాలతో తాను కూడా అక్కడి లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాని చెప్పాడు. భారత్‌లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక కాస్త ఉపశమనంగా ఉందని, ఇప్పుడు తాను చేయాల్సిన పనిపై స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా ఉన్ముక్త్ చంద్ 2012 అండర్19 ప్రపంచకప్‌ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నమెంట్‌లో ఉన్ముక్త్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా రాణించాడు. ఆ ప్రపంచ కప్ ఫైనల్లో వీరోచిత సెంచరీతో భారత్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. దాంతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే ఉన్ముక్త్ కూడా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. అయితే ఈ యువ ఆటగాడికి టీమిండియానుంచే కాదు.. కనీసం దేశవాళీల్లో కూడా సరైన అవకాశాలు రాలేదు. దీంతో అతను విసుగు చెంది భారత్‌లో క్రికెట్‌కు గుడ్‌బై పలికి విదేశీ లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
Unmukt Chand respond on retirement from Indian Cricket