Sunday, April 28, 2024

జీవన హక్కు

- Advertisement -
- Advertisement -

Unruly tendencies threatening the right to Life

 

విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ పిల్లలను ఇంటిలోనే దారుణంగా హతమార్చిన ఘటన మనిషి జీవన హక్కును హరిస్తున్న కొత్త రకం వికృత పోకడలను గురించి హెచ్చరిస్తున్నాయి. ప్రాణాలను బలి తీసుకున్న హింసోన్మాదాలు ఇంతకు ముందు లేవని కావు. ఏకపక్ష ప్రేమను అవధులు మీరి పెంచుకొని అమాయక యువతుల ప్రాణాలు తీసిన దుండగులు, ఇతరేతర సామాజిక దురహంకారాలతో కిరాయి హంతకులను సైతం ప్రయోగించి అన్యవర్గాలకు చెందిన యువకులను తుద ముట్టించిన మహానుభావుల ఉదంతాలు, తమను ప్రేమించని మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన అమానవీయ ఘటనలు, వొంటరిగా చిక్కిన అమ్మాయిలపై అత్యాచారాలు సాగిపోతూనే ఉన్నాయి. పలు రకాల ఉన్మత్త హింసలలో అన్నెమూ పున్నెమూ తెలియని అనేకులు బలైపోతున్నారు.

కాని సొంత కుటుంబాల్లోనే, తమ ప్రాణాలకు అత్యంత భద్రమైన చోటని భావించే సొంత ఇళ్లల్లోనే ఆ కుటుంబ సభ్యులు రక్తపు మడుగుల్లో, బూడిద కుప్పల్లో అంతరించిపోడం, మూఢ విశ్వాసాల ప్రాబల్యంలో కన్నవారినే నరికి చంపడం సమాజాన్ని ఆవహిస్తున్న సరికొత్త పెడ పోకడలకు నిదర్శనమని అనుకోవలసి వస్తున్నది. మొన్న విశాఖపట్నంలో ఒకే రోజున రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన 10 మంది దుర్మరణం పాలయ్యారు. రెండూ అపార్ట్‌మెంట్లలోనే సంభవించాయి. ఒక ఘటనలో ఆ నగరానికి సమీపంలోని పెందుర్తి మండలంలోని జుత్తాడలో ఒక ఫ్లాట్‌లోని ఆరుగురి కుటుంబ సభ్యులను తెల్లవారు జామున నరికి చంపారు. హతులలో 67 ఏళ్ల వృద్ధుడు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పసి పిల్లలున్నారు.

పొరుగింటి వ్యక్తే పాత కక్షతో ఆ ఇంట్లో ప్రవేశించి కొడవలితో వారిని నరికి చంపాడంటున్నారు. మరో దుర్ఘటనలో విశాఖలోని మధురవాడ ప్రాంతంలో గల ఒక కాంప్లెక్స్‌లోని అపార్టుమెంట్లో భార్యాభర్త, 19, 22 ఏళ్ల వయస్సున్న వారి మగ పిల్లలిద్దరూ సజీవ దహనమయ్యారు. దీపక్ అనే పెద్ద కొడుకే మిగతా ముగ్గురినీ పొడిచి చంపి నిప్పంటించి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమిక ఆధారాలను బట్టి భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం వెనుక విడివిడిగా ఉండే కారణాలతో పాటు లోతైన సామాజిక హేతువులు కూడా ఉన్నాయని అనిపిస్తున్నది.

కుహనా ప్రతిష్ఠలకు, గొప్పలకు పోయి కష్టాలు కొనితెచ్చుకోడం, జీవితం పట్ల వాస్తవికమైన, శాస్త్రీయమైన అవగాహన లోపం వంటివి ఈ ఘటనల మూలాల్లో ఉండి ఉండవచ్చు. వీటికి పెడగా మరో కోణంలో గమనిస్తే అప్పులు తీర్చలేకనో, పరువు నష్టానికి భయపడో పసి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంటున్న దంపతుల ఉదంతాలు, వృద్ధులైన తలిదండ్రులను ఇంటి నుంచి తరిమేయడం, స్మశానంలో వదిలేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ అన్నింటిలోనూ దండలో దారంలా మన రాజ్యాంగం హామీ ఇస్తున్న జీవన హక్కుకు, స్వేచ్ఛకు రోజురోజుకీ మరింతగా ముప్పు ముంచుకొస్తున్నదని అనిపిస్తున్నది. తల్లి గర్భంలో పడిన దశ నుంచి ఎవరి ప్రాణాలను హరించే హక్కు, అధికారం కన్నవారికే కాదు, ఎవరికీ ఉండదు, వైద్య కారణాల వల్లనో చట్టం నిర్దేశించిన మార్గాల ద్వారానో తప్ప. శాసనబద్ధ పద్ధతుల ప్రకారం మినహా ఏ వ్యక్తి ప్రాణాన్ని గాని, స్వేచ్ఛను గాని బలి తీసుకోడానికి వీలులేదని రాజ్యాంగం 21వ అధికరణ స్పష్టంగా చెబుతున్నది.

దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతమైన అర్థాలు, నిర్వచనాలు జీవన హక్కు అంటే కేవలం ప్రాణంతో బతికి ఉండడం కాదని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో, పరిసరాల్లో పరిపూర్ణమైన మానవీయ పరిస్థితుల్లో జీవించే హక్కుగా నిర్ధారణ అయింది. ఈ అధికరణ ఎక్కువగా ప్రజల జీవన హక్కుకు ప్రభుత్వం, రాజ్యం పూచీ పడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం సహా వేరెవరూ హరించడానికి వీలు లేదని ప్రకటించింది.

అలాగే భారత రాజ్యాంగం ఆర్టికల్ 226 హెబియస్ కార్పస్ పిటిషన్లు అటువంటి ఇతర సాధనాల ద్వారా వ్యక్తుల ప్రాణాలకు, జీవన స్వేచ్ఛకు అపాయం కలగకుండా చూసే అధికారాన్ని ఉన్నత న్యాయస్థానాలకు కల్పించింది. ఇంతగా ఈ దేశంలో ప్రతి మనిషి ప్రాణానికి, జీవన హక్కుకు, స్వేచ్ఛకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తున్నది. వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన ప్రమాదకర స్థితి ప్రబలిపోతున్నది. స్వాతంత్య్రం వచ్చి మానవీయ రాజ్యాంగాన్ని రచించుకొని శాసనంగా ఆమోదించుకొని ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ సమాజం అమానుష గతంలోకే పరుగులు పెడుతూ ఉండడం ఎంతైనా వేదన కలిగించే విపరిణామం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News