Monday, April 29, 2024

రైతులకు గోడదెబ్బ, చెంపదెబ్బ!

- Advertisement -
- Advertisement -

ఎరువు రకం పాత ధర కొత్త ధర
10:26:26 1,175 1,775
12:32:16 1,185 1,800
20:0:13 925 1,350
డిఏపి 1,200 1,900

Urea rate increased over ukraine-russia war

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24 న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089, రోడ్డు మార్గమైతే 6,528 కిలోమీటర్ల దూరంలో అది జరుగుతోంది. కానీ దాని ప్రభావం అనేక రూపాల్లో మనకు దూరంతో నిమిత్తం లేకుండా స్వానుభవంలోకి వస్తోంది. కలికాల మహిమ కాదు ప్రపంచీకరణ పర్యవసానమిది. దీని వెనుక ఉన్న అమెరికా, దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్ని తరగతుల కష్టజీవులను ఇబ్బంది పెడుతోంది. ఈ సందర్భంగా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఈ యుద్ధం ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తుందో చూద్దాం. భారత్‌లో తీవ్ర కొరత మధ్య ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయని అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ సూచీల కదలికల మీద విశ్లేషణలు అందించే ఎస్ అండ్ పి (స్టాండర్డ్ అండ్ పూర్) సంస్ధ మార్చి 30వ తేదీన పేర్కొన్నది.
ప్రపంచం మొత్తం మీద వంద కిలోల ఎరువుల ఉత్పత్తి జరిగితే 13 కిలోలు రష్యాలో తయారవుతాయి. వాటి నుంచి మనతో సహా అనేక దేశాలు తెచ్చుకుంటాయి. 2022 మార్చి నెల ప్రారంభం లో ఎరువుల ఎగుమతులను అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి మన దేశంలో 8.12 మిలియన్ టన్నుల డిఏపి, 1.9 మి. టన్నుల ఎంఒపి, 7.7 మి. టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల నిల్వలున్నాయని, అవి వచ్చే ఖరీఫ్ పంట కాలంలో అవసరమైన వాటి కంటే తక్కువని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 65.4 మి. టన్నుల డిఎపి, 23.4 మి. టన్నుల ఎంఒపి, 58.3 మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల అవసరం ఉంటుందని అంచనా. యూరియా 19.8 మి.టన్నులు అవసరం కాగా ఫిబ్రవరి చివరి నాటికి 25.5 మి. టన్నుల నిల్వలున్నాయని చెప్పినట్లు ఎస్ అండ్ పి పేర్కొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంఒపి, డిఎపి ధరలు 3040 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో పెరిగే ధరలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను బట్టి రైతులకు ఏ ధరలకు ఎరువులు దొరుకుతాయనేది చెప్పలేమని ఇండియా రేటింగ్స్ విశ్లేషకుడు భాను పాట్ని చెప్పారు.
తమ శత్రు దేశాలకు తాము ఎగుమతి చేసే సరకులకు రూబుళ్లలోనే సొమ్ము చెల్లించాలని రష్యా అధినేత పుతిన్ ప్రకటించాడు. మన దేశం ఆ జాబితాలో లేనందున రూపాయి రూబుల్ లావాదేవీలకు అవకాశం ఉంది. మనం అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ఖాతరు చేయనప్పటికీ నౌకలపై ఆంక్షలు, బీమా సౌకర్యం వర్తించవనే అనుమానాల నేపథ్యంలో రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని పెంచని పక్షంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఉంటుంది. ఎరువుల ధరల పెరుగుదల వలన సాగు విస్తీర్ణం తగ్గవచ్చని, సూపర్ (ఎస్‌ఎస్‌పి) వంటి ఇతర ఎరువుల వైపు రైతులు మరలవచ్చని చెబుతున్నారు. గ్యాస్ ధరల్లో ప్రతి ఒక్క డాలరు పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ. 4000 5000 కోట్ల వరకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్‌బిఐ పరిశోధనా బృందం వెల్లడించిన ఒక పత్రంలో పేర్కొన్నారు.
నత్రజని ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ఉత్పత్తి ఖర్చు రెండున్నర రెట్లు పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. మన అవసరాల్లో 25 శాతం యూరియా, 90 శాతం ఫాస్పేట్ ఎరువులు లేదా ముడి పదార్ధాలను, నూటికి నూరు శాతం పొటాష్ ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాము. 2021 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2022 లో (ఏప్రిల్ జనవరి కాలంలో) రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న యూరియా విలువ 27.15 మిలియన్ డాలర్ల నుంచి 123.79 మి.డాలర్లకు పెరిగింది. ఉక్రెయిన్ నుంచి 2021 జనవరి నాటికి 368.79 మి. డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నాము. రష్యా ఎరువుల ఎగుమతులపై తాత్కాలిక ఆంక్ష లు విధించగా ఉక్రెయిన్ నుంచి సరఫరాలు అనిశ్చితంగా మారాయి.
ఇతర దేశాల నుంచి ఏదో విధంగా తెచ్చుకున్నా సబ్సిడీల మొత్తం పెరగనుంది. ప్రస్తుతం కేటాయించిన 1.05 లక్షల కోట్లు చాలకపోతే పెరిగిన మొత్తాన్ని రైతుల మీద మోపాలి లేదా బడ్జెట్ మొత్తాలను పెంచాల్సి ఉంటుంది.ఫాక్టంఫాస్ (2020013) ధరలు గత పది నెలల కాలంలో బస్తా ధర రూ. 500 పెరిగి ఇప్పుడు రూ. 1,490కి చేరింది. పాత స్టాక్ పూర్తిగా అమ్ముడు పోయిన తరువాత పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఎరువుల కంపెనీలు కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఉక్రెయిన్ రష్యా వివాదం లేదు. అంతకు ముందు అంతర్జాతీయంగా పెరిగిన ఎరువుల ధరలు, దేశీయంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఎంత మేరకు ధరలు పెంచవచ్చో కంపెనీలు తమ అంతర్గత సమాచారంలో డీలర్లకు తెలిపాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీలు తాజా పరిణామాలను కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఇంకా పెంచటమే తప్ప తగ్గించేది ఉండదు. ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది. ( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచని పక్షంలో ఆ భారం రైతుల మీదనే పడుతుంది. దీనికి తోడు డీజిలు, పెట్రోలు ధరల భారం రైతుల మీద పడనుంది. చిన్న కమతాల్లో కూడా యంత్రాల వాడకం పెరిగినందున ఆ మేరకు ఖర్చు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇది గోడదెబ్బ చెంపదెబ్బ వంటిదే. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసే వారికి లీటరుకు డీజిలు ధరను రూ. 25పెంచుతూ చమురు సంస్ధలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మానసికంగా అంతభారం భరించక తప్పదని జనాన్ని సిద్ధం చేసేందుకే అలా చేశారు. ఆ మేరకు చిల్లర కొనుగోలుదార్లకు పెరగనున్నాయి. ఒకేసారి పెంచితే నిరసన వెల్లడౌతుందనే భయంతో మార్చి నెల 21వ తేదీ నుంచి రోజూ కొంత చొప్పున పెంచుతున్నారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌తో సంబం ధం లేదు. గత లోటును పూడ్చుకున్న తరువాత ధరలను బట్టి నిరంతర పెరుగుదల ఎలానూ ఉంటుంది.
బెలారస్ నుంచి పొటాష్, రష్యా నుంచి ఫాస్ఫేట్ ఎరువుల దిగుమతి అనిశ్చితంగా మారిందని రేటింగ్స్ సంస్ధ ఇక్రా పేర్కొన్నది. ఈ రెండు దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో నలభై శాతం పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. అమోనియాలో 22, అమోనియం ఫాస్పేట్ , యురియా 14 శాతాల చొప్పున రష్యా ఎగుమతులు చేస్తున్నది. రక్షణ భయంతో నౌకలు నల్లసముద్రం వైపు వెళ్లేందుకు సుముఖత చూపటం లేదు. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగితే అది ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఉక్రెయిన్ రష్యా వివాదం కారణంగా ఎరువులు, పురుగు మందుల ధరలు 11 నుంచి 15 శాతం పెరుగుతాయని కోటక్ మహేంద్ర సంస్ధ పేర్కొన్నది. కంపెనీలు, రైతులకు ఖర్చు పెరిగిన కారణంగా కనీస మద్దతు ధరలను పెంచవచ్చని కూడా జోష్యం చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి మార్చి నెలల కాలంలో అమోనియా ధరలు 200శాతం, పొటాష్ ధర 100 శాతం పెరిగిందని ఎలారా కాపిటల్ తన నివేదికలో పేర్కొన్నది. సబ్సిడీ మొత్తాన్ని ఆ మేరకు పెంచని పక్షంలో రైతులే పెరిగిన మొత్తాలను భరించాల్సి ఉంటుందని తెలిపింది. సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చనే అంచానాతో ఎరువుల కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు మదుపుదార్లు ఎగబడటంతో గత నెలలో కొన్ని కంపెనీల వాటాల ధరలు 50 శాతం పెరగ్గా సగటున 20 శాతం పెరుగుదల నమోదైంది. మద్రాస్ ఫర్టిలైజర్స్ ధరలు 76.7 శాతం పెరిగాయి.
రైతులకు అవసరమైన ఎరువులు, చమురు ధరల పెరుగుదల ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తున్నది. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ రైతాంగం మొక్కజొన్న పంటకు ఎరువుల వాడకాన్ని తగ్గించగా, పొటాష్‌కు డిమాండ్ పెరగటంతో సొమ్ము చేసుకొనేందుకు అమెజాన్ ప్రాంతంలోని రక్షిత భూమిపుత్రుల (మన దగ్గర గిరిజనులు అంటు న్నాం) భూముల్లో పొటాష్‌ను వెలికి తీసేందుకు అనుమతించాలని పాలక పార్టీ ఎంపిలు డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్రికాలోని జింబాబ్వే, కెన్యాలో చిన్న రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించారు. ఉత్తర అమెరికాలోని కెనడాలో ముందు జాగ్రత్త చర్యగా కనోలా రైతులు 2023కు కూడా ఇప్పుడే నిల్వలు చేసుకుంటున్నట్లు వార్తలు. ఇప్పటికే ధరలు పెరగ్గా వచ్చే ఏడాది ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. అమెరికాలో గతేడాది ఎరువుల ధరలు 17 శాతం పెరగ్గా, ఈ ఏడాది 12 శాతంగా ఉండవచ్చని అంచనా. కొందరు రైతులు తక్కువ ఎరువులతో పండే పంటల వైపు చూడటం, సాగు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు. తమ పంటలకు ఎంత ధరలు వస్తాయనిగాక ఇంత ఖర్చు పెట్టి సాగులోకి దిగాలా, ఎరువుల సరఫరా ఉంటుందా అనే ప్రాతిపదికన ఆలోచించి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికాలోని కొందరు ఎంపిలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఎరువుల మీద పన్నులు తగ్గించాలని కోరారు. గతేడాది తన రైతుల రక్షణకు గాను చైనా ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది సడలించవచ్చని, అదే జరిగితే కొంత మేరకు ఇతర దేశాలకు సరఫరా పెరగవచ్చని భావించారు. ఇప్పుడేర్పడిన అనిశ్చిత పరిస్ధితుల్లో అది జరగకపోవచ్చని చెబుతున్నారు.
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశం మీద ఒక కమిటీని వేస్తామని కేంద్రం ప్రకటించి నెలలు గడిచినా మాటల్లేవు, చేతల్లేవు. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కబుర్లు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. పెంచుతున్న చమురు ధరలకు అంతర్జాతీయ పరిస్ధితులు కారణమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఎరువుల ధరలకూ ఇదే పాట పాడతారా? భారం మొత్తాన్ని రైతుల మీదనే వేస్తారా? అదే జరిగితే గ్రామీణ భారతంలో పరిస్ధితులు మరింత దిగజారుతాయి. మొత్తంగా ధరలు పెరుగుతాయి.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News