Sunday, April 28, 2024

విష వాయు విలయం

- Advertisement -
- Advertisement -

sampadakiyam telugu   చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్‌డౌన్‌ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి 3 గం. సమయంలో ఇళ్ల నుంచి బయటికి తరిమేసిన తీరు మరింత హృదయ విదారకమైనది. విశాఖ నగర శివారుల్లోని ఎల్‌జి పాలిమర్స్ రసాయన పరిశ్రమ నుంచి లీకైన స్టైరన్ వాయువు ఆదమరచి నిద్రపోతున్న జనం మీద పెద్ద పులిలా లంఘించి సృష్టించిన బీభత్సం అంతింతని చెప్పరానిది. పలువురు మరణించడం, అస్వస్థులు కావడంతో పాటు ఆ 5 గ్రామాల ప్రజలు అగ్నిపర్వతం బద్దలై లావా వెంట వస్తున్న చందంగా ఆ చీకటిలో గుండెలరచేత పట్టుకొని పరుగులు తీసినప్పుడు అనుభవించిన వేదన మృత్యుముఖంలో గిలగిలలాడిన స్థితితో పోల్చదగినది.

విష రసాయన వాయువు తాకిడికి కళ్లు మండి మూసుకుపోయినందువల్ల ఒక వ్యక్తి బావిలో పడి మరణించడం, మరొకరు మేడ మీద నుంచి కింద పడి అకాల మృత్యువు పాలు కావడం, ఇంకొకరు పరుగెడుతూ పరుగెడుతూ హఠాత్తుగా కూలిపోయి ప్రాణాలు వదలడం, అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఫుట్ పాత్‌ల మీదనే ఒరిగిపోడం ఊహించడానికి కూడా సాధ్యం కానంత పెను విపత్తు. భూకంపం సంభవించిన స్థాయిలో ఈ విష వాయువు ఒక ప్రాంతం మొత్తాన్ని కకావికలు చేసి సాగించిన విలయ తాండవాన్ని ఏమనాలో దేనితో పోల్చాలో తెలియని అయోమయ స్థితి. అందుకే అలనాటి భోపాల్ గ్యాస్ లీకేజీ పెను విషాదం వెంటనే అందరికీ గుర్తొచ్చింది. అప్పుడు మృతులు వేల సంఖ్యలో ఉండడం ఇప్పుడు, పది పన్నెండు మందే కావడం భోపాల్ ఘటనతో దీనిని పోల్చడం సబబుకాదనే అభిప్రాయానికి తావివ్వవచ్చు.

కాని మానవాభ్యుదయానికి, ప్రపంచ ప్రగతికి తోడ్పడతాయనే కారణం చూపి అనుమతించే పరిశ్రమలు ప్రజల ప్రాణాల మీదికి దాపురించడం విషయంలో అప్పటి ఇప్పటి ఘటనలు రెండింటినీ ఒకే మాదిరివిగా భావించాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి దారుణ దుర్ఘటనలకు పూర్తిగా తెరపడకపోడమే దేశంలోని పాలక వ్యవస్థ మొత్తాన్ని బోనెక్కిస్తున్నది. గుప్పెడు ఉద్యోగాలు కల్పించే ప్రతి పరిశ్రమకు, పెట్టుబడికి, అన్ని సౌకర్యాలు కల్పించి, ఎర్ర తివాచీ పరచి, వింజామరలు వీచి ఘనంగా స్వాగతించే పాలకులు ప్రజల ప్రాణాలకు, నిశ్చింత నిద్రకు, నివాసానికి ముప్పు తెచ్చే ఇటువంటి ప్రమాదాలకు అణుమాత్రమైనా చోటు లేని విధంగా సంబంధిత నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడలేకపోతున్నారు.

లాక్‌డౌన్‌ను ఎత్తి వేయనున్న దశలో పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి అనుమతించిన అధికార్లు అందులోని భారీ ఎత్తు రసాయన నిల్వలు అదుపు మీరకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తనిఖీ చేయకపోడమే ఈ ప్రమాదానికి మూల కారణమని బోధపడుతున్నది. స్టైరెన్ మోనోమర్ గ్యాస్‌ను వందల టన్నుల కిమ్మత్తులో నిల్వ ఉంచిన ట్యాంకర్లను కూలంకషంగా పరిశీలించి లోపరహితంగా ఉండేటట్టు అధికార యంత్రాంగం తనిఖీలు చేసి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. 2400 టన్నుల నిల్వ సామర్థం గల ట్యాంకులో నింపిన 1800 టన్నుల ద్రవ రూప గ్యాస్ లీక్ అవ్వకుండా కట్టుదిట్టాలు జరిపి ఉండవలసింది. మైనస్ 20 డిగ్రీల అతిశీతల స్థితిలో మాత్రమే ద్రవంగా ఉండే ఈ గ్యాస్, ఉష్ణోగ్రత పెరిగిపోడంతో వాయు రూపం ధరించి వాతావరణంలోకి ప్రసరించింది. అందులోని ఆక్సిజన్‌ను హరించివేసి ఈ కల్లోలానికి కారణమైంది. 1961లో హిందూస్థాన్ పాలిమర్స్ పేరిట నెలకొన్న ఈ కంపెనీ 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి కెమ్ కైవసమైంది.

పరిశ్రమను నెలకొల్పినప్పుడు ఆ ప్రాంతం నిర్జన ప్రదేశమై ఉండవచ్చు. కాని జనావాసాలు వెలిసిన తర్వాత దానిని అక్కడి నుంచి తరలించేలా చూసి ఉంటే కొంత ప్రయోజనం కలిగి ఉండేది. బడా పరిశ్రమల వైపు కన్నెత్తి చూడడానికే భయపడే అధికార యంత్రాంగం తీరు ఇటువంటి కంపెనీలలో క్రమం తప్పకుండా తనిఖీలు జరగనివ్వడం లేదు. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రలో ప్రమాదకరమైన రసాయన, ఔషధ పరిశ్రమలను నెలకొల్పడంపై, అణు విద్యుత్తు కర్మాగారాన్ని కూడా స్థాపించదలచడం పై స్థానిక ప్రజల నుంచి చిరకాలంగా నిరసన వ్యక్తమవుతున్నది. అది మరింతగా పెరగడానికి తాజా ప్రమాదం దోహదపడుతుంది. మృతి చెందిన వారి కుటుంబాలకు, ఇతర బాధితులకు భారీ పరిహారాన్ని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరు మెచ్చుకోదగినది. అదే సమయంలో ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులకు తగిన శిక్షలు పడేలా చూడవలసి ఉంది. దేశ వ్యాప్తంగా ఇటువంటి పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీసి వాటిని జనావాసాల మధ్య నుంచి దూరంగా జరిపించడం పాలకులు తీసుకోవలసిన తక్షణ చర్య.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News