Monday, April 29, 2024

మోడీతో ఢీ ఎవరితరం కాదు : వ్లాదిమిర్ పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో : భారతదేశంతో ఇప్పుడు ఏ దేశం పోటీకి దిగలేదని, ప్రధాని మోడీతో ఎవరు తగవుకు దిగలేరని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు పటిష్ట రీతిలో ఉంది. సరైన నాయకత్వం ఉందని తెలిపిన పుతిన్ ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. తమ దేశం రష్యా పూర్తిగా ఇండియాను విశ్వసిస్తుందని, అంతర్జాతీయ యవనికలో భారత్ రష్యాకు వ్యతిరేకంగా పాచికలు విసరదని తమకు భరోసా దక్కిందని వివరించారు. గురువారం రష్యన్ స్టూడెంట్స్ డే సందర్భంగా అధినేత పుతిన్ కలినిగ్రాడ్ ప్రాంతంలో విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. అంతర్జాతీయ పరిణామాలను ప్రస్తావిస్తూ భారతదేశం ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో రేటింగ్‌లో ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభిస్తోందని, దేశ ప్రయోజనాలనే పరమావధిగా చేసుకుందని ప్రస్తావించారు. రష్యా నేత కార్యక్రమం గురించి రష్యా మీడియా నెట్ వర్క్ రష్యా టుడే తెలియచేసింది.

ప్రపంచ స్థాయిలో చూస్తే భారతదేశం అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించింది. ప్రపంచ స్థాయిలో ప్రగతిదారులలో విఖ్యాతి వహించింది. ఇదంతా కూడా ప్రధాని మోడీ కనబరుస్తున్న లక్షణాల ఫలితంగా దక్కిన విజయం అన్నారు. మోడీ నాయకత్వంలోనే దేశం ఇప్పుడు త్వరితగతిన ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటి ప్రపంచంలో వేరే ఏ దేశం స్వతంత్ర విధానాన్ని పాటించలేదని, అయితే 150 కోట్ల జనాభాగల దేశంగా ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో సత్తాను ప్రదర్శించుకునే హక్కు ఉందని తెలిపారు. ఈ హక్కు ఇప్పుడు మోడీ నాయకత్వంలో మరింత వాస్తవికం అయిందన్నారు. దీనిని తాను కేవలం ఉత్తుత్తి ప్రకటనగా చెప్పడం లేదని , పలు దశలలో వ్యక్తం అవుతున్న స్పందనలు, పలు మిత్రదేశాల చర్యలను దీర్ఘకాలిక , మధ్యస్థ దశలలో బేరీజు వేసుకుని చెపుతున్న నిజం అన్నారు. భారతదేశం పూర్తిగా వాస్తవిక కోణంలో సాగుతోంది. ఈ దశలో రష్యా వైఖరి ఏ విధంగా ఉండాలనేది ఆలోచించుకోవల్సిందే అన్నారు. మనం ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకుండా ఉండే దేశాలు,

ఆ దేశాల నాయకత్వాలను విశ్వసించాలా? లేక ఇటువంటి చేష్టలకు దిగకుండా ఉండే ఇండియా వంటి దేశం వైపు మొగ్గు చూపాలా? అని ప్రశ్నించారు. ఇండియాలో తలపెట్టిన మేకిన్ ఇండియా ఇన్షియేటివ్ పరిణామం సత్ఫలితాలను ఇచ్చిందని రష్యా నేత కొనియాడారు. భారతదేశంలో రష్యా అతి పెద్ద పెట్టుబడులు పెడుతున్న దేశం అని తెలిపారు. మరింతగా రష్యా పెట్టుబడులు భారత్‌లో ఉంటాయని కూడా వివరించారు. రష్యా కంపెనీ రోసెనెఫ్ట్ ఇండియాలో 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు దిగిందని పుతిన్ తెలిపారు. అంతేకాకుండా ఓ ఆయిల్ రిఫైనరీ, ఓ గ్యాస్‌స్టేషన్ల నెట్‌వర్క్, ఓ పోర్టు వంటి వాటిలో భాగస్వాములం అయ్యామని తెలిపారు. కేవలం ఆర్థికంగానే కాకుండా భారతదేశం ఇతరత్రా కూడా విశిష్టతను సంతరించుకుందని, వైవిధ్య , ఆకర్షణీయ సంస్కృతుల సమాహారంగా ఉందన్నారు. రష్యాతో పాటు పలు దేశాలలో భారతీయ సినిమాలు జాతీయ టీవీలలో ప్రసారం అవుతున్నాయని, ఇంతటి సార్వత్రికతను ఇండియా సంతరించుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News