Monday, April 29, 2024

రష్యా నేత పుతిన్ న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : ఇజ్రాయెల్ హమాస్ పరస్పర దాడుల నేపథ్యంలో హుటాహుటిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించారు. చైనా అధినేత జి జిన్‌పింగ్, ఇతర అతికొద్ది మంది నేతలతో అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. అయితే ఆయన చైనా పర్యటన దశలో ఎక్కడికి వెళ్లినా వెంట ఓ బ్రీఫ్‌కేసు ఉండటం చర్చకు దారితీసింది. పుతిన్ వెంబడి ఉన్న ఇద్దరు రష్యా నౌకాదళాధికారులు యూనిఫాంలలో ఈ బ్రీఫ్‌కేసును పట్టుకుని ఉన్నారు. ఇది రష్యాకు చెందిన అణ్వాయుధాల కీలక సమాచారంతో కూడిన సూట్‌కేసు అని ప్రచారం సాగుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. రష్యాలోని ఓ ప్రముఖ పర్వతం ఛెగెట్ పేరుతో ఈ బ్రీఫ్‌కేసును పిలుస్తారు. అత్యవసరం అయినప్పుడు రష్యా అధినేత అణ్వాయుధ దాడులకు అధికారిక అనుమతిని కల్పించేందుకు అవసరం అయిన విస్తృత స్థాయి వ్యవస్థ ఈ బ్రీఫ్‌కేసులో ఉంటుందని రష్యాలోని ఆయన విమర్శకులు చెపుతుంటారు. ఇందులో అత్యంత కీలకమైన ఉన్నతస్థాయి భద్రతాయుత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది.

ప్రత్యర్థి దేశాలపై అవసరం అయినప్పుడు అణ్వాయుధ దాడులకు అధినేత నుంచి తమ దేశపు రాకెట్ బలగాలకు ఆదేశాలు వెలువరించేందుకు వీలైన బటన్‌లు, అనేక కోడ్ వర్డ్ ఇందులో ఉంటాయి. ఇటీవలి కాలంలో రష్యా అధ్యక్షులు పరిమిత రీతిలోనే విదేశీ పర్యటనలకు వెళ్లుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆయనను వెన్నంటి ఇద్దరు నేవీ అధికారులు , వీరి వెంట ఈ బ్రీఫ్‌కేసు తప్పనిసరిగా ఉంటోంది. ఈ బ్రీఫ్‌కేసులోని అత్యంత కీలకమైన కజ్బెక్ ఎలక్ట్రానిక్ కమాండ్ అండ్ కంట్రోలు నెట్‌వర్క్ ద్వారా సంబంధిత బలగాలకు సమాచారం అందిస్తారు. ఇందులోని కోడ్ ఇతరత్రా సమాచారం కేవలం పుతిన్‌కు తెలిసి ఉంటుంది. ఈ సూట్‌కేసు ఒకవేళ తెరుచుకోబడితే అది ప్రపంచ స్థాయిలో తీవ్ర అంతర్యుద్ధానికి దారితీస్తుందని అమెరికా ఇంటలిజెన్స్ నిపుణులు తెలిపారు. 1995 ప్రాంతంలో ఓసారి ఈ బ్రీఫ్‌కేసు తెరిచి , దాడులకు ఆదేశాలు వెళ్లేందుకు దేశాధ్యక్షులు సంసిద్ధం అయినట్లు, చివరి క్షణంలో ఆలోచన విరమించుకున్నట్లు గతంలో ఓ అమెరికా పత్రిక ఒకటి తెలిపింది.

అప్పట్లో అమెరికా, కొన్ని యూరప్ దేశాల నుంచి రష్యాకు అత్యంత ప్రమాదకరమైన ముప్పు తలెత్తుతుందని రష్యా నిఘా సంస్థలు పేర్కొనడంతో రష్యా ఈ బ్రీఫ్‌కేసును తెరిచేందుకు యత్నించింది. ఇక ఉక్రెయిన్‌పై యుద్ధం, అంతర్జాతీయ స్థాయిలో తీవ్రస్థాయి ప్రతిఘటనలు, ఆంక్షలు, యుద్ధనేరాలకు తనపై వారంట్లు వెలువడ్డ దశలో పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఈ న్యూక్లియర్ బ్రీఫ్‌కేసుతోనే వెళ్లుతున్నారు. అయితే ఈ న్యూక్లియర్ బ్రీఫ్‌కేసు పుతిన్ తయారుచేసింది కాదు. తొలిసారిగా 1990 91లో అప్పటి రష్యా అధ్యక్షులు మిఖాయిల్ గొర్బచేవ్ హయాంలోనే దీనిని రూపొందించారు. సిద్ధం చేసి ఉంచారు. తరువాత ఇది ఇప్పుడు పుతిన్ చేతికి దొరికింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News