Saturday, April 27, 2024

ఆయకట్టు వైపు కృష్ణమ్మ అడుగులు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు
సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదల
రైతులతో 9వ తేదీన మంత్రి పువ్వాడ భేటీ
కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరదనీరు

Water Release from Nagarjuna Sagar left canal

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ఎడమకాలువకు స్థానిక శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జి ల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్, నాగార్జునసాగర్ చీఫ్‌ఇంజనీరు వి.నర్సింహాతో పాటు సం బంధిత విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. తొమ్మిది రోజులపాటు నీటిని విడుదల చేసి ఆ తర్వాత 7రోజులపాటు వారబంధీ నిర్వహిస్తారు. అనంతరం మరో తొమ్మిది రోజులపాటు నీటిని విడుదలచేస్తారు. ఆ తర్వాత కొంత విరామం ఇస్తారు. మొత్తంగా ప్రస్తుత వర్షాకాలంలో 45 రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే నీటి విడుదలను ప్రతి రోజు పెంచుతారు. శనివారం ఇంజనీరింగ్ అధికారులు సమావేశమై రోజువారి నీటి విడుదలపై ప్రణాళిక సిద్దం చేయనున్నారు. అంతకుముందు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించేందుకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కృష్ణానదీ ఎగువన ప్రవాహాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సారి వర్షాలు బాగాకురిసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఈ వానాకాలం పంటల కోసం పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని సిఎం అధికారులకు చెప్పారు.

నీటివిడుదల కోసం విజ్ఞప్తి చేసిన మంత్రులు
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద నల్గొండ, ఖమ్మం జిల్లాలలో సుమారు 6.50 లక్షల ఎకరాలకు సాగర్ ఆయ కట్టుకు నీటిని విడుదల చేయాలని మంత్రులు జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్ సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు సిఎం కెసిఆర్‌ను కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఎగువనఉన్న అల్మట్టి నుంచి శ్రీశైలంలో భారీగా నీరు చేరుతున్న క్రమంలో ఇప్పటికే 225 టిఎంసిల నీరు ఉందని తెలిపారు. ఈ నీటిలో తెలంగాణకు 70టిఎంసిలు, ఎపి డెల్టాకు 80టిఎంసిలు, డెడ్‌స్టోరేజ్ 140 టిఎంసిలు, 10టిఎంసిలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించాల్సి ఉందని మంత్రులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అల్మట్టి నుంచి వందలాది కూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న తరుణంలో నీటిని విడుదల చేయాలని మంత్రులు జగదీష్‌రెడ్డి, పువ్వాడ సిఎం కెసిఆర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్ నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్ ఆయకట్టు నీటి అవసరాలు, వినియోగంపై నీటిపారుదల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం నీటి పారుదల శాఖ కార్యాలయంలో సమావేశమై ఖమ్మం ఆయకట్టు నీటి వినియోగంపై ప్రణాళికలను సిద్దం చేయనున్నారు.

Water Release from Nagarjuna Sagar left canal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News