Monday, April 29, 2024

మూసీనది ప్రవాహంలో 200 ట్రాన్స్‌ఫార్మర్‌లు కొట్టుకుపోయాయి: ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ చాలా తక్కువగా ఉందని, గ్రిడ్‌లకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత 2,660 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పడిపోవడం ఇదే అత్యల్పమన్నారు. ఎన్టీపిసి సహకారంతో గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. గ్రిడ్‌లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ఇంజనీర్స్‌తో పాటు తాను కూడా మంగళవారం రాత్రి మొత్తం మానిటరింగ్ చేశానన్నారు. మనదగ్గర తెలివైన ఇంజనీర్స్ ఉన్నారని, మన గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గినా, పెరిగినా మన గ్రిడ్‌లకు ఎలాంటి ఢోకాలేదన్నారు. నగరంలో విద్యుత్ లేకపోవడం, చాలా అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి నీరు రావడంతో విద్యుత్ సరఫరాను తామే నిలిపివేశామన్నారు.
చాలాచోట్ల సబ్‌స్టేషన్‌లలో నీరు
చాలాచోట్ల సబ్‌స్టేషన్‌లలో నీరు చేరిందని, దీంతో తమ ఇంజనీర్స్ విద్యుత్‌ను నిలిపివేశారని, నీటిని తొలగించగానే విద్యుత్‌ను పునర్‌ః ప్రారంభిస్తామన్నారు. మూసీనది ప్రవాహంలో 200 ట్రాన్స్‌ఫార్మర్‌లు కొట్టుకుపోయాయని, ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు. అపార్ట్‌మెంట్‌లలోకి నీరు చేరితే విద్యుత్‌ను నిలిపివేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా స్థంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. ఎక్కడైనా స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. హైడల్ విద్యుత్ పూర్తిస్థాయిలో నడుస్తోందని, 50 శాతం విద్యుత్‌ను మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి త్వరలోనే నివేదిక వస్తుందని, దురదృష్టవశాత్తు కొందరు అధికారులకు కరోనా వైరస్ సోకిందని అందులో భాగంగానే కొంత ఆలస్యం అయ్యిందని ఆయన తెలిపారు.

200 transformers washed away in Musi river floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News