Sunday, April 28, 2024

దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి

- Advertisement -
- Advertisement -
cm kcr

 

కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి
అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా చేస్తాం
వైరస్ తీవ్రతపై అనుక్షణం పర్యవేక్షణ ఉంటుంది
5,274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయి
– ప్రగతిభవన్ మీడియా మీట్‌లో సిఎం కెసిఆర్
స్వీయ నియంత్రణే అతిపెద్ద మందు
నేనూ చప్పట్లు కొడతా… మా కుటుంబం మొత్తం కొడుతుంది. సోషల్ మీడియాలో ప్రధాని మోడీ మాటలను అవహేళన చేయడం కరెక్ట్ కాదు,
వైద్యులకు కృతజ్ఞతలు తెలపడానికి సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొట్టాలని ప్రధాని చెప్పారు. ఆయన మాటలకు పెడర్థాలతో పోస్టులు పెడుతున్నారు. పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి
కరోనాకు స్వాభిమానం చాలా ఎక్కువ.. దానిని మనం ఆహ్వానిస్తే తప్ప మన ఇంటికి రాదు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తట్టుకునే శక్తి తెలంగాణకు ఉంది అనేలా ఉండాలి. అవరమైతే రేషన్ కూడా ఇంటికి పంపిణీ చేయాలని చూస్తున్నాం. దీని కోసం రెండు నుంచి ఐదువేల వాహనాలను కూడా సిద్ధ్దం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజలను కాపాడుకోవడం కోసం పూర్తిస్థాయిలో సంసిద్దతతో ఉన్నాం. రూ.10వేల కోట్లు అయినా ఖర్చు చేస్తాం.

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు కొనసాగుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. అన్నీ బంద్ ఉంటాయని, అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. దేశంలో కరోనాను కట్టడికి ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపునకు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కేంద్రం 14 గంటల పాటు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం 24 గంటల పాటు పాటిద్దామన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించి మరోసారి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలుపుదామన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అవసరమైతే బంద్ చేసుకుంటామన్నారు.

ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ సంబంధించి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ముందుగానే జాగ్రత్తలు ప్రారంభించారు. విదేశాల నుండి వచ్చే వారి నుండి ఈ వైరస్ వచ్చిందన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 వేల వరకు విదేశాల నుండి హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. నిన్న ఒక్క రోజే 15 వందల మంది వచ్చారన్నారు. వీరిలో 11వేల మందిని గుర్తించాన్నారు. 7-00 మందికి అనుమానిత లక్షణాలు ఉండగా వారిలో 21 మంది కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయిందని సిఎం వెల్లడించారు. వీరు కూడా ఇతర దేశాల నుండి వచ్చిన వారేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 వేల మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, సెల్ఫ్ రిపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇందులో వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదన్నారు. ప్రభుత్వమే చికిత్స తో పాటు అన్ని ఖర్చులు భరిస్తుందన్నారు. కరోనా కట్టడికి 5274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయమని సిఎం కెసిఆర్ తెలిపారు. అలాగే 63,000 మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, 60 సంవత్సరాలు ఉన్న వృద్ధులు రెండు వారాలపాటు బయటికి రావొద్దు అని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. 78 నిఘా బృందాలు ఇతర దేశాల నుంచి వచ్చే వారి పర్యవేక్షణ కోసం పనిచేస్తున్నాయన్నారు. అలాగే 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో 5గురు అధికారులతో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని సిఎం తెలిపారు.

విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా పెట్టామన్నారు. వారికి విజ్ఞప్తి చేస్తున్న, మీరు మా బిడ్డలే సమాజ హితం కోసం ప్రభుత్వం చెప్పినట్టు వినాలని సూచించారు. ఇతరులకు హాని కలిగించవద్దని, స్వయం నియంత్రణ పాటించాలన్నారు. విదేశాల నుంచి వారి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా…. స్వచ్ఛందంగా తెలుపండి అని కోరారు. అలా చేస్తేనే సమాజం ,రాష్ట్రం, ప్రపంచం మొత్తం బాగుపడుతుందన్నారు. దగ్గు,జలుబు,జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని కోరారు. రిపోర్ట్ చేయకపోతే తప్పించుకోలేరని, 60 వేల మంది పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు చెక్ చేస్తున్నారని వివరించారు. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన 12 మంది మత ప్రచారకుల్లో 10 మందికి పాజిటివ్ వచ్చిందిన్నారు. వారంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సిఎం కెసిఆర్ తెలిపారు.

మీకు చేతులెత్తి దండం పెడుతున్నా..బయట తిరగకండి

విదేశాలనుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నా.. ఎట్టిపరిస్థితుల్లో వారు ప్రజలమధ్య తిరగవద్దని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు ప్రజల మధ్యతిరిగితే కుటుంబ సభ్యులకుప్రమాదమని, సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారిని మాత్రమే క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండటం ఇష్టం లేకపోతే స్వీయ గృహ నిర్భందంలో ఉండవచ్చని పేర్కొన్నారు.

బస్సులు.. మెట్రోలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం బస్సులు నడవవని, అయితే అత్యవసర పరిస్థితుల కోసం డిపోకు 5 చొప్పున బస్సులు అందుబాటులో ఉంచుతామని సిఎం స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సులను కూడా నగరంలోకి రానివ్వమన్నారు. అలాగే మెట్రో ఐదు రైళ్ళు మాత్రం అత్యవసర సేవల కోసం సిద్దం చేశామన్నారు. విమానాలు, నౌకలు ఒకే రోజున బంద్ చేయడం సాధ్యం కాదన్నారు.

వైరస్ తీవ్రతను బట్టిన వాటిపై కూడా నిషేధాలు ఉంటాయన్నారు. ప్రధాని మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ తనతో పాటు మరికొంత మంది ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని ప్రస్తావించారన్నారు. షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా ఎవరికి వారు స్వచ్ఛందగా బంద్ చేసుకుని జనతా కర్ఫూకు సహకరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి బందులు అనేకం చేసుకున్నామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అదే స్పూర్తితో ఆదివారం కూడా అందరూ బంద్ పాటించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో మహరాష్ట్ర బార్డర్‌ను మూసివేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. వైరస్ ప్రభావాన్ని బట్టి దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని సిఎం వెల్లడించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని సిఎం పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సిసిఎంబిని వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని తాను చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే మనకు అందులో రోజుకు వెయ్యి మందికి పరీక్ష చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

పరిస్థితి చేయిదాటితే ఇంటికే రేషన్ యోచన
కరోనాకు స్వాభిమానం చాలా ఎక్కువ.. దానిని మనం ఆహ్వానిస్తే తప్ప మన ఇంటికి రాదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన తట్టుకునే శక్తి తెలంగాణ ఉంది అనేలా ఉండాలని సూచించారు. అవరమైతే రేషన్ కూడా ఇంటికి పంపిణీ చేయాలని చూస్తున్నామని సిఎం వెల్లడించారు. దీని కోసం రెండు నుంచి ఐదువేల వాహనాలను కూడా సిద్దం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో సంసిద్దతో ఉందని రూ.10వేల కోట్ల అయినా ఖర్చు చేస్తామన్నారు.

ప్రధాని మాటాలకు కూడా అవహేళన చేస్తారా ? కెసిఆర్ ఆగ్రహం
ప్రధాన మంత్రి చెప్పిన మాటలను కూడా కొందరు అవహేళన చేస్తున్నారని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదన్నారు. ఆయన మాటాలకు పెడర్ధాలు తీస్తూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం తగదన్నారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయంత్రం ఐదు గంటలకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేలా, దేశమంతా ఐక్యంగా ఉందని చాటి చెప్పడానికి చప్పట్లు కొట్టాలని ప్రధాని చెప్పారన్నారు.

దీన్ని కూడా కొంత మంది ఇడియట్స్ తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారు వారిపై కేసులు బుక్ చేయమని డిజిపిని ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. పిఎంకు సంఘీభావం తెలపడం కోసం తాను చప్పట్లు కొడుతా…. మా కుటుంబం మొత్తం కొడుతారన్నారు. ప్రధాన మంత్రి చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. దీని కోసం రాష్ట్రం నలుమూలలా సాయంత్రం 5 గంటలకు సైరన్ వచ్చేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఆ సమయంలో ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి అందరూ చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు.

వైద్యబృందాల పనితీరు బేష్
కరోనా నియంత్రకు వైద్యబృందాలు చేస్తున్న పనితీరు అమోఘంగా ఉందని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. ఇందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు,. వారు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని, వారికి మనం కూడా అండగా ఉండాలన్నారు. వైద్యుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమన్నారు. వారికే వైరస్ సోకితే మనలను ఎవరు కాపాడలేరన్నారు. వైద్యం అందించేందుకు విదేశాల నుంచి కూడా ఎవరు రారన్నారు. అందువల్ల వైద్యుల ఆరోగ్యం చాలా ముఖ్యమైనందన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News