Monday, April 29, 2024

ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!

- Advertisement -
- Advertisement -

KISHAN REDDY

 

వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్‌డౌన్‌ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల కోసం టికెట్ ధర కేవలం రూ.50లే నిర్ణయించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి మరో 300రైళ్ళను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు.

స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనే వలసకార్మికుల కోసం శుక్రవారం ఒక్క రోజునే ఆరు రైళ్లు నడిపామని, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలింపులో కేంద్రం, ఆయా రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులే గుర్తిస్తారన్నారు. వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి, ఎవరూ రైల్వే స్టేషన్‌లోకి రావొద్దు అని కోరారు. వారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం, అని మంత్రి స్పష్టం చేశారు. దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్ ధర నిర్ణయించామని, టిక్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలన్నారు.

ముఖ్యమంత్రుల విజ్ఞప్తుల మేరకే….
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత వచ్చిన ఏకాభిప్రాయం మేరకు లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించామని కిషన్‌రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్రం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రాలు ఇచ్చే సమాచారం ఆధారంగానే జోన్ల వర్గీకరణ జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ లు, 284 ఆరెంజ్ జోన్ లు, 319 గ్రీన్ జోన్ లు ఉన్నాయన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇకపై లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని, వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 2,290 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. దేశంలోని 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ కూడా నమోదు కాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. మరో 40 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు చేశామని ఆయన వెల్లడించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో 2.52 లక్షల పడుకలు, 27వేల ఐసియూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2.22లక్షల పిపిఇ కిట్లను సేకరించాలని నిర్ణయించామన్నారు. దీంతో పాటు 30కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సిద్ధం చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు.

 

300 Trains for Migrant Workers from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News