Thursday, May 9, 2024

కొవిడ్ సెంటర్‌గా మార్చిన స్కూలులో తొలి రోజు గడిపిన ఆర్నబ్

- Advertisement -
- Advertisement -

Arnab Goswami spends night at school in Alibaug

ముంబయి: ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టు అయిన రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నబ్ గోస్వామి అలీబాగ్ కారాగారానికి కొవిడ్-19 సెంటర్‌గా ఏర్పాటు చేసిన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బుధవారం రాత్రి గడిపారు.  ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్‌ల ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై బుధవారం నాడు అరెస్టు చేసిన ఆర్నబ్, మరో ఇద్దరు నిందితులను మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని అలీబాగ్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా వారికి నవంబర్ 18 వరకు జుడిషియల్ కస్టడీకి కోర్టు రిమాండు చేసింది. గోస్వామిని తమకు 14 రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. బుధవారం రాత్రి గోస్వామిని వైద్య పరీక్షల నిమిత్తం అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

వైద్య పరీక్షల అనంతరం ఆయనను అలీబాగ్ కారాగారానికి కొవిడ్ సెంటర్‌గా ఏర్పాటు చేసిన అలీబాగ్ నగర్ పరిషద్ స్కూలుకు తీసుకెళ్లినట్లు ఆ అధికారి చెప్పారు. గోస్వామి రాత్రి అక్కడే గడిపారని తెలిపారు. గోస్వామితోపాటు ఈ కేసులో నిందితులైన ఫిరోజ్ మొహమ్మద్ షేక్, నితేష్ శారదలను కూడా అలీబాగ్ కోర్టులో బుధవారం హాజరుపరచగా వారికి కూడా కోర్టు నవంబర్ 18 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. ఈ ముగ్గురు నిందితుల పేర్లను అన్వయ్ నాయక్ రాసినట్లు పోలీసులు పేర్కొంటున్న సూసైడ్ నోట్‌ను పుణెలోని చేతిరాత నిపుణులకు పంపినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News