Monday, April 29, 2024

భూ కబ్జాదారులపై చర్యలు!

- Advertisement -
- Advertisement -

government lands

 

ప్రభుత్వానికి నివేదిక అందచేసిన అధికారులు
ఖాతాలను పునః పరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం
లీజు భూముల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములపై ఆరా

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల నేపథ్యంలో కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు తాజాగా లీజు భూముల వ్యవహారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అ త్యంత విలువైన సికింద్రాబాద్, హైదరాబాద్‌లలోని లీజు భూములకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. లీజు గడువు ముగిసినా రెన్యువల్ చేయించుకొని భూ ములతో పాటు కోర్టు వివాదాలు, నోటీసులు ఇచ్చిన వివిధ రకాల లీజు భూములపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా భూములకు ప్రస్తు తం హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్టేట్ అధికారిగా వ్యవహారిస్తున్నారు.

మొత్తం పర్యవేక్షణ, ఉత్తర్వు లు, రెన్యువల్, జరిమానాలు సిసిఎల్‌ఏ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగుళం భూమి కూడా సికింద్రాబాద్ పరిధిలోని జీరా లీజు భూములు, సాధారణ లీజు భూములు, కంటోన్మెంట్ లీజు భూములతో పాటు నిజాం సొంత భూములు, మోండా మార్కెట్ పరిధిలోని భూముల వివరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. ఆయా భూముల వివరాలను సేకరించడంతో పాటు గతంలో ఉన్న చట్టాలను పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భూములకు సంబంధించి న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం న్యాయశాఖ సలహా కోరినట్టుగా సమాచారం.

కేంద్ర సంస్థల భూములపై వివరాల సేకరణ
బీహెచ్‌ఈఎల్, బీడిఎల్, మిధానీ, డిఆర్‌డిఏ, బీఈఎల్, హెచ్‌ఏఎల్, టిఐఎఫ్‌ఆర్, ఆర్‌సిఐ, డిఎంఆర్‌ఎల్, ఎన్‌ఎఫ్‌సీ తదితర కేంద్ర సంస్థలకు ప్రభుత్వం గతంలో భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో భూముల విలువ ఎంత, ఎంత భూమిని లీజుకు ఇచ్చారు, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్న కోణంలో ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. కేంద్ర సంస్థలకు భూములిచ్చిన ఇతర రాష్ట్రాలు ఏ విధానాలను అనుసరిస్తున్నాయ విషయాలపై కూడా రాష్ట్రం ఆరా తీస్తోంది. ఆయా సంస్థలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత భూమి సరిపోతుంది, ఇచ్చింది ఎంత, అంతా వినియోగిస్తున్నారా, ఉపయోగించని భూమి ఎంతన్నది స్పష్టంగా తెలపాలని జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే 20 జిల్లాల నుంచి వివరాలను సమాచారం వచ్చిందని, ఎన్నికల అనంతరం మిగతా జిల్లాల నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశముందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

వివిధ అవసరాల నిమిత్తం లీజులు
నిజాం సర్కార్‌కు స్వాతంత్య్రం రాకముందు రాష్ట్రంలో భారీగా భూములున్నాయి. ప్రస్తుతం ఈ భూముల్లో చాలా భాగం అన్యాక్రాంతం అయ్యాయని, మరికొన్ని చోట్ల లీజుకు సంబంధించి రెన్యువల్ జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో నిజాంల భూములకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వం పునః పరిశీలించాలని నిర్ణయించింది. నిజాం భూములు ఎక్కువగా సికింద్రాబాద్‌లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో చాలా భూములను వివిధ అవసరాల నిమిత్తం భారీగా లీజులకు ఇచ్చినట్టుగా తేలింది.

ఈ లీజు కూడా ఏకమొత్తంగా 90 సంవత్సరాల పాటు ఇచ్చినట్టుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 1930 కంటోన్మెంట్ రూల్ ప్రకారం ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి లీజు రెన్యువల్ జరగాల్సి ఉండగా ఎక్కడా అలా జరగడం లేదని అధికారులు గుర్తించారు. కొన్ని లీజుల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 1945 సంవత్సరంలో ఉన్న నిజాం భూముల లీజుకు సంబంధించి నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

తాజా మార్కెట్ ధరలపై సమీక్ష
వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఏఏ సంస్థలకు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చామన్న దానిపై వివరాలను సేకరిస్తోంది. అప్పట్లో ఇచ్చిన భూముల వివరాలు, ప్రస్తుతం భూమి అవసరం ఎంత, లీజు ఎంతకాలం, ఎంత మొత్తానికి లీజుకిచ్చాం, స్వాధీనం చేసుకునే అవకాశాలపై జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులు, అద్దెలకు ఇచ్చిన స్థలాల గురించి ప్రభుత్వం వివరాలను సేకరిస్తోంది. దీంతోపాటు ఆయా స్థలాల తాజా మార్కెట్ ధరలను కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది.

Action on encroachment of government lands
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News