Monday, April 29, 2024

సంపాదకీయం: ఎవరిది విజ్ఞత?

- Advertisement -
- Advertisement -

All Parties campaign in GHMC Elections

మాట మంచిదైతే మంది మంచివారవుతారు, మరింత చేరువవుతారు. ఎవరి విజ్ఞత ఏ పాటిదో వారి మాటను బట్టి చెప్పవచ్చు. వేడిగా, వాడిగా సాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచార ఘట్టంలో ఎవరి ప్రసంగాల పరిణతి ఎంతో, ఎవరి మాటల్లోని సభ్యత, సహేతుకత ఏమిటో వెల్లడవు తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుర జనులకు ప్రాణప్రదమైన మంచి నీటి సమస్యను ప్రస్తావించి అందరినీ అబ్బుర పరిచే విధంగా ఉచిత సరఫరాను హామీ ఇచ్చారు. అది కూడా వచ్చే నెలలోనే అమలు పరుస్తామని చెప్పారు. ఎవరు చెప్పారనేది కాకుండా ఏమి చెప్పారనేదే చెప్పిన వారి మీద గౌరవాన్ని పెంచుతుం ది. నీటికి, కన్నీటికి ఒకే అక్షరం తేడా. హైదరాబాద్ నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి నీరు చాలినంతగా సకాలంలో అందక కన్నీళ్లు తెప్పించిన సందర్భా లు, మహిళలు పొద్దస్తమానం వాటి కోసమే పడిగాపులు పడి, కుళాయిల వద్ద సిగపట్లకు కూడా తెగించక తప్పని పరిస్థితులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాము.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆ దుస్థితి చాలా వరకు దూరమైందనే చెప్పాలి. కేశవాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా నగర మంచి నీటి కొరతను శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి కెటిఆర్ ఇటీవలే ప్రకటించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ మరో మెట్టు పైకి వెళ్లి హైదరాబాద్ నగర వాసులకు 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఈ పథకం అమలు తీరును పరిశీలించి రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు దానిని విస్తరింప చేసే విషయం యోచిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాకాలంలో నానా బీభత్సాన్ని సృష్టిస్తున్న హైదరాబాద్ మురుగు నీటి పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేసి దానిని విస్తరించి ఆ నీటిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరద నీటిని సక్రమంగా జన విపత్తుకు ఆస్కారం లేకుండా పారించే వ్యవస్థ కోసం బృహత్ ప్రణాళికను అమలు చేయనున్నట్టు చెప్పా రు. ఏదైనా హామీ ఇచ్చేవారి నిజాయితీని ప్రజలు వారి గత చర్యల గీటురాయి మీద పెట్టి చూసుకుంటారు. అది అమలు అయ్యేదో కాదో తేల్చుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే కరెంటు తీగల మీద గుడ్డలు ఆరవేసుకోవలసి వస్తుందని శాపనార్థాలు పెట్టిన వారిని ఆశ్చర్యంలో ముంచివేస్తూ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్తు కొరత అన్నదే లేకుండా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

అలాగే రైతులకు నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ దేశాన్నే అబ్బురపరుస్తున్న ఖ్యాతి కూడా దానిదే. ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన మంచి నీరు సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ, నీటి పారుదల రంగంలో విప్లవాత్మక మలుపు అనిపించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని సాకారం చేసిన విశిష్టత కూడా ఈ ప్రభుత్వానిదే. అందుచేత ముఖ్యమంత్రి కెసిఆర్ తాజాగా చేసిన వాగ్దానాల పట్ల ప్రజల్లో అపరిమితమైన నమ్మకం ఏర్పడుతుందని చెప్పుకోనక్కర లేదు. రాష్ట్ర వ్యాప్తంగా క్షుర కార్మికుల దుకాణాలకు, లాండ్రీల కు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్తు వాగ్దానం ఆయా బలహీన వర్గాల వారిని అమిత ఆనందపరుస్తుంది. టిఆర్‌ఎస్ ఒకవైపు ఈ విధంగా ప్రజోపయోగకర ఆలోచనలు చేస్తూ అందుకు అనువైన ఆచరణీయమైన జనానందకరమైన వాగ్దానాలు ప్రకటిస్తూ ఎన్నికల రంగం లో ధీరోదాత్తంగా ముందుకు వెళుతుంటే జిహెచ్‌ఎంసి పాలక మండలిలో ప్రస్తుతం కేవలం నాలుగు స్థానాలే ఉన్న బిజెపి ఉన్నపళంగా మేయర్ పదవినే చేజిక్కించుకుందామనే ఆరాటంతో ప్రజలకు, నగర క్రమశిక్షణకు హాని కలిగించే వాగ్దానాలను కూడా చేస్తున్నది.

టూ వీలర్స్ పై ట్రిపుల్ రైడింగ్ ను అనుమతిస్తామని తమకు మేయర్ పదవి చిక్కగానే బకాయి పడి ఉన్న ట్రాఫిక్ చలాన్లు అన్నింటినీ చెల్లించి వేస్తామని మొన్నటి వరదల్లో పౌరులు ఏది నష్టపోతే అది స్కూటర్, కారు, ఇల్లు వంటివన్నింటినీ కొత్తగా వారికి సమకూరుస్తామనే వాగ్దానాలతో ఉత్తర కుమార ప్రకటనలు చేస్తున్నది.ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లను అనుమతించ డమంటే కోతిని కొండముచ్చును చేయడం వంటిదే. యువతలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించడమే. రోడ్డు ప్రమాదాలు పెరగడానికి దారులు వేయడమే. హైదరాబాద్ నగర కార్పొరేషన్ విజయం తో మొదలు పెట్టి తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మొత్తం దక్షిణాదినే గెలుచుకొని కాషాయమయం చేస్తామని ఆకాశంలో ఓడలు, సముద్రంలో విమానాలు నడుపుతాం అనే మాదిరి గొప్పలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బిజెపి యువ విభాగం అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రకటించగా, ఒక నెటిజన్ బిర్యానీని, హలీమ్‌ను కూడా నిషేధిస్తారేమోనని చమత్కరించడం గమనించవలసిన విషయం. మాట మన్నికను తేవాలే గాని ఎగతాళిని ఆకర్షించరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News