Monday, April 29, 2024

ఉస్కో అంటే చూస్కో.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు జాగిలాలు నేస్తాలు

- Advertisement -
- Advertisement -

Army Dogs act as true friends to soldiers

 

షోపియాన్ : జమ్మూ కశ్మీర్‌లో విధినిర్వహణలో అంకితభావంతో ఉండే మన జవాన్లకు శిక్షణ పొందిన జాగిలాలు నిజమైన స్నేహితులుగా వ్యవహరిస్తున్నాయి. పలు క్లిష్ట పరిస్థితులలో మెళకువగా వ్యవహరించే శక్తి, అన్నింటిని పసికట్టే నేర్పు ఈ జాగిలాల సొంతం. ఈ జాగిలాల సాయంతో మన దేశ సైనికులు పలు రకాలుగా పొంచి ఉండే ముప్పు నుంచి బయటపడుతున్నారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు తీవ్రస్థాయి మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ విధినిర్వహణలో సాగేందుకు ఈ జాగిలాలు బాగా ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ నిరంతర జాగరూకత దశలో వారికి తోడుగా రెండేళ్ల ప్రాయపు పెంపుడు కుక్క, అందులోనూ సైనిక తర్ఫీదు పొందిన లబ్రాదార్ ఉగ్రవాదుల వేటలో ఉండే జవాన్లకు హమేషా తోడుగా ఉంటోంది. ఇది మనిషి కన్నా ఎక్కువ చురుగ్గా శక్తివంతంగా ఉంటూ, విధులలో ఉండే జవాన్లకు ముందు పొంచి ఉండే మందుపాతరలు, మాటేసి ఉండే శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు తన సైగలతో తెలియచేస్తుంది.

దీనితో జవాన్లు అప్రమత్తం అయి ప్రమాదాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడమే కాకుండా, దేశ సరిహద్దులను ఉగ్రవాదులు, శత్రు సేనల నుంచి తగు విధంగా రక్షించేందుకు వీలేర్పడుతోంది. రాష్ట్రీయ రైఫిల్స్ వద్ద మొత్తం ఆరు ఇటువంటి శిక్షణ పొందిన జాగిలాలు ఉన్నాయి. వీటిలో రోష్ ఒకటి. సైనికుల పాలిట దోస్తులుగా ఉంటూ, మాటలకు అతీతంగా కాపలా బాటలో సాగుతూ తమ వెంట ఉండే జవాన్లను ప్రాణంగా పదిలంగా కాపాడుకుంటూ ఉంటాయి. దక్షిణ కశ్మీర్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉండే ఉగ్రవాదులు, బయటి నుంచి తరలివచ్చే విద్రోహశక్తులతో ఇక్కడ పనిచేయడం సైనికులకు ప్రతి నిమిషం సాము గారడీనే అవుతుంది. అయితే ఈ ఆర్‌ఆర్ యూనిట్‌కు రోష్, తాపీ, క్లైడీ వంటి జాగిలాలు వెన్నంటి ఉంటూ పారాహుషార్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పలు ఉగ్రవాద నిరోధక చర్యలలో తమ బలగాలకు ఈ జాగిలాలు బాగా ఉపయోగపడుతున్నాయని 44 రాష్ట్రీయ రైఫిల్స్ సారధిగా ఉన్న కల్నల్ ఎకె సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News