Monday, April 29, 2024

థర్డ్ జెండర్ల చదువుకు సాయం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు లో పొందుపరచారు. ఆ లెక్కల ప్రకారం దేశంలో ఇతరులు 5 లక్షల దాకా ఉన్నట్లు తేలింది. పూర్తిగా ఆడ లేదా మగ కాని తమ పిల్లల వివరాలను బయటపెట్టడానికి తల్లిదండ్రులు వెనుకాడారు. నిజానికి ఆ సంఖ్య ఆరేడు రెట్లు ఎక్కువగా ఉంటుందని సామాజిక కార్యకర్తల అభిప్రాయం. 6 నుంచి 10 ఏళ్ల వయసున్న బాలల్లో అప్పటికే లింగ నిర్ధారణ స్పష్టంగా తేల్చలేకపోవచ్చు.

Assistance in study of third genders

ఆడా, మగా కాక మధ్య రకపు జాతిగా పుట్టిన మనిషి తన లింగ రహస్యాన్ని దాచి పెట్టుకోవడానికి చేసే యత్నాలన్నీ టీనేజీ వయసులో బయటపడతాయి. లోన మగతనంలేని మగ పుట్టుక పుట్టి పైకి మగాడిలా ఉంటూ అంతటా పుల్లింగముగా రికార్డు అవుతూ ఏ జాతిలోనూ కలువలేక అనుభవించే మనోవేదనకు అంతు దొరకదు. మానవ చరిత్ర తొలి అంకం నుంచి ఆడంగిల అస్తిత్వం కనబడుతుంది. రాజు నుంచి పేద దాక ఆ లక్షణాల బారిన పడినవాళ్లే. సర్దుకుపోయే రోజుల నుంచి నాగరికత పెరిగి ఆడంగిలను సమాజం ఈసడించుకోవడంతో కన్నవాళ్ళు తరిమేయడమో, బాధలు భరించలేక వాళ్లే ఇల్లు వదిలేయడమే జరుగుతోంది. సజాతి జీవులతోనో, ఒంటరిగానో మనసు చంపుకొని కడుపు నింపుకుంటూ కాలం వెళ్లదీయడం వారికి మిగిలిన జీవనయానం. వేడుకలు జరిగే ఇళ్ల ముందుకెళ్లి నానా రభస చేసి, డబ్బులు రాబట్టుకునే ఛీత్కార బతుకులు వారి సొంతం. వాస్తవానికి దేశపౌరులుగా మైనారిటీ హక్కులకు నిజమైన వారసులు వీరు. రాజ్యాంగంలో చోటు దక్కిందోలేదో కాని ప్రభుత్వాల కన్ను పడడానికే ఏళ్ళు గడుస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందులో పొందుపరచారు. ఆ లెక్కల ప్రకారం దేశంలో ఇతరులు 5 లక్షల దాకా ఉన్నట్లు తేలింది. పూర్తిగా ఆడ లేదా మగ కాని తమ పిల్లల వివరాలను బయటపెట్టడానికి తల్లిదండ్రులు వెనుకాడారు. నిజానికి ఆ సంఖ్య ఆరేడు రెట్లు ఎక్కువగా ఉంటుందని సామాజిక కార్యకర్తల అభిప్రాయం. 6 నుంచి 10 ఏళ్ల వయసున్న బాలల్లో అప్పటికే లింగ నిర్ధారణ స్పష్టంగా తేల్చలేకపోవచ్చు. సమాజంలో అవహేళనగా బతుకుతున్న వీరి బాగోగుల కోసం 2016లో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) బిల్లును తెచ్చింది.
ఒక వ్యక్తి తాను పూర్తిగా మగ లేదా పూర్తిగా ఆడ కాదని, ఆడ మగ మిశ్రమ లక్షణాలున్నాయని, ఆడ మగ ఏది కాని మనిషినని నిర్ధారించుకుంటే జిల్లా కమిటీ ముందు హాజరై గుర్తింపు పత్రాన్ని పొందవచ్చు. తద్వారా ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ఇచ్చే రాయితీలను, సదుపాయాల్ని అనుభవించవచ్చు. 2014లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిస్తూ, భారత శిక్షా స్మృతి నుండి ఇందుకు సంబంధించిన సెక్షన్ 377 ను కొట్టివేసింది. వీరిని థర్డ్ జెండర్ గా గుర్తించి సమాజంలో అందరిలా గౌరవంగా జీవించే సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెళ్లి హక్కు, వారసత్వపు ఆస్తిలో పాలు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వీరికంటూ విడిగా ఉండాలని ఆ తీర్పులో ఉంది.
ఈ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల ఉన్నతి కోసం ‘స్త్మ్రల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ నేతృత్వంలో ఇది పని చేస్తుంది. ట్రాన్స్ జెండర్ల పునరావాసం, ఆరోగ్యం, విద్య, వృత్తి నైపుణ్యాల శిక్షణ దీని లక్ష్యాలు. ఇందుకు గాను పైలెట్ ప్రాజెక్టు కేంద్రాలుగా దేశంలోని 10 ప్రధాన నగరాలను ఎంచుకుంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఏడవ తరగతి నుండి ఉన్నత విద్య దాకా స్త్మ్రల్ ఉపకార వేతనాల్ని అందజేస్తుంది. 7 నుండి 10 వ తరగతి వరకు నెలకు రూ.1000 /-, ఇంటర్ మీడియట్‌లో నెలకు రూ.1500 /-, డిగ్రీ ఆ పై చదువులకు నెలకు రూ. 2000 /- చొప్పున ఏడాదికి 10 నెలలు ఉపకార వేతనం స్త్మ్రల్ అందిస్తుంది. దీని కోసం ఆధార్ లింకైనా బ్యాంక్ ఖాతా, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ అవసరం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ మధ్య అన్ని పత్రికల్లో వచ్చింది. స్త్మ్రల్ నేషనల్ పోర్టల్ ద్వారా ట్రాన్స్ జెండర్ ధ్రువీకరణ, గుర్తింపు కార్డును పొందవచ్చు. దీని కోసం tgcertification2020@gmail.com కు మెయిల్ చేయవచ్చు. లేదా 0112 3386981 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
దేశంలో సగానికి పైగా ట్రాన్స్ జెండర్లకు ఏ రకమైన విద్య అవకాశాలు దొరకడం లేదని జాతీయ మానవ వనరుల కమిషన్ 2018లో పేర్కొంది. 2019 నుండి ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ వీరి కోసం అడ్మిషన్ ఫీజుని మాఫీ చేస్తోంది. ఈ సదుపాయం వల్ల సుమారు వేయి మంది ఇగ్నో కోర్సులలో చేరినట్లు లెక్క తెలిసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాయికి ఒక్కరు కూడా చేరిన దాఖలా లేవు. దేశంలో చదువుకొంటున్న ట్రాన్స్ జెండర్ల లెక్క కోసం అన్ని కళాశాలల్లోని అడ్మిషన్ ఫారాల్లో థర్డ్ జెండర్ కాలమ్ ఉండాలని యూనివర్సటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేక 58 % మంది పాఠశాల విద్యని మధ్యలో వదిలేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ దుస్థితి నివారణకు ప్రభుత్వ పథకాల అమలులో చిత్తశుద్ధి అవసరం.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్యయంగా కొన్ని ప్రత్యేక సంక్షేమ పథకాలను థర్డ్ జెండర్ల కోసం రూపొందించి అమలు చేస్తున్నాయి. కేరళ 2020 నుండి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తోంది. దీనికి తోడు వారి చట్టబద్ధమైన రీతిలో పెళ్లి చేయుకుంటే ఖర్చుల కోసం రూ.30000/- ఇస్తోంది. దేశంలోనే ట్రాన్స్ జెండర్స్ పాలసీ తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం 2008లో ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా విద్య, ఆరోగ్య భద్రత కల్పిస్తూ వారి కోసం విడి హాస్టళ్లను తెరిస్తోంది.
ఇప్పటికైతే హైదరాబాద్‌లోని యూనివర్సిటీల్లో ట్రాన్స్ జెండర్ల కోసం విడి వసతి గృహాలు లేవు. కొన్ని చోట్ల వారి రూప వేషధారణ కారణంగా లేడీస్ హాస్టల్ కేటాయిస్తున్నా అది విమర్శలకు దారి తీస్తోంది. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ తమ తటస్థ లింగ విద్యార్థుల కోసం అవసర సదుపాయాల్ని కల్పిస్తామని మార్చి 26 నాడు తమ ట్విట్టర్లో ఉంచింది. అది సాకారమైతే ఈ దిశగా అడుగులు పడ్డట్లే. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్లు ట్రాన్సజెండర్లకు కూడా ఇవ్వాలని వారి సంఘాలు కోరుతున్నాయి. గత నెలలో వారు సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన సందర్భంలో ఆయన ‘అధికారిక బృందం తమిళనాడు, కర్ణాటక, కేరళలలో అధ్యయనం చేసి ఒక నిర్దిష్ట ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది’ అని ఆశాభావం కల్పించారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా పొలాచ్చి లోని సహోదరి ఫౌండేషన్ వీరి కోసం ఎంతో కృషి చేస్తోంది. స్వయం గా ట్రాన్స్ జెండర్ అయిన కల్కి సుబ్రహ్మణ్యం స్థాపించిన ఈ సంస్థ చదువు, స్కూల్ ఫీజు ఖర్చుల కోసం ఒక్కరికి ఏడాదికి రూ. 20000 /- అందిస్తోంది. అవసరార్థులు reachsaho dari@gmail.com ఇ మెయిల్‌కు గాని, 7639741916 నెంబర్ కు గాని ఫోన్ చేయవచ్చు
ఈసడింపులకు బదులు ప్రోత్సాహం అందిస్తే తామెవరికీ తీసిపోమని కొందరు ట్రాన్సజెండర్లు నిరూపించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జోయితా మండల్ అనే ట్రాన్స్ జెండర్ దేశంలోనే తొలి జడ్జిగా రికార్డుల్లోకెక్కారు. అదే విధంగా తమిళనాడులో ప్రితికా యాషిని చూలైమేడు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్సెపెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇలా మన తోబుట్టువుల విజయ గాధలెన్నో ప్రతి రంగంలో ప్రతి చోటా ఉంటాయి. వాటి సంఖ్య పెరగడానికి అందరి తోడ్పాటు అవసరం.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News