Monday, April 29, 2024

అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’

- Advertisement -
- Advertisement -

‘Atmanirbhar Bharat’ for sale

 

సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది మంది వ్యక్తుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయని, అవి సమాజ శ్రేయస్సును వాంఛించవని, సామాజిక స్పృహను కలిగి ఉండవని గత 30 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ కాలం నిరూపిస్తున్నది.

జాతీయోద్యమ కాలంలో వెల్లువెత్తిన ప్రజల ఆకాంక్షల వెలుగులో తక్కువ సమయంలో ఆర్థికవ్యవస్థ వేగం పెంచడానికి ప్రజల పేదరికం తొలగిపోవడానికి ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటు చేశారు. తొలి ప్రధాని, నవ భారత నిర్మాత నెహ్రూ ప్రజాస్వామ్య సామ్యవాద సమాజాన్ని స్థాపించాలనే తలంపును కలిగి ఉన్నారు. వ్యక్తి స్వేచ్ఛపై విధి నిషేధాలు పెట్టనిది ప్రజాస్వామ్యం. సమష్టి క్షేమానికై వ్యక్తి స్వేచ్ఛను అవసరమైనంత వరకు అరికట్టడం తప్పదనేది సోషలిజం. ఒకటి మరొక దాన్ని కబళించకుండా భారత సమాజ పురోగతిని నెహ్రూకాంక్షించారు. ప్రజాస్వామ్య సోషలిస్టు వ్యవస్థ విషయంలో ప్రపంచానికే ఒక శిక్షణాలయంగా మన దేశం మారాలని అనుకున్నారు. 1955లో యు.యన్ దేభర్ అధ్యక్షతన జరిగిన అవద్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద ప్రాతిపదికగా గల నవ సమాజ నిర్మాణంను తన లక్ష్యంగా ప్రకటించింది. 1956 పారిశ్రామిక తీర్మానంలో సామ్యవాద తరహా నమూనా అభివృద్ధి కోసం, ఆర్ధిక వ్యవస్థ నిర్మాణాన్ని ప్రస్తావించారు.

సహజ వనరులు, ముడి చమురు, బొగ్గు ఖనిజాలు జాతీయం చేసి స్వదేశీ పరిజ్ఞానంతో మౌలిక సౌకర్యాలు కల్పన, భారీ యంత్రాల తయారీ స్థాపన జరిగింది. వీటిలో ప్రైవేట్ రంగాన్ని పరిమితంగా అనుమతించడం జరిగింది. రక్షణ, శక్తి, గనుల రంగాలలో ప్రైవేట్‌ను అనుమతించలేదు. సమతుల్య ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేయడం కోసం, ఏకస్వామ్య నిరోధించడం కోసం ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. బలహీన వర్గాల అభ్యున్నతి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగ కల్పన పెరుగుతుందని భావించడం జరిగింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కోసం, వినియోగ వస్తువులను అందుబాటు ధరలో ఉంచడం, ఆదాయ పంపిణీ చేయడం, ధరల స్థిరీకరణ వ్యవసాయ అభివృద్ధి జరగడానికి తోడ్పడతాయి.

ఈ క్రమంలో నెహ్రూ 444 పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించారు. టర్నోవర్ ఆధారంగా వీటిలో 8 సంస్థలను మహారత్నగా, 16 సంస్థలను నవరత్నగా, 75 సంస్థలను మినిరత్న హోదాను అందుకున్నాయి. హిందూస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్‌ఎంటి)ని స్థాపించిన తొలి రోజులలో ఉద్యోగులను జపాన్ లో శిక్షణ ఇప్పించి సొంతగా విడి భాగాల తయారీ, అమరికను హెచ్‌ఎంటి చేపట్టింది. గడియారాలు, ట్రాక్టర్ల తయారీలో రారాజుగా ఎదిగింది. ఇలా ప్రజలకు ఉపయోగపడే అన్ని మౌలిక రంగాలలో పరిశ్రమలను ఇదే విధంగా అభివృద్ధి చెందించారు.

రక్షణ రంగ, అణుశక్తి, అంతరిక్ష సంస్థలలో స్వయం స్వాలంబన సాధించడం కోసం హెచ్‌ఎఎల్, బిఇఎంఎల్, బిడిఎల్, ఎన్‌ఎండిసి , భారజల కేంద్రాలను వంటి అనేక సంస్థలను స్థాపించారు. స్టీమ్ శక్తి కి ఉపయోగపడే బొగ్గు గనులను, ఇంధనవనరు అయిన ముడి చమురు ఆధారిత ఒఎన్‌జిసి, బిపిసిఎల్, ఐఒసిఎల్, విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడే పవర్ గ్రిడ్‌ను, ఎన్‌టిపిసి, గెయిల్‌లను, ఈ పరికరాలను తయారు చేసే బిహెచ్‌ఇఎల్‌ను ఇలా అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అలాగే ప్రజలకు రుణాలు ఇవ్వడం కోసం, పొదుపులకోసం, ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన ద్రవ్యం కోసం అనేక బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది.

1991 నూతన పారిశ్రామిక తీర్మానం, నూతన పరిశ్రమలను ప్రైవేట్ రంగంలో స్థాపన కోసం అనుమతించింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులను అమలు చేయడంలో నిర్లక్ష్యం, మరి కొన్ని యాజమాన్యాల అవినీతి, మరి కొన్ని ప్రభుత్వ నిధుల కేటాయింపు తక్కువ కావడం వల్ల నిర్వహణ ఒడిదుడుకులకు కారణమయ్యింది. అయితే నూతన ఆర్థిక విధానాలకు తెరలేపిన పివి, ఐక్య ప్రగతిశీల కూటమి హయాంలో ప్రైవేట్ రంగంపై పరిమితులు ఎత్తివేసి లైసెన్స్ రాజ్‌ను సరళీకృతం చేసింది. కానీ ప్రభుత్వ పరిశ్రమల నుండి పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాలను భారీగా చేపట్టలేదు. పైగా జబ్బుపడ్డ సంస్థలను బిఐఎఫ్‌ఆర్‌కు నివేదించి బాగు చేసే ప్రయత్నాలు చేసింది.

మొదటి సారిగా వాజ్‌పేయి హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. 2014 వరకు చక్కగా పని చేసే 200కు పైగా ప్రభుత్వ యాజమాన్య పరిశ్రమలు 2019 నాటికి వాటి సంఖ్య వందకు చేరింది. ఇదే కాలంలో అంబానీ సంపద రూ. లక్ష 35 వేల కోట్ల నుండి ఆరు లక్షల మూడు వేల కోట్లకు, అదాని సంపద 14 వేల కోట్ల నుండి 3 లక్షల 63 వేల కోట్లకు చేరింది. ఇటీవల నివేదిక ప్రకారం అదాని సంపద అమెజాన్ అధినేతను మించి పోతున్నారని తెలియచేసింది.

పవర్ గ్రిడ్, రూరల్ ఎలక్ట్రికల్ వంటి సంస్థలకు పరికరాలను సమకూర్చే బిహెచ్‌ఇఎల్‌కు గత ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి ఆర్డర్‌లు రావడం లేదు. పవర్ రంగంలో అదాని గ్రూప్ కు అపరిమిత స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. ఈ సంస్థలన్నీ తమకు కావాల్సిన పరికరాలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నది. రక్షణ, అంతరిక్ష రంగంలో క్షిపణులను, రాకెట్లను, తేలికపాటి హెలికాఫ్టర్‌లను తయారు చేసే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 2014 వరకు రూ. 20 వేల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. 2019 నాటికి వెయ్యి కోట్ల అప్పును కలిగి ఉండే స్థాయికి మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

అంబానీ లాంటి స్వదేశీ సంస్థలకు రక్షణ విభాగ కాంట్రాక్ట్‌లను ఇచ్చింది. రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు అమ్మే ఫ్రాన్స్, ఇజ్రాయెల్ , అమెరికా వంటి ఆయుధ వ్యాపార దేశాల నుండి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను బలహీనం చేస్తుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుని, చివరగా కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పక్కాగా పని చేస్తున్నది. కిరాణ కొట్టు సామానుల కోసం ఇంటి వెండి అమ్మినట్టుగా లాభాదాయకంగా నడుస్తున్న ఐఒసి, హెచ్‌పిసిఎల్, గెయిల్ లాంటి వాటిలో పెట్టుబడులను ఉపసంహరణకు తెగబడుతున్నారు.

దీనికి పరాకాష్ఠగా ఇటీవల ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యాపారం చేయదు అది దాని విధి కాదు అని విస్పష్టంగా ప్రకటించాడు. వెనువెంటనే 12 ప్రభుత్వ సంస్థల ఆమ్మకానికి నీతి ఆయోగ్ సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. నష్టాలలో ఉన్న ప్రైవేట్ ఎస్ బ్యాంకును జాతీయం చేస్తూ జాతీయం కాబడిన 27 బ్యాంకులను విలీనం చేస్తూ 12 బ్యాంకులుగా కుదిస్తున్నారు. జాతీయ బ్యాంకులలో పేరుకుపోయిన మొండిబకాయిలన్నీ ప్రైవేట్ వాళ్ళ వే. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అప్పులు ఎగ్గొట్టిన దాఖలాలు లేవు. ప్రవేట్ రంగంలో పాలనా విధానాలు బాగుంటే అప్పులు ఎందుకు ఎగవేస్తున్నాయి అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకా బీమా, రైల్వేలను అమ్మడానికి ముమ్మర ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.ఈ చర్యలు భారత రాజ్యాంగ పీఠిక సామ్యవాద స్ఫూర్తికి విరుద్ధమైనవి.

సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకృతమై ఉండకూడదు అది సమాన పంపిణీ అవ్వాలన్న రాజ్యాంగ ప్రవచనాన్నీ ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామిక సంక్షేమ ప్రభుత్వ స్థానంలో కార్పొరేట్ ప్రభుత్వం పాలిస్తున్నదని స్పష్టమవుతోంది. సమాజ వనరులు నీరు, నేల, అడవి అన్ని కార్పొరేట్స్‌పరం అవుతున్నాయి. తమ ముందే తమ వనరులు పరాయీకరణ అవుతుంటే భరించలేని అదివాసీలు, రైతులు నిరసనలు తిరుగుబాట్లు చేసే అవకాశముంది. ఇప్పటికే రైతులు కార్పొరేట్స్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శాంతియుత ప్రతిఘటన చేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఉద్యమ తీవ్రత పెరిగితే సమస్యలు పరిష్కరించడానికి బదులు అణచడానికి పోలీస్ సైనిక సాధనాలను ఉపయోగించడానికి కార్పొరేట్ ప్రభుత్వాలు వెనుకాడవు. మేధావులు, ప్రజాతంత్రవాదులు తమ బుద్ధి శక్తిని, సమీకరణ శక్తిని పెంచి రాజ్యాంగ ప్రజాస్వామ్య సోషలిజం పరిరక్షణకు పని చేయాలి. తమతో సజీవ సంబంధాలు ఉన్న కార్మిక కర్షక సాంఘిక వర్గాల ప్రయోజనాల రక్షణ బాధ్యతను భుజానికి ఎత్తికోవాలి. ఫెసిలిటేటర్‌గా మారిన ప్రభుత్వాన్ని ఉత్పత్తి, పంపిణీ విధుల వైపు మళ్ల్లించాలి. సుస్థిర సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వ రంగమే చోదకశక్తిగా మారాలి. అవి జాతి జనులకు సేవలందించే విధంగా మలచడానికి పౌర సమాజం మహా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమాన్ని నడపడమే ముందున్న కర్తవ్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News