Monday, April 29, 2024

బోరబండలో అస్తిపంజరం కలకలం

- Advertisement -
- Advertisement -

Body found in a box at Borabanda

హైదరాబాద్: సెల్లార్‌లో ఉన్న గదిలో అస్తిపంజరం వెలుగులోకి రావడంతో కలకలం రేగిన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ ఇందిరానగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బోరబండ సమీపంలోని ఇందిరానగర్ ఫేజ్2 బస్తీలోని శ్రీ షిరిడీ సాయిబాబ ట్రస్ట్ దేవస్థానంలోని సెల్లార్‌లోని గదిని 2017లో గాయత్రి హిల్స్‌కు చెందిన పలాష్ పాల్‌కు 11 నెలలకు అగ్రిమెంట్ చేసుకుని అద్దెకు ఇచ్చారు. పలాష్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అద్దెకు తీసుకున్న గదిని పలాష్ చెక్క సామగ్రి తయారీ గోదాంగా ఉపయోగిస్తున్నాడు. 11నెలలకు అద్దె చెల్లించిన పలాష్ తర్వాత అద్దె చెల్లించడంలేదు. దేవస్థాన నిర్వాహకులు పలుమార్లు అద్దె విషయమై అడిగినా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్ నుంచి గదిని మూసి పెట్టాడు.

అయితే గది అద్దె డబ్బులతోనే ఆలయంలో పూజారికి వేతనం ఇస్తుండడంతో నిర్వాహకులు పలుమార్లు పలాష్ పాల్‌కు ఫోన్ చేసి డబ్బులు అడిగారు. తాను ముంబాయిలో ఉన్నానని ఒకసారి, కోల్‌కతాలో ఉన్నానని మరో సారి చెబుతూ తప్పించుకుతిరుగుతున్నాడు. అద్దె చెల్లించకుంటే గదిని తెరుస్తామని హెచ్చరించడంతో గత డిసెంబర్ 31వ తేదీన రూ.10,000 మాత్రం అద్దె రూపంలో ఓ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. తర్వాత పలాష్ పాల్ తిరిగి రాకపోవడంతో గత నెల 28వ తేదీన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది ఖాళీ చేసి గోవర్దన్ అనే మరో వ్యక్తికి అద్దెకివ్వడం కోసం పోలీసులు, స్థానికుల సమక్షంలో మంగళవారం గది తాళం తీశారు. ఇందులో భాగంగా బుధవారం గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి సామగ్రిని తరలిస్తుండగా ఓ చెక్కపెట్టేలో అస్తిపంజరం కనిపించింది. దీంతో ఖంగుతిన్న గోవర్దన్ వెంటనే ఆలయ నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో వారు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవస్థాన చైర్మన్ వేముల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అస్తిపంజరం 30 ఏళ్ల యువకుడిదిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగి 10నెలలు జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News