Monday, April 29, 2024

వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు.

వడగాలుల తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్రం, ఐఎండికి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తుందని తెలిపారు. మరోవైపు వేడిగాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్)ని కేంద్ర మంత్రి ఆదేశించారు.

ఈ ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేలా తగిన సలహాలు , సూచనలు ఇవ్వాలని కోరారు. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని మాండవీయ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో త్వరలోనే వర్చువల్ భేటీ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యం లోనే కేంద్రం ఈ చర్యలు మొదలు పెట్టింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. బీహార్ లోని అనేక జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. వడదెబ్బ కారణంగా సోమవారం ఆ రాష్ట్రంలో 81 మంది మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్ బల్దియా ఆస్పత్రిలో మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరో 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68 కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News