Monday, April 29, 2024

చెరకు ఎఫ్‌ఆర్‌సి రూ.315కు పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2023-24 పంట సీజన్‌కు చెరకుకు క్వింటాల్‌కు రూ 315 మేర గిట్టుబాటు ధరను (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ ఎఫ్‌ఆర్‌పి) ఖరారు చేసింది. చెరకు రైతులకు ఈ మేరకు మిల్లులు ఈ కనీస ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందటి ఎఫ్‌ఆర్‌పితో పోలిస్తే ఇప్పటి పెంపుదల రూ 10గా లెక్కలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చెరకు ధర పెంపుదల నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు దీనికి అనుమతి పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది చెరకు రైతులకు దీని వల్ల ప్రయోజనం దక్కుతుందని సమావేశం తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. గత ఏడాది ఎఫ్‌ఆర్‌పి రూ 305 ఉంది. ఇప్పుడిది రూ 315 అయింది. అక్టోబర్ నుంచి ఆరంభమయ్యే చెరకు సీజన్‌లో మిల్లర్లు రైతులకు క్వింటాల్‌కు ఈ రూ 315 చొప్పున సముచిత కనీస ప్రోత్సాహక ధరను చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటి రేటుతో పోలిస్తే ఇది 3.28 శాతం పెరుగుదలగా ఉంటుంది. ప్రధాని మోడీ ఎల్లవేళలా అన్నదాతల గురించి ఆలోచిస్తారని , ప్రభుత్వం వ్యవసాయరంగం, కర్షకులకు ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి తెలిపారు. 2014 15 దశలో ఎఫ్‌ఆర్‌పి క్వింటాలుకు రూ 210 మేర చెరకు పలికిందని వివరించారు. ప్రస్తుత మార్కెటింగ్ కాలం అంటే 2022 23లో దాదాపు 3,353 లక్షల టన్నుల మేర చెరకును చక్కెర ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి. దీని విలువ రూ 1,11,366 కోట్లు వరకూ ఉంటుంది. బిజెపి అధికారంలోకి వచ్చే నాటికి రైతుల నుంచి మిల్లర్ల కొనుగోళ్లు కేవలం రూ 57,104 కోట్లు అని, పైగా పలు రకాలుగా రైతులకు బకాయిల వివాదాలు ఉండేవని మంత్రి తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మిల్లర్ల నుంచి రైతులకు బకాయిల ఫిర్యాదులు ఏమీ లేవని చెప్పారు. చెరకు గిట్టుబాటు ధరతో పాటు కేంద్రమంత్రి మండలి పలు ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహపథకం పిఎం ప్రణామ్
దేశంలో వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ ఎరువులల వాడకం ప్రోత్సాహకానికి తీసుకువచ్చిన పిఎం ప్రణామ్ పథకానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే విషయంలో రైతాంగానికి సరైన విధంగా అవగావహన కల్పించేందుకు ఈ భూ సార పరిరక్షణ, రైతులలో చైతన్యం కల్పించేందుకు, వారిని సరికొత్త సహజసిద్ధ ఎరువుల వాడకానికి ప్రోత్సాహం దిశలో సాగేందుకు ఈ పథకం తీసుకువచ్చారు. ఈ పథకం ప్రకారం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే రాష్ట్రాలకు ఈ పథకం మేర కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుందని ఎరువుల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విలేకరులకు తెలిపారు. ఉదాహరణకు 10 లక్షల టన్నుల మేర సాంప్రదాయక ఎరువుల వాడకం చేస్తే తద్వారా 3 లక్షల టన్నుల మేర రసాయన ఎరువుల వాడకం తగ్గితే ఆయా రాష్ట్రాలకు రూ 3000 కోట్ల మేర సబ్సిడీ ఆదా ఉంటుంది.

పరిశోధన చేయూతకు సరికొత్త సంస్థ
దేశంలో పరిశోధనా సామర్థం మరింతగా పెంచేందుకు వీలుకల్పించేవిధంగా నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేసే బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు, అధ్యయనాల పోటీ సామర్థం పెంపుదలకు ఈ సంస్థను తలపెట్టారు. ప్రధాని అధ్యక్షతన ఉండే ఈ ఎన్‌ఆర్‌ఎఫ్ పాలకమండలిలో దాదాపు పాతిక మంది వరకూ అనుభవజ్ఞులు, ప్రఖ్యాత పరిశోధకులు సభ్యులుగా ఉంటారు. 202728 వరకూ పరిశోధనలకు సంబంధించి రూ 50,000 కోట్లను ఈ పరిశోధనల నిధికి కేటాయించారని మంత్రి మండలి భేటీ తరువాత మంత్రి ఠాగూర్ తెలిపారు. వాతావరణ పరిరక్షణ దిశలో ప్రధాని మోడీ ప్రారంభించిన సిడిఆర్‌ఐకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వాతావరణ , పర్యావరణ పరిరక్షణ దిశల్లో ఐక్యరాజ్య సమితి కట్టుబాట్లకు అనుగుణంగా వ్యవహరించేందుకు భారత ప్రభుత్వానికి సిడిఆర్‌ఐకి మధ్య కుదిరిన ఒప్పందానికి ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీనితో ఈ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News