కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు సోమవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కమిటీ సభ్యులను అభినందించి, చిత్రపురి కాలనీ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్ర పరిశ్రమ తరుపున తన మద్ధతు కొత్త కమిటీకి ఉంటుందనీ, కాలనీ సమస్యలు ఏవైనా ఉంటే తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఉపాసనతో మాట్లాడి చిత్రపురిలో మంచి ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తానని, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని రావాలని చిరంజీవి చెప్పారు. సందర్భం ఉన్నప్పుడు చిత్రపురి కాలనీని సందర్శిస్తానని కూడా మెగాస్టార్ కమిటీ సభ్యులతో అన్నారు.
చిరంజీవితో దాదాపు అర గంట పాటు చిత్రపురి కాలనీ కార్యదర్శి కాదంబరి కిరణ్, అధ్యక్షుడు వల్లభనేని అనిల్, సభ్యులు వినోద్ బాలా, దీప్తి వాజ్ పేయి, అనిత నిమ్మగడ్డ, లలిత, రామకృష్ణ ప్రసాద్, అళహరి మాట్లాడారు. తమకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన చిరంజీవికి చిత్రపురి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ “చిత్రపురి కాలనీలో మంచి ఆస్పత్రి నిర్మాణం జరగాలని మూడు నాలుగేళ్లుగా తిరుగుతున్నాను. గతంలో పవన్‌కళ్యాణ్‌ని కలిసినప్పుడు కూడా ఆయనకు ఆస్పత్రి గురించి చెప్పాం. ఆయన తన వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తానని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని చిరంజీవికి చెప్పాం. చిత్రపురిలో ఆస్పత్రి నిర్మాణం విషయమై ఉపాసనతో మాట్లాడతానని ఆయన అన్నారు. ఇందుకుగాను చిరంజీవికి కృతజ్ఞతలు చెబుతున్నాం”అని అన్నారు.