Monday, April 29, 2024

భారత్, చైనాలకు వెళ్లొద్దు: అమెరికా

- Advertisement -
- Advertisement -

భారత్, చైనాలకు వెళ్లొద్దు
ప్రయాణ మార్గదర్శకాలు సవరించిన అమెరికా
దాదాపు 50 దేశాలు లెవల్4లోనే

Citizens not visit to India and China says US

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతికారణంగా పలు దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి(లెవల్ 4)ను ఎత్తివేసింది. అయితే భారత్, చైనా సహా 50 దేశాలకు నాలుగో స్థాయి సూచనను కొనసాగించింది. దీంతో భారత్, చైనా దేశాలకు వెళ్లవద్దని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్టా మార్చి 19నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు లెవల్4 సూచనను అమెరికా జారీ చేసింది. దీంతో దాదాపు అన్ని దేశాలకు వెళ్లకూడదనే సూచన ఇప్పటివరకు కొనసాగింది. అయితే ప్రస్తుతం కొన్ని దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తాజాగా నాలుగో స్థాయి సూచనను ఎత్తివేసి మూడో స్థాయికి తగ్గించింది. ఈ సమయంలో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దాదాపు 50 దేశాలకు మాత్రం అమెరికన్లు వెళ్లవద్దని సూచించింది. ఈ జాబితాలో భారత్, చైనా అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా, మెక్సికో, బ్రెజిల్, ఈజిప్టు వంటి దేశాలు ఉన్నాయి.

ఈ జాబితాలో ఉన్న దేశాల్లోని పలు ప్రాంతాల్లో సరిహద్దుల మూసివేత, విమానాశ్రయాల మూసివేత, ప్రయాణ ఆంక్షలు, ఇంటికే పరిమితం కావాలనే నిబంధనలు, వాణిజ్య కార్యకలాపాలతో పాటుగా ఇతర సేవలపై ఆంక్షలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అమెరికన్లకు ప్రభుత్వం సూచించింది. అమెరికా విదేశాంగ వ్యవహారాల అధికారి కార్ల్ రిచ్ ఈ విషయాన్ని విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సిడిసి) సూచనల మేరకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అమెరికానుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులను అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. వివిధ దేశాల్లో ఉన్న తాజా పరిస్థితులపై (ఆరోగ్యం, భద్రత, నేరాలు, ఇతర పరిస్థితులపై) ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ ఉంటుంది. దానికోసం లెవల్1నుంచి లెవల్4 వరకు సూచనలు జారీ చేస్తుంది. ప్రయాణ మార్గదర్శకాల్లో లెవల్4 అతి తీవ్ర సూచన. ప్రస్తుతం తైవాన్ (లెవల్1), థాయిలాండ్( లెవల్2) మినహా దాదాపు అన్ని దేశాలు లెవల్3లో ఉన్నాయి. లెవల్4 జాబితాలో మాత్రం భారత్, చైనా వంటి 50 దేశాలున్నాయి.

Citizens not visit to India and China says US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News