Sunday, April 28, 2024

ముందు జాగ్రత్తలే శరణ్యం

- Advertisement -
- Advertisement -

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు

కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు

* ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు
* అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి నిరాకరణ, థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు, బార్ల మూసివేత 31 వరకు   పొడిగింపు
* పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం
* స్వీయక్రమశిక్షణే కరోనాకు మందు
* ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
* కరీంనగర్ వచ్చిన వారు వైద్యుల నిఘాలో ఉన్నారు
* రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తాం, ఇప్పటికి 1125 మందిని క్వారంటైన్ చేశాం, బయటి వారు     14  రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే
* స్వంత ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉంటామంటే పంపిస్తాం, కాని పర్యవేక్షణ ఉంటుంది
* హైదరాబాద్‌లోని సిసిఎంబిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని నేటి విడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానిని కోరుతా
* నిత్యావసర సరకులు అమ్మే దుకాణాల వద్ద జనం గుమిగూడవద్దు, అవసరమైతే తప్ప బయటికి రావొద్దు
* ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం : సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఉగాది, శ్రీరామనవమి వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ ద్వారా వినేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించవద్దని ఆయా మతాలకు చెందిన పెద్దల కోరగా, వారు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన జరుగనున్న ముస్లింలు నిర్వహించే జగ్‌నేకే రాత్‌ను రద్దు చేశామని తెలిపారు. కరోనా నియంత్రణపై గురువారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్‌పిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామన్నారు. ఎలా ముందుకు పోవాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు మూసివేత గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అప్పటికే ఖరారైన పెళ్లిళ్లను మాత్రం అనుమతి ఉంటుందని చెప్పారు. ముందే ముహుర్తం కుదిరిన పెళ్లిలకు 200 మందిలోపే అతిథులు ఉండాలని, రాత్రి 9 గంటలలోపు వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన ఫంక్షన్ హాల్స్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష
కరోనా కట్టడికి ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.ముందు జాగ్రత్తలు తీసుకోని దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. వియత్నాం చైనా పక్కనే ఉంటుందని, అయినా ఆదేశానికి ఇబ్బంది లేదని తెలిపారు. చైనా, ఇటలీ నిర్లక్ష్యం చేశాయి కాబట్టే ఇబ్బంది పడ్డాయని చెప్పారు. ఏ దేశంలో చర్యలు తీసుకోలేదో అక్కడ ఇబ్బంది ఉందని పేర్కొన్నారు. రా్రష్ట్రంలో కరోనా నియంత్రణకు పగడ్బంధీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎక్కువమంది గుడిగూడకపోవడమే శ్రేయస్కరమని అన్నారు. ఐదుమంది కంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని తెలిపారు. అవవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండాలని పేర్కొన్నారు. మాకేం అవుతుందనే నిర్లక్షం మంచిది కాదని వ్యాఖ్యానించారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందున నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజలకు నిత్యావసరాలు అందించే దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయని, అయితే దుకాణ్లాలోకి ఒకేసారి ఎక్కువమంది రాకుండా దుకాణాదారులు చూసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని, వ్యవసాయ మార్కెట్లు, ఇతర మార్కెట్లు తెరిచే ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు. ప్రజారవాణాలో వాహనాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్సులు, క్యాబ్‌లు, టాక్సీల్లో సానిటేషన్ ఎక్కువగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సానిటేషన్ ఎక్కువ మొత్తంలో చేయాలని, అది శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆ 14 కేసులూ విదేశాల నుంచి వచ్చినవే
రాష్ట్రంలో ఉన్నవారిలో ఎవరూ బారిన పడలేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన 14 కరోనా పాసిటివ్ కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు. వారిలో 5 మంది విమానమార్గం ద్వారా, 9 మంది ఇతర మార్గాల్లో వచ్చారని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వతహాగా అధికారులకు రిపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కరీంనగర్‌లో కరోనా సోకినవారు మత ప్రచారం కోసం వచ్చారని, ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సిబ్బంది ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తామని అన్నారు. రా్రష్ట్రంలో 1,125 మందిని క్వారంటైన్ చేశామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్‌పిలు, డిఎంహెచ్‌ఒలతో కమిటీ వేశామని చెప్పారు. విదేశాలు నుంచి వచ్చినవారు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా హోమ్ క్వారంటైన్ వెళ్తామంటే పంపిస్తున్నామని.. అలాంటి వారిపై ఆరోగ్య శాఖ పర్యవేక్షణ ఉంటుందన్నారు. కరోనా వైరస్ మనదేశంలో పుట్టింది కాదని చెప్పారు. ఐసోలేషన్‌లో ఉన్న వారంతా కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని సిఎం వివరించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులు
తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని సిఎం కెసిఆర్ చెప్పారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో 18 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం కెసిఆర్ వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి, క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని తెలిపారు. వారిలో ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వారికి ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో సిసిఎంబిని వాడుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని శుక్రవారం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కోరతామన్నారు. శుక్రవారం నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుచేయాలని పిఎంను కోరుతామని తెలిపారు.
పది పరీక్షలు యథాతధం
రాష్ట్రంలో 2,500 పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పది పరీక్షలు యథాతథంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కువ శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో 90 శాతానికి పైగా నిర్వహించాలని కోరారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో ప్రతిరోజూ బ్లీచింగ్ చేయడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పామని అన్నారు.

ముస్లింల ప్రార్థనలపై ఫత్వా జారీ
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ కు చెందిన జామియా నిజామియా యూనివర్శిటీ స్పందించడంతో పాటు ముస్లింలు శుక్రవారం రోజు చేసే నమాజ్ లు కుదించుకోవాలంటూ ఫత్వా జారీ చేసింది. ఫరజ్ తప్ప మిగిలిన నమాజ్ లు తమ ఇళ్లల్లోనే చేసుకోవాలని తెలిపింది. షబే మేరాజ్ రోజున ప్రదర్శనలు నిర్వహించవద్దని ఫత్వాలో పేర్కొంది. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు భక్తులు వెళ్లొద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

CM KCR Press Meet on Corona at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News