Sunday, April 28, 2024

అదనంగా రూ.14,450 కోట్ల రుణం

- Advertisement -
- Advertisement -

CM KCR reference to Prime Minister on FRBM hike

 

ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు
నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ
అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి
నెల కిందటే ఎఫ్‌ఆర్‌బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన

మన తెలంగాణ/హైదరాబాద్‌ : రాష్ట్రాల రుణపరిమితి కేంద్రం 3 శాతం నుంచి 5 శాతానికి పెంచడంతో తెలంగాణ ప్రభుత్వానికి క్లిష్ట సమయంలో ఉపశమనం లభించినట్లయింది. ఈ నిర్ణయంలో రాష్ట్రానికి అదనంగా సుమారు రూ.14,500 కోట్ల మేర రుణం లభించనుంది. చాలా రాష్ట్రాలు 3 శాతం ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలో ఉండగా, తెలంగాణకు ప్రభుత్వానికి ఇప్పటికే 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బిఎం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.34 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన 5 శాతం అంటే 1.5 శాతం అదనంగా నిధులు లభించనున్నాయి. రాష్ట్ర జిఎస్‌డిపి ప్రకారం అప్పులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. జిఎస్‌డిపి 9.69 లక్షల కోట్లకు 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బిఎం ప్రకారం రూ.34 వేల కోట్లు అవుతుండగా, అదనంగా 1.5 శాతానికి రూ.14,450 కోట్లు మొత్తంగా రూ.48,450 కోట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌తో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఏప్రిల్ నెలలో రూ.4 వేల కోట్లు, ఈ నెలలో ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు బాండ్లు, సెక్యురిటిల ద్వారా రుణాలు తీసుకుని నిధులు సమకూర్చుకుంది.

పెంచిన ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలో రుణాలు తీసుకునేందుకు కేంద్రం విధించిన నిబంధనలకు కూడా తెలంగాణ సులభంగా అర్హత సాధిస్తోంది. అయినప్పటికీ అప్పులు, వడ్డీలు కట్టేది రాష్ట్రాలు.. ఇలాంటి సమయంలో కూడా అనవసర నిబంధనలు పెట్టడంపై ప్రభుత్వం నుంచి అసంతృప్తి వ్యక్తమౌతోంది. కేంద్రం చెప్పిన నిబంధనల్లో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. అలాగే విద్యుత్ సంస్కరణల్లోనూ ముందుంది. వన్ నేషన్.. వన్ నేషన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో సంస్కరణలు తీసుకువస్తోంది. దీంతో సులువుగా 1.5 శాతం అదనపు అప్పు పొందేందుకు వీలుంది.

విపత్తు కదా.. షరతులెందుకు ?

ఎఫ్‌ఆర్‌బిఎం సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్.కె సింగ్ ఛైర్మెన్‌గా 2017లో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికలో ఎఫ్‌ఆర్‌బిఎం ఎస్కేప్ క్లాజ్‌ను పేర్కొంది. దీని ప్రకారం ఏదైనా విపత్తు సమయంలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచుకునే వెసులుబాటు ఉంది. అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం విచారకరమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొవిడ్ 19 అనేది ఒక జాతీయ విపత్తుగా పరిగణించి షరుతులు లేకుండానే 5 శాతం రుణాలు తీసుకునేందుకు అనుమతించాలని కోరుతున్నారు.

అప్పుల వాయిదా లేనట్లేనా !

లాక్‌డౌన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదాయం కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రాలకు 3 శాతం రుణపరిమితితో 6.41 లక్షల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 4.28 లక్షల కోట్లు తీసుకునేందుకు అవకాశం లభించినట్లయింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటిపోతున్న సమయంలో సిఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విలువైన సూచనలు చేశారు. అందులో ముఖ్యంగా రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కోరారు. అలాగే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేయాలన్నారు. హెలికాప్టర్ మనీ సూచన కూడా ముందుగా కెసిఆర్ సూచించారు. అయితే ఆ పేరుతో కాకపోయినా కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అప్పుల వాయిదా కూడా వేస్తే రాష్ట్రాలు కొంతమేర నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ 60 శాతానికి పెంచడంతో కూడా కొంత ఉపశమనం లభించింది. అలాగే కేంద్రం రాష్ట్రాల ఓవర్ డ్రాప్ట్ వరుస రోజుల పరిమితిని 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచగా, త్రైమాసికంలో దీనిని 50 రోజులకు పెంచిన విషయం విధితమే.

అందని రాబడి… అయినా ఆగని సంక్షేమం

సాధారణంగా ప్రభుత్వ అంచనాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున అన్ని రకాలుగా కలిపి రూ.12 వేల కోట్ల వరకు ఖాజానాకు రాబడి రావాల్సి ఉంది. అయితే మార్చి మొదటి వారం నుంచే ప్రభుత్వం సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి మూసేసింది. ఇక 22వ తేదీన జనతా కర్ఫూ, తరువాత లాక్‌డౌన్ కొనసాగుతూ వస్తోంది. దీంతో మార్చి నెలలో రూ.3 వేల కోట్లు , ఏప్రిల్‌లో రూ.1600 కోట్ల మేర మాత్రమే ఆదాయం వచ్చింది. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడటంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కోత విధించి, వాటిని వాయిదా కూడా వేసింది. అయితే ఎక్కడా సంక్షేమ పథకాలను మాత్రం నిలిపివేయలేదు. ప్రధానంగా ఉచిత బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్‌లను సమయానికి అందజేయడం, పంట కొనుగోళ్లు చేపట్టడం, ప్రతి రేషన్ కుటుంబానికి రూ.1500 చొప్పున రెండు నెలలు జమ చేయడం, కరోనా నియంత్రణకు ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు సిఎం ప్రోత్సాహకం అందించడం వంటివి కొనసాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News