Monday, April 29, 2024

ఇంటర్ క్లాస్‌లపై తర్జన భర్జన

- Advertisement -
- Advertisement -

Committee with Experts on Junior Colleges Resume

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో జూనియర్ కళాశాలల పునఃప్రారంభం, తరగతుల నిర్వహణ, బోధనా పద్దతులపై అధ్యయనం చేసేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు నిపుణులతో కమిటీని నియమించింది. కరోనా మహమ్మారి దృష్ట్యా తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతికదూరం తప్పనిసరి కావడంతో ఆ దిశగా అధ్యయనం చేసి కమిటీ బోర్డుకు నివేదిక సమర్పించనుంది. జూనియర్ కళాశాల ప్రారంభం తర్వాత తరగతులు నిర్వహణ, బోధనా పద్దతులపై కమిటీ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఒక్కో గ్రూప్‌కు రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించడం, అవకాశం ఉన్న కళాశాలల్లో షిఫ్టు పద్దతిలో తరగతులు నిర్వహించడం తదితర విధానాలపై కమిటీ అధ్యయనం చేస్తోంది. వీటితో పాటు ఏ ఏ సబ్జెక్టులకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలి..? ఏ ఏ సబ్జెక్టుల ప్రత్యక్షంగా తరగతుల నిర్వహణ అవసరం అనే అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోంది.

విద్యాసంవత్సరం ప్రారంభం, వార్షిక పరీక్షల తేదీలు తదితర అంశాలను పరిశీలిస్తోంది. విద్యాసంవత్సరం ఎన్ని నెలలు ఉంటుంది..? ఆ గడువులో సిలబస్‌ను ఎలా పూర్తి చేయాలనే అంశాలన్నింటినీ పరిశీలించి కమిటీ బోర్డుకు తుది నివేదిక సమర్పించనుంది. ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రత్యామ్నాయంగా ఇంటర్ బోర్డు ఆన్‌లైన్ విద్యపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బోర్డు ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. విద్యార్థుల కోసం అన్ని పాఠ్యాంశాలు, పోటీ పరీక్షలకు సంబంధించి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో వీడియో పాఠాలు చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపరించింది. ఇదే విధానాన్ని అకడమిక్ ఇయర్ విద్యార్థులకు కూడా అందించే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది.

నివేదికను పరిశీలించి నిర్ణయం

ఇంటర్ కళాశాలల విద్యాసంవత్సరం, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఇంటర్ బోర్డుకు జూన్‌లో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ ఫలితాలు జూన్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అధికారవర్గాలు ప్రకటించాయి. పది ఫలితాలు వెల్లడికాగానే ఇంటర్ అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. జూలై లేదా ఆగస్టులో అప్పటి పరిస్థితులను బట్టి జూనియర్ కళాశాలల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News