Monday, April 29, 2024

కొద్ది మంది గుప్పెట్లో సంపద!

- Advertisement -
- Advertisement -

దేశంలో గ్రామీణ, పట్టణ పేదల పరిస్థితి అత్యంత ప్రమాదకరం గా ఉంది. ఉపాధి కరువై వచ్చే ఆదాయం వారిని అపహాస్యం చేస్తున్నది. రెక్కల కష్టంతో కడుపులోకి గంజి పోసుకుందా మన్నా పని కల్పించలేని పాలకుల విధానాల ఫలితంగా లక్షలాది మంది ప్రజలు పారేసిన విస్తరాకుల్లోని ఎంగిలి మెతుకుల కోసం తగవులు పడుతూ, ఎండకు ఎండి, వానకు తడిసి, మట్టి కొట్టుకున్న చింపిరి బట్టలతో ఫుట్‌పాత్‌ల పైన జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. సరైన పోషకాహారం లభించక కోట్లాది మంది పిల్లలు, మధ్య వయసువారు, పెద్దలు రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నా రు. మరొక వైపున కొద్ది మంది సర్వభోగాలు అనుభవిస్తున్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారణం, కారకులు ఎవరు.
నేడు దేశంలో నిరుపేదల సంఖ్య 81.35 కోట్లకు చేరిందని అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. దీని ప్రకారం 62.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 75% మంది గ్రామీణ ప్రజలు, 50% మంది పట్టణ ప్రజలు పేదరికం నలిగిపోతున్నారు. గ్రామీణ ప్రజల నెలసరి ఆదాయం 1059 రూపాయలకు, పట్టణ ప్రజల ఆదాయం 1286 రూపాయలకు పడిపోయింది. సగటు పట్టణ వ్యక్తి రోజు వారీ ఖర్చు రూ. 32, గ్రామీణ ఒక వ్యక్తి రోజు వారీ ఖర్చు 26 రూపాయలకు పడిపోయింది. 23- డిసెంబర్ -22న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశంలోని 81.34 కోట్ల మంది నిరుపేదలకు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని, అందుకు రూ. రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించినా ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు జరగలేదు.
పాలక ప్రభుత్వాల ఆర్థిక, రాజకీయ విధానాలే సంపదల కేంద్రీకరణ, వికేంద్రీకరణకు గీటురాయిగా ఉంటుంది.భారత పాలకులు ఎప్పుడూ సంపద కేంద్రీకృత విధానాలనే అమలు జరుపుతూ వస్తున్నారు. ఫలితంగా కొద్ది మంది వ్యక్తులకు దేశ సహజ వనరులన్నింటినీ పాలకులు కట్టబెడుతున్నారు. సరళీకరణ ఆర్ధిక విధానాలతో వేగం పుంజుకున్నా ఈ పరిస్థితి నేడు మోడీ నాయకత్వాన ఎన్‌డిఎ పాలనలో ఉన్నత స్థాయికి చేరి ప్రజా ఆస్తులు, సంస్థలు బడా పెట్టుబడిదారుల వశమవుతున్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు మరింత పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పెరుగుతున్నదని జరుగుతున్న ప్రచారంలో ఒక వాస్తవం ఉంది. అది సంపన్నుల ఆస్తులు వేగంగా పెరగటమే. భారత దేశంలో నాలుగు లక్షల మంది కోటీశ్వర్లు ఉన్నారు. వీరి సగటు ఆదాయం 7 కోట్లు. వెయి కోట్లు సగటు ఆదాయం ఉన్న వాళ్లు 3 వేల మంది. 2023 లో దేశంలోని 10% సంపన్నులు దేశ సంపదలో 77% కలిగి ఉన్నారు. 2021 జాతీయ ఆదాయంలో 5 వంతు 1% మంది వద్ద ఉన్నదంటే ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉంది అర్ధమవుతుంది. ప్రపంచ అసమానతల సమాచార నిధి లెక్కల ప్రకారం 1951 నాటికి మన దేశ జాతీయ ఆదాయంలో 1% మంది వాటా, 40% పేదల వాటాతో సమానం. 1961 లెక్కల నుంచి అందుబాటులో ఉన్న జాతీయ లెక్కల్ని బట్టి చూసినా, అప్పటి దేశ సందలో 1% సంపన్నుల వాటా, 50% నిరుపేద సంపదతో సమానం. గత 62 సంవత్సరాల దేశ ‘పురోగతి’ తర్వాత ఇప్పుడు దిగువున ఉన్న 90% మందిని కలిపినా గాని, 1% సంపన్నుల వాటాకి సరిపోవటం లేదు. దేశంలోని జాతీయ ఆదాయంలో 56% సంపద, 10 మంది సంపన్నుల వద్ద ఉంది. 1980లో భారత్ లో ప్రైవేట్ రంగం దగ్గర 29% సంపద ఉంటే, 2020 నాటికి 56% పెరిగింది.
మరొక వైపున అత్యంత పేదలు ఉన్న దేశాల్లో భారత వాటా ఎక్కువ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేదరికంలో ఉన్న జనాభా 68.9 కోట్లు ఉండగా, అందులో భారతదేశం వాటా 20.17% ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధ ఆకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రతపై 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచీ (జిహెచ్ ఐ) మేరకు 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్ 76 స్థానంలో ఉంది. ఈ విషయంలో శ్రీలంక, ఘనా, బొలీవియా కన్నా వెనకబడి వుంది. పోషక ఆహారం లోపం వలన 17.3% చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015 -16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువ మందిలో రక్తహీనత ఏర్పడింది. చిన్న పిల్లల నుంచి బాలబాలికలు, గర్భిణీల్లో అధికంగా రక్త హీనత ఉంది.
పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే జాతీయ ఆహార భద్రత చట్టం అమలులోకి వచ్చి 54 సంవత్సరాలైనా ఆకలి చావులను దేశంలో ఆపలేకపోయింది. ఆకలి చావులను ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015- 18లో దేశ వ్యాప్తంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్థ 2015 ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధి లోకి వచ్చే బుందేల్‌ఖండ్ ప్రాతంలోని 13 జిల్లాల్లోని 38% గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణించిన విషయాన్ని సర్వే బయటపెట్టింది. మోడీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావని, అనారోగ్య కారణాలతో చనిపోయారని బాధ్యత నుంచి తప్పించుకుంది. ఆకలి చావులపై సుప్రీంకోర్టుకు ఇదే నివేదిక ఇచ్చింది. అనారోగ్యానికి పోషక విలువలు లేని ఆహారమే కదా! దాని ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గి పేదలు ప్రాణాలు కోల్పోవడమేగా ఇది కూడా ఆకలి చాపు కిందకే వస్తుంది. ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించటమే.
బ్రిటిష్ వలస పాలనలో మహారాజుల, ముష్టివాళ్ళ గడ్డగా ప్రపంచం పిలుచుకున్న భారత్ 75 ఏళ్ల ‘స్వపరిపాలన’లో ఒక వైపు అతి సంపన్నులు, మరొక వైపు అతి పేదలు ఉన్న దేశంగా మిగిలిందని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక బట్టబయలు చేసింది. పేదలకు జీవన ప్రమాణాలు అందించటంలోనే కాదు, అధికార మార్పిడికి ముందున్న అసమానతలు తొలగించటంలోనూ పాలకులు విఫలమైయ్యారని పేర్కొన్నది. పేదరికానికి, వారి అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు వారి దుర్భరమైన ఆర్ధిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన వారి ఆర్ధిక పరిస్థితులను మెరుగుపడలేదని అవే రుజువు చేశాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడాలంటే గ్రామీణ పేదల సేద్యపు భూమి పంపిణీ చేసి హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. వారిని వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇందుకోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News