Monday, April 29, 2024

లక్షా 85వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Cases Exceeding 85 Lakh in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 85వేలు దాటాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం 50,108 మందికి పరీక్షలు చేయగా 1967 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో 297 జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా ఆదిలాబాద్‌లో 17, భద్రాద్రి 91, జగిత్యాల 56, జనగామ 24, భూపాలపల్లి 20, గద్వాల 19, కామారెడ్డి 56, కరీంనగర్ 152, ఖమ్మం 78, ఆసిఫాబాద్ 15,మహబూబ్‌నగర్ 25, మహబూబాబాద్ 66, మంచిర్యాల 33, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 137, ములుగు 34, నాగర్‌కర్నూల్ 27, నల్గొండ 105,నారాయణపేట్ 8, నిర్మల్ 26,నిజామాబాద్ 61, పెద్దపల్లి 40, సిరిసిల్లా 44, రంగారెడ్డి 147, సంగారెడ్డి 54, సిద్ధిపేట్ 70, సూర్యాపేట్ 46,వికారాబాద్ 18, వనపర్తి 25, వరంగల్ రూరల్ 26 ,వరంగల్ అర్బన్ లో 89, యాదాద్రిలో మరో 37 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,85,833కి చేరగా, ప్రస్తుతం 1,54,499 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 30,234 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 24,607 మంది ఐసొలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1100కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

83.13 శాతానికి పెరిగిన రికవరీ రేట్….

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోంది. నెల రోజుల క్రితం సగటున 75 శాతం చొప్పున నమోదుకాగా, ప్రస్తుతం ఏకంగా 83 శాతానికి పైగా పెరగడం మంచి పరిణామమేనని అధికారులు అంటున్నారు. సకాలంలో వైద్యం అందించడంతో పాటు రోగుల్లో మనోధైర్యం పెరగడమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దేశ రికవరీ రేట్ 82.39 శాతం కంటే తెలంగాణలో ఒక శాతం అదనంగా నమోదు కావడం గమనార్హం.

ఆసుపత్రుల్లో ఐదువేల మందికి పైగా చికిత్స….

రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో కేవలం ఆరు వేల మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటెన్‌లో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 28, 50,869 మందికి టెస్టులు చేయగా 1,85,833 పాజిటివ్‌లు తేలాయి. వీరిలో ఇప్పటికే 1,54,499 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరగా మరో 30,234 యాక్టివ్ కేసులున్నాయి. అయితే వీటిలో 24,607 మంది హోం క్వారంటైన్, సంస్థాగత ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా 5627 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే 85 శాతం మంది ఆసుపత్రులు అవసరం లేకుండానే కోలుకుంటున్నారు.

భారీగా టెస్టులు చేసేందుకు సర్కార్ సిద్ధం….

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచేందుకు ఆరోగ్యశాఖ అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చుకుంది. ఇప్పటికే ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో 60 ఆర్‌టిపిఆర్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, రెండు రోజుల క్రితం నిమ్స్‌లో ప్రతి రోజు 4వేల శాంపిల్స్‌ను నిర్ధారించే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు మిగతా జిల్లాల్లోనూ ఆర్‌టిపిసిఆర్ సెంటర్లను పెంచేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి కొన్ని సెంటర్లలో యాంటీజెన్‌లో నెగటివ్ వస్తే సదరు అనుమానితుడికి అదే కేంద్రంలో ఆర్‌టిపిసిఆర్ చేసేందుకు అధికారులు అలోచిస్తున్నారు. ఈమేరకు ప్రణాళిక తయారు చేసి వైద్యశాఖ సిఎంకు నివేదిక అందించనుంది. ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఈ విధానంలో పరీక్షలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని మరింత అడ్డుకోవచ్చని ఆరోగ్యశాఖ అభిప్రాయం. ఇప్పటికే జిహెచ్‌ఎంసిలో తీవ్రత తగ్గగా, మిగతా జిల్లాల్లోనూ వైరస్ నియంత్రణ కోసం హెల్త్ డిపార్ట్‌మెంట్ తీవ్ర కసరత్తులు చేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News