Monday, April 29, 2024

ఓటమిని అంగీకరించిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

Donald Trump accepted defeat

 

అధికారాల బదిలీ ప్రక్రియ ప్రారంభం
జనవరి 20న అధ్యక్షుడిగా జోబైడెన్

వాషింగ్టన్: అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ విజయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పలు రాష్ట్రాల్లో కేసులు వేసిన ట్రంప్ చివరికి తన ఓటమిని అంగీకరించారు. తాజాగా మిచిగన్ రాష్ట్రంలో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అధికారాల బదిలీ ప్రక్రియ చేపట్టే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జిఎస్‌ఎ)చీఫ్ ఎమిలీ మర్ఫీ సోమవారం(భారత్‌లో మంగళవారం) జోబైడెన్‌కు లేఖ రాశారు. అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో మర్ఫీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత విజేతను జిఎస్‌ఎ గుర్తించడం ద్వారా అధికారాల బదిలీ ప్రక్రియ ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే, మర్ఫీ ట్రంప్ నియామక అధికారిణి కావడంతో బైడెన్ గెలుపును గుర్తించడంలో ఆలస్యం చేశారన్నది తెలిసిందే. ఓటమిని అంగీకరించిన ట్రంప్ మరోవైపు తన న్యాయపోరాటం కొనసాగిస్తానన్నారు. దేశ ప్రయోజనాల దృష్టానే అధికారాల బదిలీ ప్రక్రియ ప్రారంభించాలని ఎమిలీని కోరానని తెలిపారు. తాను చట్ట ప్రకారం, వాస్తవాల ఆధారంగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నానని బైడెన్‌కు రాసిన లేఖలో మర్ఫీ వివరణ ఇచ్చారు. బదిలీ ప్రక్రియను ఆలస్యం చేయాలని తనపై వైట్‌హౌస్ నుంచిగానీ, మరెవరి నుంచిగానీ ఒత్తిడులు లేవని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

జనవరి 20న జోబైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బదిలీ ప్రక్రియకు అవసరమైన 63 లక్షల డాలర్లను ఎన్నికైన అధ్యక్షుడికి అందుబాటులోకి తెచ్చానని మర్ఫీ తెలిపారు. మర్ఫీ చర్యను బైడెన్ వర్గం స్వాగతించింది. అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఎన్నికయ్యారని జిఎస్‌ఎ చీఫ్ అంగీకరించారు. అధికారాల బదిలీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇదో కీలక చర్య అని బైడెన్‌హారిస్‌ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోహాన్నెస్ అబ్రహాం ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News