Monday, April 29, 2024

బ్రహ్మస్తం ‘బ్రహ్మోస్’ సక్సెస్

- Advertisement -
- Advertisement -

బ్రహ్మస్తం బ్రహ్మోస్ సక్సెస్
రక్షణ రంగ ఆల్ ఇన్‌వన్
ఐఎన్‌ఎస్ చెన్నై సత్తా పరీక్ష
డిఆర్‌డిఒ నుంచి మరో చరిత్ర

చెన్నై: శత్రు విధ్వంసక, స్వదేశీ నిర్మిత, పటిష్ట యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ చెన్నై నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి విజయవంతంగా దూసుకుపోయింది. దీనితో భారత రక్షణ రంగం ఈ కీలకమైన మిస్సైల్ నౌకస్థాయి పరీక్షల దశలో మరో ముందడుగు వేసింది. రక్షణ రంగానికి వెన్నెముక అయిన పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) ఈ క్షిపణిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. నౌకాదళానికి విశ్వాసపాత్రపు యుద్ధ నౌక అయిన ఐఎన్‌ఎస్ చెన్నైను వేదికగా చేసుకుని ఈ క్షిపణిని ఆదివారం పరీక్షించారు. నిర్ణీతంగా ఈ క్షిపణి అరేబిమా మహాసముద్రంలోని లక్షాన్ని ఛేదించింది. ఆద్యంతం ఎటువంటి లోపాలకు తావులేకుండా కచ్చితత్వంతో ప్రయోగం ఫలించిందని రక్షణ శాఖ వర్గాలు ఆ తరువాత హర్షాతిరేకపు ప్రకటన వెలువరించాయి. పలు దశల అత్యంత సంక్లిష్ట దశలను దాటుకుంటూ ఈ క్షిపణి నిర్ణీత లక్షాన్ని దెబ్బతీసిందని తెలిపారు. భారతదేశపు వాయు నౌకాదళానికి బ్రహ్మోస్‌ను ప్రధానమైన శత్రు విచ్ఛేదక బ్రహ్మస్తంగా తీర్చిదిద్దారు. పలు రక్షణాభద్రతా సవాళ్లను తట్టుకుని నిలిచేందుకు దీనిని డిఆర్‌డిఓ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. యుద్ధ నౌకల నుంచి ఎంచుకున్న టార్గెట్లను దెబ్బతీసేందుకు ఈ బ్రహ్మోస్ సామర్థం ఏ విధంగా ఉందనేది ఇప్పటి పరీక్షలలో స్పష్టం అయింది. ప్రస్తుత బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం కావడంతో బ్రహ్మోస్ సత్తా నిర్థారణ అయింది. మరో వైపు ఈ ఐఎన్‌ఎస్ యుద్ధ నౌక సుదూర లక్షాలను దెబ్బతీసే క్షిపణుల ప్రయోగాలకు సరైన వేదిక అనే విషయం స్పష్టం అయింది. బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ కార్యక్రమాన్ని రష్యా ఇండియా సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టారు.

ఇందులో భాగంగా సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ తయారీ జరుగుతోంది. ఈ బ్రహ్మోస్ ఆల్‌ఇన్‌ఒన్ అస్త్రంగా నిలుస్తుంది. దీనిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, భూ వేదికల నుంచి కూడా దీనిని టార్గెట్‌పైకి ప్రయోగించవచ్చు. ఇంతటి మహత్తర ప్రయోగాన్ని నిర్వహించి, విజయవంతం చేయడం మంచి పరిణామమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఒను , బ్రహ్మోస్ ఎరోస్పేస్ నిర్వాహకులను, నౌకాదళాన్ని అభినందించారు. భారతీయ సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే ఇటువంటి పరీక్షలు కీలకమైనవి డిఆర్‌డిఓ ఛైర్మన్ జి సతీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత బ్రహ్మోస్ పరీక్షను విజయవంతం చేసిన సైంటిస్టులు, సాంకేతిక బృందానికి అభినందనలు పంపించారు. బ్రహ్మోస్‌ను యుద్ధ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించడం పలు కోణాలలో ముఖ్యమైన ఘట్టం అని విశ్లేషించారు. గత కొద్ది వారాలుగా భారత రక్షణ రంగం పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని వరుసగా కొద్ది విరామాల క్రమంలోనే పలు శక్తివంతమైన క్షిపణులను, ఆయుధ వ్యవస్థలను పరీక్షిస్తూ వస్తోంది.
ఇటీవలి రక్షణ బ్రహ్మాస్త్రాలు ఇవే
ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకువెళ్లే బ్రహ్మోస్ నూతన నమూనా
యాంటీ రేడియేషన్ రుద్రం 1 ప్రయోగం
అణు శక్తివంతమైన హైపర్‌సోనిక్ మిస్సైల్ శౌర్య. ఇటీవల ప్రయోగించిన సర్ఫేస్ టు సర్ఫేస్ బ్రహ్మోస్ సరికొత్త వెర్షన్ ఇంతకు ముందటి సామర్థంతో పోలిస్తే అత్యధిక స్థాయిలో ఉంది. ఇంతకు ముందు దీని రేంజ్ 290 కిలోమీటర్ల స్థాయి నుంచి ఇప్పుడు దీని రేంజ్‌ను 400 కిమీటర్ల స్థాయికి చేరుకుంది. ఇటు ఈ ప్రయోగాలకు తోడుగా ఇప్పటి చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం రక్షణవ్యవస్థ పటిష్టం అవుతోంది. ఎక్కువ సంఖ్యలో బ్రహ్మోస్‌ను సిద్ధంచేసుకోవడం, పలు వ్యూహాత్మక స్ధావరాల వద్ద ఇతరత్రా ఆయుధ వ్యవస్థలను మొహరించడం వంటి చర్యలు చేపట్టారు. లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చైనాతో నెలకొని ఉన్న అనధికారిక సరిహద్దు రేఖ వెంబడి పలు విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

DRDO Successfully test fires Brahmos Missile

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News