Monday, April 29, 2024

రైతుల పళ్లేల చప్పుళ్లు

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ మన్‌కీ బాత్ వేళ సాగు సైనికుల నిరసన

విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అంటూ ప్రధాని మోడీ మన్ కీ బాత్ సందేశం
అదే సమయంలో రైతు ఉద్యమకారుల పళ్లేల చప్పుళ్లతో దద్ధరిల్లిన ఢిల్లీ సరిహద్దులు
తాలీ బజావో కార్యక్రమం విజయవంతమైందని రైతు సంఘాల ప్రకటన
మాగోడు వినని ప్రధాని మాటలను ప్రజలెందుకు వినాలని వివరణ

న్యూఢిల్లీ: ఇక మీ ముచ్చట్లు ఆపండి, రైతుల మన్ కీ బాత్ వినండి అంటూ నిరసనలలో ఉన్న రైతులు ఆదివారం ప్లేట్ల చప్పుళ్లు విన్పించారు. ప్రధాని మన్ కీ బాత్ సాగుతున్న దశలో తమ నిరసనల్లో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లోని రైతాంగం ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తాము చలిలో ఉద్యమిస్తూ ఉంటే పట్టించుకోకుండా ప్రధాని ఊకదంపుడు ప్రసంగాలకు దిగుతున్నారని, ప్రజలు అంతా కూడా తమ ఇళ్లలో మన్ కీ బాత్ సమయంలో వంటింటి సామాన్లను మోగించాలని రైతులు పిలుపు నిచ్చారు. ఇక్కడి సింఘూ శివార్లు, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్, బిజెపి పాలిత హర్యానాలోని రొహతక్‌లో రైతులు తమ చేతుల్లోని పళ్లాలను బిగ్గరగా మోగిస్తూ ఉన్నారు. తమ థాలి బజావో కార్యక్రమం బాగా జరిగిందని రైతు నేతలు తరువాత తెలిపారు. ప్రధాని చెప్పిందే చెప్పి చెప్పి ఇప్పుడు చెపుతున్నది విని తాము అలిసిపోయినట్లు రైతులు తెలిపారు. ‘ఇంతకాలం మీరు చెప్పింది వినివిని సొమ్మసిల్లాం.

ఇంకెంతకాలం ఈ చెప్పుళ్లు, ఎంతసేపూ మీ మన్ కీబాత్‌లేనా, ఇప్పుడు మా గుండెకోతల మన్ కీ బాత్‌లు వినండి మోడీజీ’ అంటూ రైతులు ఈ మోతకు దిగారు. తమ గోడు వినని ప్రధాని మాటలను రైతాంగం అయినా ప్రజలైనా ఎందుకు వినాలని, అందుకే ఈ థాలి చప్పుళ్లకు దిగామని రైతు నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ప్రజల మాటలు ఆయన వినరు. అయితే ఆయన సోదికి దిగి చెప్పేది అంతా విధిగా వినాలి, ఇదేం న్యాయం అంటూ ఆదివారం నెటిజన్లు ప్రశ్నించారు. కొందరైతే మోడీ బక్వాస్ బంద్ కరో (మోడీ వ్యర్థ ప్రేలాపనలు ఆపండి) అని ట్వీట్లు పెట్టారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ పూర్తిగా నస అని,ఇందులో పస లేదని వ్యాఖ్యానిస్తూ బిజెపి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో కూడా అయిష్టతలు వెలువడ్డాయి. అయితే ఈ ఏడాదంతా మన్ కీ బాత్ బాగా సాగిందని, ఈ మేరకు సంబంధిత సంకలనంపై ప్రజల నుంచి విశేష స్పందన వెలువడిందని ఆదివారం నాటి తాజా మన్ కీ బాత్‌లో ప్రధాని తెలియచేశారు.

Farmers beat plates against PM’s Mann ki baat address

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News