Friday, May 17, 2024

హర్యానా రైతు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హర్యానాలో రైతుల కన్నెర్ర.. సిఎం ఖట్టార్ వేదిక ధ్వంసం
కిసాన్ పంచాయత్ భగ్నం
హెలీపాడ్‌లో నిరసనకారులు, పారిపోయిన పోలీసుబలగాలు

Farmers demolished CM Khattar's Kisan stage

కర్నాల్: వ్యవసాయ చట్టాలపై తమ నిరసనలను హర్యానాలో రైతులు చేతల్లో చూపారు. ముఖ్యమంత్రి ఖట్టార్ పాల్గొనే కిసాన్ మహాపంచాయత్ వేదికను ధ్వంసం చేశారు. ఆదివారం కర్నాల్‌లోని కైమ్లాగ్రామంలో ఈ ఘటన జరిగింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో కలిగే లాభాలను తెలియచేసేందుకు సిఎం మనోహర్ లాల్ ఖట్టార్ కిసాన్ సదస్సును ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నిరసనకారులైన రైతులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి వేదికను ధ్వంసం చేశారు. రైతుల చేరిక గురించి తెలియగానే హర్యానా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు గ్రామంలోకి ప్రదర్శనగా వెళ్లకుండా ఉండేందుకు వాటర్ కేనన్లను వాడారు. అయితే రైతులు పట్టువీడకుండా ముందుకు సాగారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికను కూల్చారు. ఖట్టార్ రాకకోసం ఏర్పాటు అయిన చోపర్ విమానం తాత్కాలిక హెలీపాడ్‌ను కూడా దెబ్బతీశారు. దీనితో గందరగోళం ఏర్పడింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ రైతుల నిరసనను ఆపలేకపొయ్యారు. వారు అక్కడికి చేరుకుని, విధ్వంసం సృష్టించి వెళ్లారు. తమ పట్టు వీడనితనం ప్రదర్శించారు. రైతులు తాత్కాలిక హెలీపాడ్‌ను అధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడే కూర్చున్నారు. కొందరు హెలీపాడ్ పై కప్పును ఊడబెరికారు. ఈ ఘటన దశలోనే పోలీసులను తరిమికొట్టేందుకు రైతులు రాళ్లు విసిరారు.

దీనితో వారు పరుగులు తీయాల్సి వచ్చింది. వారి నిరసనలు విధ్వంసంతో కిసాన్ మహాపంచాయత్ రసాభాస అయి, నిలిచిపోయింది. అక్కడ వేసిన కుర్చీలు, బల్లలు, పూల కుండీలను పగులగొట్టారు. చట్టాలపై నిరసనలతో ఉన్న కోపోద్రిక్తులైన రైతులు ప్రత్యేకించి యువకులు నినాదాలు చేస్తూ అక్కడి టెంట్లను ఊడబెరికారు. దీనితో అధికారులు, చివరికి పోలీసు ఉన్నతాధికారులు కూడా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. వేదిక వద్ద ఉన్న భారీ స్థాయి బిజెపి కటౌట్లను పోలీసుల సమక్షంలోనే కింద పడేశారు. దీనితో బిజెపి శ్రేణులు బిక్కుబిక్కు మంటూ గడిపాల్సి వచ్చింది. బికెయూ (చరూని) సంస్థ ఆధ్వర్యంలో రైతులు ఇక్కడ తమ చర్యచేపట్టారు. కొత్త చట్టాలు తమకు కటువుగా ఉన్నాయని, వీటిని రద్దు చేయాల్సిందేనని, చట్టాలతో మేలు జరుగుతుందనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి తీరుతామని, ఈ దిశలో తాము ఎక్కడికైనా వెళ్లుతామని ప్రకటించారు. కిసాన్ మహాపంచాయత్ ఏర్పాటును తాము వ్యతిరేకించామని, అయితే తమను కవ్వించే రీతిలో సభకు భారీ ఏర్పాట్లు చేశారని, అధికార గణం తరలివచ్చిందని రైతు నేతలు తెలిపారు. ఈ పంచాయతీ నిర్వహణకు హర్యానా మంత్రులు కన్వర్ పాల్ గుజ్జర్, క్రిషన్ లాల్ పన్వర్, కర్నాల్ ఎంపి సంజయ్ భాటియా, గరౌందా ఎమ్మెల్యే హర్విందర్ కల్యాన్‌లు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రైతులు తరలివస్తున్నట్లు తెలియడంతో వారు అక్కడికి రావడం మానేశారు. రైతులు అరాచకంగా విచ్చలవిడిగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు బిజెపి నేత రామన్ మాలిక్ తెలిపారు. బికెయు నేత గుర్నామ్ సింగ్ చరూని ప్రోద్బలంతోనే విధ్వంసం జరిగిందని విమర్శించారు.

కొత్త చట్టాలతో లాభాలే ఉన్నాయని తెలిపేందుకు ఇక్కడి గ్రామంలో సభను పోలీసు బందోబస్తు, భారీ ఏర్పాట్ల మధ్య చేపట్టారు. సిఎం సభ కావడంతో ఘటనాస్థలిలో నేర విభాగ డిజిపి ముహమ్మద్ అకిల్ కూడా ఉన్నారు. అంతకు ముందు రైతులు నల్లజెండాలు ధరించి రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పలు చోట్ల దిగ్బంధనలు విధించారు. అయితే అడ్డంకులను ఛేదించుకుని రైతులు తమకు తెలిసిన అడ్డదారులలో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద నిరసనకారులు అక్కడి స్థానికులు, బిజెపి కార్యకర్తల మధ్య కొద్ది సేపు దాడుల వాతావరణం నెలకొంది. ఇక్కడి ఘటనపై రాష్ట్రంలో ప్రతిపక్ష నేత భూపీందర్ సింగ్ హూడా స్పందించారు. నిరసనల్లో ఉన్న రైతులను బిజెపి ప్రభుత్వం కవ్వించరాదని, కాదని ముందుకు పోతే ఇటువంటి ఘటనలు తప్పవని హెచ్చరించారు.

Farmers demolished CM Khattar’s Kisan stage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News