చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ ఒకేసారి, ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? దానికి టీజర్‌లా ‘మగధీర’లో ఓ సీన్ సృష్టించాడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు కొరటాల శివ ఏకంగా సినిమానే చూపించడానికి సిద్ధమయ్యాడు. చిరంజీవితో ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’లో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి చరణ్‌ని ముందుగా గెస్ట్ రోల్ కోసం అనుకున్నారు.
కానీ క్రమంగా ఆ పాత్ర పరిధి పెరుగుతూ పోయింది. చరణ్ కోసం ఓ హీరోయిన్, పాట, ఫైటింగ్… ఇలా ఆ పాత్రని పెంచుకుంటూ వెళ్లాడు కొరటాల. ఇప్పుడు చిరు, చరణ్‌ల మధ్య ఓ ఫైట్‌ను కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు. ఈ సినిమాలో చిరు, చరణ్‌లను గురు, శిష్యులుగా చూపించబోతున్నాడు కొరటాల. గురు, శిష్యులుగా మారడానికి ముందు వీరిద్దరితో ఓ ఫైట్ చేయిస్తే… అభిమానులకు ఓ కొత్త ట్రీట్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నాడట. ‘ఖైదీ నంబర్ 150’లోని ఓ పాటలో చిరు, చరణ్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ‘ఆచార్య’లో వీరిద్దరూ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.