Monday, April 29, 2024

మళ్లీ వర్షం

- Advertisement -
- Advertisement -

ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు…

జలదిగ్భంధంలోనే పాతబస్తీ..
జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు
వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం

Flood Inflow still now in Hyderabad's Old City

మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మళ్లీ పలకరిస్తున్నాయి. భాగ్యనగరంలో గత వారం రోజులుగా వరుణుడి ప్రతాపానికి జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీ వాసుల అవస్థలు అంతా ఇంతా కావు. వరద ప్రవాహంతో కాలనీలన్నీ బురద మయమయ్యాయి. ఇళ్లల్లోంచి బయటకు అడుగిడే పరిస్థితి కనిపించడం లేదు. పాలు, వాటర్ బాటిళ్లు ఇచ్చినంత మాత్రాన తమ సమస్యలు తీరిపోతాయా? అని జలదిగ్భంధంలో కొట్టుమిట్టాడుతున్న లోతట్టు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర శివార్లలో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలోనే కొనసాగుతున్నాయి. కాలనీలు, ఇళ్లల్లో నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మీర్‌పేట పరిధి గొలుసుకట్టు చెరువులకు వరద ఉద్ధృతి పెరిగింది. కాలనీలు, రహదారులపై భారీగా వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయమేర్పడి జనజీవనం స్తంభించిపోయింది. వాన ముప్పు ఇంకా తొలగకపోవడంతో ముంపు బాధితులు ఆందోళన వర్ణనాతీతంగా ఉంది. పెద్ద చెరువు, మంత్రాలు, సందె చెరువులు నిండుకుని అలుగులు పారుతుండడం వల్ల.. పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. బలహీనంఆ ఉన్న మీర్‌పేట చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండటం వల్ల అధికారులు, ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలు ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద తాకిడికి మిథిలానగర్ కాలనీ జలమయమైంది. మంత్రాలయం చెరవు నిండి దిగువకు భారీగా ప్రవాహం ఉండటం వల్ల కాలనీ నీట మునిగింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతి ధిటికి ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. వెనక భాగం నుంచి వస్తున్న నీళ్లు.. ఇంట్లో కెళ్లి బయటకు పొంగిపొర్లుతోంది. ఇంట్లో నడుములోతు నీళ్లు, చేరడం వల్ల బియ్యం, సరకులు, సామాగ్రి, పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. మరికొన్ని వస్తువులు బయటకు కొట్టుకుపోయాయి. ముంపుభయంతో సొంతింటిని వదిలి వెళ్లాల్సి వస్తోందంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అటు ఎమ్‌ఎల్‌ఆర్ కాలనీలోకి పెద్ద చెరువు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి మంత్రాల చెరువులోకి వరద ప్రవాహం కొనసాగుతుండటం వల్ల దిగువన ఇళ్లన్నీ నీట మునిగాయి. దీంతో కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బాధితులను కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదుకుంటున్నారు. మీర్‌పేట తిరుమల ఎన్‌క్లేవ్‌లో వరద కష్టాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన ముప్పు ఇంకా తొలగకపోవడం వల్ల ఇళ్లు ఖాళీ చేసి బంధువల ఇంటికి వెళ్లిపోతున్నారు. మరికొందరు సొంతూళ్లకు పయనమవుతున్నారు. వరద ఉద్ధృతికి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. మీర్‌పేట చెరువు నుంచి వస్తున్న ప్రవాహంతో కాలనీలో నడుములోతు నీళ్లు చేరాయి. ఇళ్లు సగానికి మునిగిపోవడం వల్ల స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రహదారులు చెరువులను తలపిస్తుండగా వాహనాలు అడుగు కూడా కదలడం లేదు. మీర్‌పేట పెద్ద చెరువును మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్‌లు సందర్శించారు.


రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు వంతెనలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఎడతెరిప లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్ పురానాపూల్ వద్ద మూసీనది కొత్త వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు రాకపోకలు నిషేధించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి మూసీకి వరద పెరగడంతో పిల్లర్ ఒక చోట స్వల్పంగా కుంగింది. వంతెనను అధికారులు పరిశీలించారు. వంతెన పరిస్థితి చూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసీ వరదలకు స్వల్పంగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించాడు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్ జుబైల్ కాలనీలోకి నీటిలో తేలియాడుతున్న ఓ మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎలా మరణించాడు? ఎక్కడ నుంచి వచ్చాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో మునగనూరు నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువున ఉన్న ఇంజపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద రావడంతో నీరు రోడ్డుపై నుంచి పారుతోంది. రోడ్డు దాటుతుండగా ఒక వ్యక్తి నీటిలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి వెంటనే అతడిని కాపాడారు. అదే విధంగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వరద ధాటికి బైక్‌పై నుంచి వారు కిందపడ్డారు. బైక్‌ను వెంటనే బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. చివరికి బైక్‌ను వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాకు వరదనీరు ఇళ్లల్లోకి ప్రవేశించి చాలా మందికి తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలతో సహా ఇంట్లోని సామాన్లన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. కాగా, మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలో వరదల కారణంగా నష్టపోయి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఎంఎల్‌ఎ మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆహార పొట్లాలు అందజేశారు. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో కుండపోత వర్షానికి హైదరాబాద్ వాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం.. సోమవారం మళ్లీ మొదలైంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిస్థితి ఇదంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోమవారం మధ్యాహ్నం ఫోటోలు ట్వీట్ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో బారీగా వరద నీరు చేరింది. కానీ మొత్తం జలమయమనట్లు కనిపిస్తోంది.


పలకరించిన వర్షం..
సోమవారం పలు ప్రాంతాలలో వర్షం పలకరించింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్‌లలో వర్షం పడింది. ట్రాఫిక్ స్తంభించింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, రాంకోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
40 కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి

Flood Inflow still now in Hyderabad's Old City

భారీ వర్షాలతో పోటెత్తిన నాలాలు, చెరువుల కారణంగా నగరంలో మొత్తం 90 కాలనీలు నీట మునిగాయి. వాటిలో 56 కాలనీలు ముంపు నుంచి బయటపడగా.. దాదాపు 40 కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. జీడిమెట్ల ఫాక్స్ చెరువును సందర్శించిన ఆయన చెరువు పరివాహక ప్రాంతంలలో నివాసమున్న వారంతా ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షా వచ్చే సూచనలు కనిపిస్తుండటం వల్ చెరువు పోటెత్తి జనావాసాలు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫిర్జాదిగూడ, బడంగ్‌పేట్, బండ్లగూడ, మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు వరదల వల్ల ఎక్కువగా ప్రభావిత మయ్యాయని వెల్లడించారు. వరద ప్రాంతాల్లో రసాయనాలు చల్లాలని.. విషపురుగులు, దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మ్యాన్‌హోళ్లు తెరవొద్దు: జలమండలి ఎండి దానకిశోర్
ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ పనులను జలమండలి ఎండి దానకిశోర్ పరిశీలించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనైనా మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని కోరారు. బేగంపేట, మయూరిమార్గ్, వెస్ట్ మారేడ్‌పల్లి, బ్రాహ్మణవాడ, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను తనిఖీ చేశారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూతలు ధ్వంసమైనా, తెరిచి ఉంచినా 155313కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. మురుగు ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలన్నారు. పైపులైను శుభ్రం చ చేయగా వచ్చే వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తొలగించి, పారిశుద్ధ పనులు చేపట్టిన వెంటనే సోడియం హైపోక్లోరైట్ రసాయనం చెల్లించాలని సూచించారు.
గుర్రం చెరువు కట్ట నిర్మాణ పనులు 70 శాతం పూర్తి…
భాగ్యనగరంలో భారీ వర్షానికి పాతబస్తీ కకావికలమైంది. పాతబస్తీ చంద్రాయణగుట్ట సమీపంలోని గుర్రం చెరువు కట్ట తెగి భారీగా విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. పాతబస్తీలోని పుల ప్రాంతాలు గుర్రం చెరువు వరద నీటిలో మునిగిపోయియి. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉన్నందున గుర్రం చెరువు కట్టను యుద్ధ ప్రాతిపదికన తిరిగి నిర్మిస్తున్నారు. మరోసారి వరద నీరు జనావాసాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 70 శాతం నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మరోసారి గుర్రం చెరువు వల్ల ముప్పు వాటిల్లకుండా కట్ట దృఢగంగా నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు.
హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత
హిమాయత్‌సాగర్ జలాశయంలోకి వరదనీరు కొనసాగుతోంది. జలాశయానికి 2,710 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నాలుగు గేట్లు తెరిచి 4,116 క్యూసెక్కులు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1763 అడుగులు ఉండగా.. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు.
మళ్లీ భారీ వర్ష సూచన..
తెలంగాణలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతు న్నందున రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రాగల మూడ్రోజులు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉందని వెల్లడించారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిందని వాతావరణ కేంద్రం వివరించింది.

Flood Inflow still now in Hyderabad’s Old City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News