Sunday, April 28, 2024

కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Four killed in Karimnagar car accident

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం
నలుగురి దుర్మరణం, మరో 9 మందికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
ప్రమాద సమయంలో మైనర్ డ్రైవింగ్
నిందితులపై యాక్సిడెంట్‌తో పాటు హత్య కేసు నమోదు : సిపి సత్యనారాయణ

మనతెలంగాణ/కరీంనగర్ క్రైం: కరీంనగర్ కారు ప్రమాదం ఘటనలో నలుగురు మృతికి కారణమైన కారు యజమాని రాజేంద్రప్రసాద్‌తో పాటు, మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సిపి వి. సత్యనారాయణ తెలిపారు. ఈక్రమంలో ప్రమాద ఘటనపై సిపి వి.సత్యనారాయణ ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. కరీంనగర్‌లోని కమాన్ సమీపంలో టిఎస్02 ఇవై 2121 నంబరు గల క్రెటా కారు ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అదుపుతప్పి వంద కిలోమీటర్ల వేగంతో పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గుడిసెల్లో నిద్రిస్తున్నారు.

ఒక్కసారిగా కారు దూసుకుపోవడంతో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు పవార్ లలిత(27), పవార్ సునీత(30)పవార్ పరియాంగ్(32), సోలంకి జ్యోతి (14) బైల కమ్మరి కార్మికులుగా గుర్తించామన్నారు. మృతుల కుటింబీకులు కత్తులు, కొడవళ్లు, ఇనుప పనిమూట్లు తయారు చేస్తుండటంతో పాటు కొలిమి నందు మేకల, గొర్రెల కాళ్లు, తలకాయలు కాల్చుతు జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు కారును ఘటనా స్థలంలోనే వదిలేసి పరారయ్యారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

మైనర్‌లు వాకింగ్‌కు వెళుతూ..

ప్రమాద ఘటనలో నిందితులు మైనర్లు ప్రతిరోజు ఉదయం కారు బయటికి తీస్తున్నారని ఈ నేపథ్యంలో అంబేడ్కర్ స్టేడియంలో వాకింగ్ కోసం కారులో వెళ్తారని సిపి తెలిపారు. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రోడ్డు పక్కన గుడిసెలను వారం క్రితం తొలగించామని, కొందరు రోడ్డు పక్కన గుడిసెల్లో వృత్తిపనులు చేస్తున్నారని సిపి పేర్కొన్నారు. రోడ్ల పక్కన అక్రమంగా గుడిసెలు వేసుకోవద్దని, రోడ్డు పక్కన గుడిసెల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సిపి చెప్పారు.కాగా ప్రమాదానికి 5 నిమిషాల ముందు కారులో ఇంధనం నింపుకొని రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్లినట్లు సిసి కమెరాల్లో నమోదైందని, బాలుడికి డ్రైవింగ్ రాకపోవడమే ప్రధాన కారణని తెలిపారు. ప్రమాద సమయంలో దాదాపు 100 కి.మీల వేగంతో కూలీలపైకి వాహనం దూసుకెళ్లినట్లు ఘటనాస్థలంలో ఆధారాలు లభ్యమయ్యాయని, ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి అందులో ఉన్న వారు పరారయ్యారని సిపి తెలిపారు.

కారుపై పెండింగ్ చలానాలు 

ప్రమాదానికి కారణమైన కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించామని, కారు యజమాని కుమారుడు(మైనర్) డ్రైవింగ్ చేశాడని, ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బాలుడు కారు నడిపాడని సిపి తెలిపారు. కాగా ప్రమాద సమయంలో వాహనం తానే నడిపినట్లు మైనర్ తండ్రి రాజేంద్రప్రసాద్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారని, విచారణలో అతని కుమారుడే కారు నడిపినట్లు తేలిందన్నారు. ఉదయం సమయంలో రహదారి కనిపించకపోవడంతో బ్రేక్ బదులు, క్లచ్ తొక్కడంతో ఘోర ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేస్తున్నామని సిపి వివరించారు. నలుగురి అమాయకుల ప్రాణాలు పోయినందునే హత్య కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్లకు కారు అందుబాటులో ఉంచినందునే యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నిందితుల అరెస్ట్ 

కారు భీభత్సం ఘటనలో నలుగురి మృతికి కారణమైన నిందితులు గాయత్రి నగర్‌కు చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలురని, వీరిలో రాజేంద్రప్రసాద్ కుమారుడు కారును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సిపి తెలిపారు. కచ్చకాయల రాజేంద్ర ప్రసాద్ ప్రైవేట్ వాటర్ సప్లయ్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా గుర్తించామని వెల్లడించారు.కారు నడిపిన బాలుడు మైనర్ అని తెలిసి కూడా కారు ఇచ్చినందుకు తండ్రితో పాటు ఇద్దరి స్నేహితులపై 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు.మైనర్‌లకు ఎలాంటి వాహనాలు ఇచ్చిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సిపి హెచ్చరించారు.

తక్షణ సాయం రూ. 10వేలు 

కారు ప్రమాద బాధితుల కుటుంబాలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బైఠాయించారు. ఆందోళనలో ప్రతిపక్షాల నాయకులు సైతం పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఎసిపి తుల శ్రీనివాస్‌రావు సర్ది చెప్పడంతో బాధిత కుటుంబాలు ఆందోళనలను విరమించారు. వారికి తక్షణ సాయం కింద పౌరసరఫరాల శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.. రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ఆర్‌డివొ ఆనంద్ కుమార్ తెలిపారు.

మాజీ ఎంపి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి

ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందిన సంఘటనపై కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉఫాధ్యాక్షులు బోయిని పల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన పై వెంటనే స్పందించిన వినోద్ కుమార్ గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.జరిగిన ఘటనపై పోలీస్ అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఘటన కలిచివేసింది : బండి సంజయ్

కారు అదుపు తప్పి రహదారి పక్కన నివాసం ఉండే నలుగురు మహిళలను బలి తీసుకున్న ఘటన పై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటన తనను కలచి వేసిందని తెలిపారు.ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు.స్థానిక బిజెపి శ్రేణులను ప్రమాద స్థలానికి వెళ్లి గాయపడిన క్షతగాత్రులకు,భాదిత కుటుంబాలకు అండగా నిలిచి సహాయం చేయాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి:సిపిఐ
అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నలుగురు మహిళల మరణానికి కారణం అయినవారిని చట్టరీత్య చర్యలు తీసుకోవాలని,భాదిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని 25లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాయకులు రాజు,మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News