Monday, April 29, 2024

భళారే భళీ! బాహుబలి!!

- Advertisement -
- Advertisement -

Green challenge third stage start by prabhas

గ్రీన్ ఇండియా ఛాలెంజ్3కు శ్రీకారం చుట్టిన ప్రభాస్
ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రతిజ్ఞ
గ్రీన్ స్టార్ వర్సెస్ యంగ్ రెబల్ స్టార్

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న సిఎం కెసిఆర్ లక్ష సాధనకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను చేపట్టి రెండు దశలు పూర్తి చేసిన గ్రీన్‌స్టార్, రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు మరో సవాల్ ఎదురైంది. ఈ కార్యక్రమ మూడో దశకు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ శ్రీకారం చుడుతూ ఎంపి జోగినపల్లి స్ఫూర్తితో 1000 ఎకరాలకు తక్కువ కాకుండా రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకొని హరితంగా మారుస్తానని అన్నారు. ఎంపి సంతోష్ ఇప్పటికే 2500 ఎకరాల్లో హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రీన్‌చాలెంజ్‌కు మరింత కళ వచ్చేలా ప్రభాస్ బాహుబలిలో సహనటుడు రానాతో పాటు మెగా పవర్‌స్టార్ రాంచరణ్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌లకు సవాల్ విసిరారు.

మనతెంగాణ/ హైదరాబాద్ : వేయి ఎకరాల అడవి ప్రాంతాన్ని దత్తత తీసుకుని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రకటించారు. ప్రభుత్వం ఎక్కడ వేయి ఎకరాల స్థలం ఇచ్చినా దత్తత తీసుకుని అడవిని అభివృద్ధి చేస్తూ మొక్కలు నాటి వాటిని కాపాడుతానని ఆయన చెప్పారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌లో భాగంగా గురువారం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడుకున్నదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపి సంతోష్‌కుమార్ దత్తత తీసుకున్న కీసర ఫారెస్టు అభివృద్ధి నన్ను ఆకట్టుకుందని ఆయన చెప్పారు. ఈ స్ఫూర్తితో సంతోష్ కుమార్ ఎక్కడసూచిస్తే అక్కడ వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా దత్తతతీసుకుని ఫారెస్టు అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. సంతోష్‌కుమార్ మహోన్నతమైన ఆశయం ముందుకు వెళ్లాలంటే మనమంతా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. అప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో నాఅభిమానులంతా పాల్గొని మొక్కలు నాటాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుపాటి రానా,బాలివుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్‌ను గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.

గ్రీన్‌ఇండియాఛాలెంజ్ 3వదశ ప్రారంభం
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ మంచిమనసును రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రశంసించారు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన కథానాయకుడని చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొక్కలు నాటే కార్యక్రమంలో సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్షం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్టు అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తి దాయకమన్నారు. ఇంతమంచి మనసున్న ప్రభాస్ చేతుల మీదుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశ కార్యక్రమం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. కోట్లాదిగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేల తల్లికి పచ్చని పందిరి వేయాలని సంతోష్‌కుమార్ అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయకర్త సంజీవ్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News