Monday, April 29, 2024

ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ

- Advertisement -
- Advertisement -

modi-trump

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మురికివాడను ట్రంప్ కంట పడకుండా దాచేందుకు దాదాపు అర కిలోమీటరు మేర భారీ గోడను కట్టేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తైన గోడలు రోడ్డుకు ఇరువైపులా నిర్మించనున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా వంతెనకు వెళ్లే మార్గంలో ఈ మురికివాడ ఉంది. కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ ఈ నెల 24న ఇక్కడకు వస్తున్నారు. దేవ్ సరన్ లేక సరనియావాస్ మురికివాడలో ఉన్న 500కి పైగా గుడిసెలు ట్రంప్ కంట పడకుండా దాచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ మురికివాడ జనాభా 2500 వరకు ఉంటుంది. మురికివాడలు కనపడకుండా గోడ కట్టిన తర్వాత సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా కర్జూర చెట్లను నాటుతారు. అదే విధంగా ఏళ్ల తరబడి ఏమాత్రం మరమ్మతులకు నోచుకోని నగర రోడ్లకు కూడా ముస్తాబు జరుగుతోంది.

ట్రంప్ సందర్శనను పురస్కరించుకుని దాదాపు 16 రోడ్లు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. ట్రంప్ ప్రయాణించే మార్గంలో అద్భుత దీపాలంకరణ కోసం విద్యుదీకరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సుందరీకరణ కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చుచేయనున్నారు. ట్రంప్ పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలూ చేపడుతోంది. బుధవారం అమెరికా అధ్యక్షుడు ఒక వీడియో విడుదల చేస్తూ తన పర్యటన కోసం భారత ప్రధాని మోడీ చేపడుతున్న చర్యలను గురించి గొప్పగా చెప్పారు.

విమానాశ్రయం నుంచి కొత్త స్టేడియం వరకు 50 లక్షల నుంచి 70 లక్షల మంది ప్రజలు తనకు స్వాగతం చెప్పనున్నారని మోడీ చెప్పిన విషయాన్ని ఆయన గర్వంగా వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంను గుజరాత్‌లో నిర్మించడం, దాని ప్రారంభోత్సవానికి తనను మోడీ ఆహ్వానించడం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కాని, నిన్న రాత్రి తాను పాల్గొన్న సమావేశానికి కేవలం 40,000 నుంచి 50,000 మంది రావడం పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Gujarat Govt to hide slums with a huge wall, the Ahmedabad Municipal administral is taking up beautification measures for Trumps visit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News