Monday, April 29, 2024

అన్నదాతా సుఖీభవ

- Advertisement -
- Advertisement -

 Agriculture

 

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 25,811 కోట్లు కేటాయింపు
రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు… గతం కంటే రూ. 2 వేల కోట్లు అదనం
పంటల కొనుగోలుకు 1000 కోట్లు
పశు సంవర్థకశాఖకు 1586 కోట్లు… సహకార, మార్కెటింగ్‌కు 108 కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ. 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405 కోట్లు కాగా, మిగిలినది నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధశాఖల బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించారు. సహకార, మార్కెటింగ్‌శాఖకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ. 177 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్లో రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పించారు. రైతుబంధు పథకం అమలుకోసం రూ. 14 వేలు కేటాయించారు.

2018-19 బడ్జెట్లో రూ. 12 వేలు కేటాయించగా, దాన్ని అదనంగా రూ. 2 వేల కోట్లు పెంచడం గమనార్హం. పెరిగిన లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు అదనంగా ప్రభుత్వం పెంచినట్లు ప్రభ్తువం తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎకరాకు రెండు సీజన్లకు రూ. 10 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అన్నదాతలకు ఇస్తారు. రైతుబంధు ద్వారా 2018-19 సంవత్సరం ఖరీఫ్‌లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేశారు. 2019-20లో ఎకరానికి పది వేల రూపాయల చొప్పున 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు.

మొత్తం రుణమాఫీ రూ.24,738 కోట్లు
టిఆర్‌ఎస్ ఎన్నికల హామీలో రుణమాఫీని ప్రకటించింది. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్తంత తేడా ఉంది. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లు నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. అయితే రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. గతానికి ఇప్పటికి ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వీరందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణ మాఫీ మొత్తాలను ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎంఎల్‌ఎల చేతుల మీదుగా అందజేస్తారు. ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపున్న రుణం రూ.24,738 కోట్లు. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. వీటిని కూడా చెక్కుల రూపంలో ఎంఎల్‌ఎల చేతుల మీదుగానే ఇస్తారు.

రైతు బీమాకు రూ. 1,141 కోట్లు
రైతుబీమాకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెనువెంటనే రూ. 5 లక్షలు అందించేలా చేయడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సున ప్రతీ రైతుకు బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతీ రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్‌ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నది. రైతు చనిపోయిన పది రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది.

మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. వెయ్యి కోట్లు
ఈ బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతీసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విషయంలో పరిమితి విధించడం, దాంతో రైతులు దళారులను ఆశ్రయించడంతో సమస్య వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొ ని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా, బడ్జెట్లో మాత్రం దానికి పూర్తి నిరాశే ఎదురైంది. ఇక వరి, పత్తి, మొక్కజొన్న, కందులు పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సరైన ధర వచ్చేలా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది.

ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఐదు వేల ఎకరాల క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించారు. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు.

 

Huge funds for Agriculture and allied sectors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News