Monday, April 29, 2024

సంపాదకీయం: వైద్యరంగం అధ్వాన్న స్థితి

- Advertisement -
- Advertisement -

Humans failure Corona controlకరోనా మానవ వైఫల్యాలను పోగు పోసి చూపింది. ఏయే రంగాలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో అనే కోణాన్ని సందేహాతీతంగా బయటపెట్టింది. తన కరాళ నృత్యంతో మానవాళి లోపాల చాంతాడు జాబితాను మన కళ్లముందుంచింది. ఇంతటి విపత్తు వేళలో కూడా ప్రపంచమంతా ఒక్కటై పరస్పరం సహకరించుకోలేకపోయిన పరమ చేతగానితనాన్ని ఎలుగెత్తి చాటింది. లోకమంతా పెద్ద పీనుగుల పెంటగా మారిపోతున్నా కక్షలు, కార్పణ్యాలు వీడి కలిసి పోరాడి వైరస్‌ను జయిద్దామన్న యోచన మానవాళిలో గట్టిగా తలెత్తకపోడం కంటే దౌర్భాగ్య స్థితి ఇంకేముంటుంది? దీనికి తోడు అందుబాటులోని వైద్య వనరులను కూడా పేద, పెద్ద అనే తేడా లేకుండా అందరి కోసం వినియోగించాలనే విజ్ఞత కరువైంది. ఇంతటి ఆపత్సమయంలో ప్రపంచానికి సమర్థమైన ఆరోగ్య చుక్కానిగా వ్యవహరించే డబ్లుహెచ్‌ఒకి ట్రంప్ మహాశయుడు చేయూతను ఉపసంహరించుకున్నాడు. భారతదేశంలోనైతే ప్రైవేటు వైద్యరంగం స్వార్థం ఈ సమయంలో మరింతగా పేట్రేగిపోడం అత్యంత జుగుప్సను కలిగిస్తున్నది.

దేశంలో గల వైద్య వ్యవస్థను ఈ కరోనా వేళ మనం సమర్థవంతంగా వినియోగించలేకపోయామని అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ చేసిన తాజా వ్యాఖ్య మన అధ్వాన్న పరిస్థితిని చాటి చెప్పింది. పనికి మాలిన మత విశ్వాసాలకు, విద్వేషాలకు నిరంతరం ప్రాధాన్యమిచ్చే భారత పాలకులు లాక్‌డౌన్ విధించి ఊరుకున్నారే తప్ప నిరాఘాటంగా వ్యాపిస్తున్న వైరస్‌ను కట్టడి చేయడానికి అందుబాటులోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను అనుసంధానం చేసి బలంగా ప్రయోగించి దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించలేకపోయారు. భారతదేశంలో జనాభాకు తగినంత మంది వైద్యులు లేరన్న సంగతినీ లాన్సెట్ ప్రస్తావించింది. కరోనా సవాలును ఎదుర్కోడానికి అనువైన రీతిలో వైద్య ఆరోగ్య రంగాన్ని సంసిద్ధం చేయలేకపోయామని మన నిర్వాకాన్ని ఎండగట్టింది. మౌలిక సదుపాయాలను కల్పించడంలో, తగినంత మంది అదనపు వైద్యులను సమీకరించడంలో మన వైఫల్యాన్ని ఎత్తి చూపింది. వైద్యులు ప్రతి 1000 మంది జనాభాకు ఒకరుండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన ప్రమాణం కాగా దేశంలో ప్రతి 10,000 మందికి 8 మంది వైద్యులు కూడా గట్టిగా లేరని వెల్లడించింది.

దేశంలో ప్రతి 1445 మంది ప్రజలకు వైద్యులు ఒక్కరే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గత నవంబర్‌లో పార్లమెంటుకు తెలిపింది. దేశ జనాభా 135 కోట్లుగా పరిగణించి ఈ నిష్పత్తిని ఖరారు చేసింది. రాష్ట్రాల వైద్య మండళ్లు, భారతీయ వైద్య మండలి వద్ద నమోదయిన ఆల్లోపతి డాక్టర్ల సంఖ్య 11,59,309 అని తెలిపింది. వీరిలో 80 శాతం మంది మాత్రమే అందుబాటులో ఉంటారన్న అంచనా మీద చూసుకున్నప్పుడు వారి సంఖ్య 9 లక్షల 27 వేలని వెల్లడించింది. 2016 ఏప్రిల్‌ల్లో విడుదలయిన పార్లమెంటరీ కమిటీ నివేదికను బట్టి జనాభాలో ప్రతి 2000, అంతకు మించిన మందికి ఒకరే డాక్టరున్నారు. ప్రతి 10,000 మంది జనాభాకు 67 మంది వైద్యులతో క్యూబా అత్యధిక సంఖ్యలో డాక్టర్లున్న దేశాలలో ఉన్నది. ఆరోగ్య భద్రతను క్యూబా రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అందుకు పూర్తి విరుద్ధంగా అమెరికాలో కొనుక్కోగలవారికే వైద్యం లభిస్తుంది. మన వంటి దేశాలు కూడా అమెరికా విధానం వైపే అడుగులు వేస్తున్నాయి.

కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో సౌదీ అరేబియా కృషిని లాన్సెట్ మెచ్చుకున్నది. అక్కడ వైద్య ఆరోగ్య బడ్జెట్‌ను గణనీయంగా పెంచారని, ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ల పడకల సామర్థాన్నీ విశేషంగా మెరుగుపర్చారని, వందలాది ఫీవర్ ఆసుపత్రులను తెరచి కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలియజేసింది. భారత దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ముందు ముందు మరింత ఉధృతంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే మన దేశం తన వైద్య వ్యవస్థను అందుకు తగిన రీతిలో సంసిద్ధం చేయలేకపోతున్న తీరు ఆందోళనకరం. ఇప్పటికైనా కేంద్రం చొరవ చూపి దేశంలో గల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సామర్థాలను తెలుసుకొని ప్రజలను కరోనా నుంచి కాపాడడానికి వాటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించాలి. యుద్ధ సమయంలో మాజీ సైనికులను సైతం సమీకరించే విధంగా దేశంలోని ఎక్కడెక్కడి వైద్యులనూ దింపి స్వల్ప కాలిక శిక్షణనిచ్చి కరోనాపై పోరులో వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రపంచంలో పేదలు 60 శాతం ఉంటారని కరోనా వల్ల వారికి కలిగే ముప్పే ఎక్కువని లాన్సెట్ అభిప్రాయపడింది. మన దేశంలో పేదల శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీరికి కార్పొరేట్ సహా అన్ని ఆసుపత్రులలోనూ ఉచిత ప్రవేశం, సముచిత కరోనా చికిత్స అందేటట్టు చూడాలి. అప్పుడే మన వైద్య రంగం ప్రజాస్వామిక లక్షణాన్ని రుజువు చేసుకోగలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News