Monday, April 29, 2024

అధికార మార్పిడికి ట్రంప్ సహకరించకపోతే…

- Advertisement -
- Advertisement -
If Trump does not cooperate in transfer of power
పెద్ద సంఖ్యలో అమెరికన్లు మృత్యువాత పడనున్నారు

వాషింగ్టన్: అధికార మార్పిడికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహకరించకపోతే కొవిడ్19 వల్ల అమెరికన్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడే ప్రమాదమున్నదని డెమోక్రటిక్ పార్టీ తరఫున నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మీడియా ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 సీట్లలో బైడెన్ 306 గెలుచుకోగా, ట్రంప్ 232కే పరిమితమయ్యారు. అమెరికాలో అధ్యక్ష భవనంలోకి అధికార మార్పిడి జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జిఎస్‌ఎ) ద్వారా జరగాలి. అయితే, జిఎస్‌ఎ ఇప్పటివరకూ జోబైడెన్, కమలాహారిస్‌ల ఎన్నికను గుర్తించలేదు. ట్రంప్‌చేత నియమితమైన జిఎస్‌ఎ అధికార మార్పిడికి చట్టపరమైన ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు.

గత సంప్రదాయం ప్రకారం ఇప్పటికే కొత్తగా అధికారం చేపట్టే బైడెన్ బృందానికి బడ్జెట్ వివరాలు, నిఘా ఏజెన్సీల వివరాలు అందించాల్సి ఉండేది. ఇంకా అది జరగలేదు.  అమెరికాలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినైజేషన్ ప్రక్రియ త్వరగా ప్రారంభించాల్సి ఉన్నదని బైడెన్ తెలిపారు. అయితే, 30 కోట్ల తమ దేశ పౌరులకు వ్యాక్సినైజేషన్ ఏవిధంగా ప్రారంభించాలనే దానిపై ఓ స్పష్టమైనప్రణాళిక రూపొందించుకోవాల్సిన సమయంలో ట్రంప్ అధికార యంత్రాంగం నుంచి తమకు సహకారం లేదని బైడెన్ ఆరోపించారు. అమెరికాలో తాజాగా ఒకేరోజు రికార్డు స్థాయిలో 1,60,000 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే ఆ దేశంలో 2,47,000మంది మృతి చెందారు. ఇప్పుడు తమ దేశం ఓ పెద్ద సవాల్‌ను ఎదుర్కుంటోందని అమెరికా వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సంప్రదాయం ప్రకారం బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టడానికి మరో రెండు నెలల సమయమున్నది. జనవరి 20న బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయాల్సి ఉన్నది. ఇలాంటి కీలక సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు గోల్ఫ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారని బైడెన్ విమర్శించారు. తన ఎన్నికను ట్రంప్ అంగీకరించకపోవడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News