Monday, April 29, 2024

వానకాలం రైతుబంధు అమలు !

- Advertisement -
- Advertisement -

 Rythu Bandhu

 

2020కి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
క్యాబినేట్ భేటీలో చర్చ.. తదుపరి ఉత్తర్వులు ?
అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే కృత నిశ్చయంతో ఉన్న సిఎం కెసిఆర్
ఎలాగైనా.. పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచన
4 సీజన్‌లలో ఇప్పటికే రూ.21 వేల కోట్లు రైతులకు అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న వానకాలం సీజన్‌కు రైతుబంధు పథకం అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇందుకోసం మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఎంతమంది అర్హులు ఉన్నారు ? ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందనే దానిపై కసరత్తు మొదలైంది. దీనిపై ఈ నెల 5న సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 2018 వానకాలం సీజన్‌లో మే నెలలో రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన విషయం విధితమే. ప్రతి సీజన్‌కు అందుబాటులో ఉన్న పట్టాదారుల సంఖ్య, విస్తీర్ణానికి అనుగుణంగా రైతుబంధు అమలు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో రాష్ట్రం పూర్తిగా ఆదాయం కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.

ఈ సమయంలోనూ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.33 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. అలాగే రైతుబంధుకు కూడా నిధులు సమకూర్చుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైతుబంధు పథకం అమలు కోసం రూ.14 వేల కోట్లు కేటాయించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులకు ఎలాగైనా పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బయట అప్పులు కూడా పుట్టే పరిస్థితులు లేనందున ప్రభుత్వమే సాయాన్ని అందించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఎటువంటి కోత లేకుండా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించారు. ఇప్పుడు పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నందున కొన్ని ఎకరాలకు పరిమితం చేసి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2018 వానకాలం, యాసంగి సీజన్‌లలో ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించారు. అయితే రెండోసారి అధికారం ఇస్తే ఎకరాకు రూ.5 వేలు ఇస్తామని ప్రకటించి, 2019 వానకాలం, యాసంగి సీజన్‌లలో అలాగే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మరీ అమలు ఎలా ఉంటుందనే దానిపై వ్యవసాయ శాఖ మార్గదర్శకాల ఫైనల్ చేసిన తరువాత తెలియనుంది.

రెండేళ్లలో రూ.21 వేల కోట్లు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రారంభించన నాటి నుంచి నాలుగు సీజన్‌లలో ఇప్పటి వరకు ఏకంగా రైతుల ఖాతాలకు రూ.21,017 కోట్లు జమ చేయడం విశేషం. ఈ స్థాయిలో నేరుగా రైతులకు సాయం అందించిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కుతుంది. మొదటి సారి చెక్కుల ద్వారా రైతుబంధు సొమ్మును అందించారు. 2018 వానకాలం 50.25 లక్షల పట్టాదారులకు 1.30 కోట్ల ఎకరాల భూమి ఉండగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.5236 కోట్లు చెల్లించారు. యాసంగిలో 49.10 లక్షల పట్టాదారులకు 1.31 కోట్ల ఎకరాల భూమికి రూ.5248 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశారు. అలాగే 2019 వానకాలం సీజన్‌లో 51.61 లక్షల పట్టాదారుల 1.22 కోట్ల ఎకరాల భూమికి ఎకరాకు రూ.5 వేల చొప్పునే రూ.6125 కోట్లు, యాసంగిలో 42.42 లక్షల పట్టాదారుల 88.13 లక్షల ఎకరాల భూమికి రూ.4406 కోట్లు జమ చేశారు. దీంతో మొత్తంగా నాలుగు సీజన్‌లలో రూ.21,017 కోట్లు చెల్లించారు.

 

Implementation of Rythu Bandhu for Vaanakalam crop
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News