Monday, April 29, 2024

ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

India COVID 19 cases tally crosses 33 lakh mark

 

33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా ఈ సంఖ్య ఒక్క సారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33 లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 25లక్షలకు పైగా కోలుకోగా 7,25,771 యాక్టివ్ కేసులున్నాయి. కాగా తాజాగా మరో 1,023 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60,472కు చేరుకుంది.

దేశంలో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదు కావడం ఇది నాలుగో సారి. ఈ నెల 19న అత్యధికంగా 1,092 మంది మరణించారు. తాజాగా సంభవించిన మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 295 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 23,089కి చేరుకుంది. కాగా కర్నాటకలో మరో 133 మంది మరణించడంతో అక్కడ మొత్తం మరణాల సంఖ్య 5,091కి చేరింది. తమిళనాడులో మరో 118 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకొని అక్కడ మరణాల సంఖ్య 6,839కి చేరింది.

ఢిల్లీలో కొత్తగా మరో 17 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో దేశ రాజధానిలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,347కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 90 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకొని అక్కడ ఇప్పటివరకు 3,149 మంది కరోనా రోగులు మృతి చెందారు, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లలో కూడా కరోనా మరణాల సంఖ్య దాదాపు 3 వేలకు చేరింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో 55 మంది, యుపిలో 90మంది ప్రాణాలు కోల్పోయారు.

76 శాతానికి పెరిగిన రికవరీ రేటు

పది రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా ఎక్కువ
ఢిల్లీలో అత్యధికంగా 90 శాతం
24 గంటల్లో కోలుకున్న 56,013 మంది

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతుండడంతో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. బుధవారం దేశవవ్యాప్తంగా 9,24,998 శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలియజేసింది. ఇప్పటివరకు దేశంలో 3,85,76,510 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.ఈ నెల 21న రికార్డు స్థాయిలో10 లక్షల 23 వేల టెస్టులు నిర్వహించారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంద్వారా కరోనా పాజిటివ్‌లను ముందుగా గుర్తించి సరయిన చికిత్స అందించడంతో వైరస్‌నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాటుగా మరణాల రేటు కూడా తగ్గుతోందని ఐసిఎంఆర్ తెలిపింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్‌నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 25 లక్షలు దాటింది. బుధవారం ఒక్క రోజే 56,013 మంది వైరస్‌నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా వైరస్‌నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో రికవరీ రేటు 76.24 శాతానికి పెరగ్గా, మరణాల రేటు మరింత తగ్గి 1.83 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులకన్నా రికవరీలు దాదాపు 18 లక్షలు ఎక్కువ ఉండడం విశేషం. దేశంలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు దేశ సగటుకన్నా ఎక్కువగా ఉండడం శుభ సూచకం.

ఢిల్లీలో అత్యధికంగా 90 శాతం ఉండగా, తమిళనాడులో 85 శాతం, బీహార్‌లో 83.80 శాతం, గుజరాత్‌లో 80.20 శాతం, రాజస్థాన్‌లో 79.30 శాతం, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో 79.10 శాతం ఉంది. ఇక మరణాల రేటు విషయంలో అసోం 0.27 శాతంతో అతి తక్కువ మరణాల రేటు కలిగి ఉంది. బీహార్ (0.42 శాతం), తెలంగాణ (0.70 శాతం), ఆంధ్రప్రదేశ్ (0.93 శాతం), చత్తీస్ గఢ్ (0.95 శాతం) జార్ఖండ్ (1.09) దేశ సగటుకన్నా తక్కువ మరణాల రేటు కలిగి ఉన్నాయి.

India COVID 19 cases tally crosses 33 lakh mark
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News