Monday, April 29, 2024

గట్టిపడుతున్న గళం

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi holds meet with 7 state CMs పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్‌డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి పలకడం, కేంద్రం నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా సంఘటిత పోరాటం చేయాలని నిర్ణయించుకోడం అమిత ప్రాధాన్యత గల పరిణామమని చెప్పాలి. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో ఆమె అధ్యక్షతన ఈ ఏడుగురు ముఖ్యమంత్రులూ విడియో భేటీలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో గల, పాలక భాగస్వామిగా ఉన్న రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, జార్ఖండ్, మహారాష్ట్రల సిఎంలతో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ భేటీలో పాల్గొని గొంతు కలపడం విశేషం. దేశ ఫెడరల్ నిర్మాణాన్ని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కూల్చివేస్తున్నదని వీరంతా ఒక్క కంఠంతో అన్నారు. ఎన్‌డిఎ యేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలన్నీ తమ హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంతో ఐక్యంగా పోరాడాలని పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన సూచనతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని సోనియా గాంధీ ప్రకటించారు.

సొంత పార్టీలో ఒక మాదిరి తిరుగుబాటు వంటి పరిస్థితిని సద్దుమణిగించి చిరకాల క్రియాశూన్యత నుంచి బయటపడ్డ సోనియా గాంధీ ఆ వెంటనే ఈ భేటీని నిర్వహించడం గమనార్హం. ఇది ప్రధానంగా జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ (నీట్, జిఇఇ మెయిన్స్) ప్రవేశ పరీక్షల వాయిదా డిమాండ్ పైనా, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిహార బకాయిల సమస్య పైనా దృష్టి కేంద్రీకరించింది. ఈ రెండు విషయాల్లోనూ ప్రధాని మోడీ ప్రభుత్వం వహిస్తున్న ఏక పక్ష మొండి వైఖరిని నిరసించింది. వాస్తవానికి నీట్, జెఇఇ పరీక్షల సమస్య అత్యంత జటిలంగా తయారయింది. ఒక వైపు నానాటికీ తీవ్రమవుతూ కోవిడ్ 19 వైరస్ సృష్టిస్తున్న ప్రాణాంతక పరిస్థితి, మరోవైపు విద్యా సంవత్సరానికే వాటిల్లుతున్న ముప్పు. జెఇఇ మెయిన్స్ పరీక్షల కోసం 9.53 లక్షలు, నీట్ రాయడానికి 15.97 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఈ రెండు పరీక్షలు ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడ్డాయి.

తాజా నిర్ణయం ప్రకారం జెఇఇ మెయిన్స్ సెప్టెంబర్ 1నుంచి 6 వరకు నీట్ 13న జరగాలి. ఇప్పటికి 14 లక్షల మంది పరీక్షార్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తున్నది. అయితే కరోనా ఏమాత్రం తెరిపివ్వకపోగా మరింత ఉధృతమయింది. ఇంకా విజృంభించే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖులు, విదేశాల్లోని భారతీయ విద్యావేత్తలు కలిసి మొత్తం 150 మంది ఈ పరీక్షలను ఎట్టి పరిస్థిల్లోనూ వాయిదా వేయరాదని కోరుతూ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. కొంత మంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం పరీక్షల వాయిదాను కోరుతున్నారని వారి ఒత్తిడికి లొంగరాదని కూడా అందులో విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగిన ఏడుగురు నాన్ ఎన్‌డిఎ ముఖ్యమంత్రుల భేటీ మాత్రం విద్యార్థులకు వాటిల్లగల ప్రాణాపాయాన్ని దృష్టిలో ఉంచుకొని నీట్, జెఇఇ మెయిన్స్ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలని కోరింది.

ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ముందుగానే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా సేకరించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. జిఎస్‌టి బకాయిల విషయంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రుల నిరసన స్వరం అత్యంత దృఢంగా వినిపించింది. జిఎస్‌టికి స్వస్తి చెప్పి పూర్వపు పద్ధతిని పునరుద్ధరించడమే మంచిదేమో ఆలోచించాలని మహారాష్ట్ర, పుదుచ్చేరి సిఎంలు సూచించడం గమనించవలసిన విషయం. జిఎస్‌టి పన్ను ఆదాయం పెరుగుదల 14 శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఆ మేరకు పరిహారాన్ని ప్రతి రెండు మాసాలకు చెల్లించాలని రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చిన మాటను ప్రధాని మోడీ ప్రభుత్వం తప్పుతున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు నిర్ణయించారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా రాబడులు తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారాన్ని గత ఏడాది కంటే 89 శాతం ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని అది రూ. 3.12 లక్షల కోట్ల మేరకు ఉండగలదని ఒక అంచనా. ఒక్క పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికే ఇప్పటి వరకు రూ. 53 వేల కోట్లు బకాయిపడి ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ నిరంకుశ ధోరణుల మీద కలిసి పోరాడాలని పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ ఏడుగురు ముఖ్యమంత్రులు సంకల్పించడం జాతీయ స్థాయిలో ఇంతవరకు సన్నబడిపోయి ఉన్న ప్రతిపక్ష కంఠం సంఘటిత మవుతున్నదనడానికి నిదర్శనం.

Sonia Gandhi holds meet with 7 state CMs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News