Monday, April 29, 2024

సత్తా చాటిన భారత బౌలర్లు

- Advertisement -
- Advertisement -

కివీస్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్
హామిల్టన్: తొలి టెస్టుకు ముందు భారత బౌలర్లు గాడిలో పడ్డారు. వన్డే సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించి కివీస్ ఎలెవన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే పరిమితం చేశారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌటైంది. కాగా, శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కివీస్ ఎలెవన్ జట్టును భారత బౌలర్లు హడలెత్తించారు. వన్డే సిరీస్‌లో విఫలమైన భారత ప్రధాన బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (2)ను బుమ్రా ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ టిమ్ సిఫర్ట్ (9)ను షమి ఔట్ చేశాడు. దీంతో కివీస్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర తన పోరాటాన్ని కొనసాగించాడు. అయితే ఏడు ఫోర్లతో 34 పరుగులు చేసిన రచిన్ రవీంద్రను ఉమేశ్ యాదవ్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే ఫిన్ అలెన్ (20)ను బుమ్రా అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో హెన్రీ కూపర్, టామ్ బ్రూస్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. కాగా, కుదురుగా ఆడుతున్న బ్రూస్ (31)ను భారత యువ స్పీడ్‌స్టర్ నవ్‌దీప్ ఔట్ చేశాడు. సైని వేసిన బంతిని అంచన వేయడంలో విఫలమైన బ్రూస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే కూపర్ కూడా వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కూపర్ ఆరు ఫోర్లతో 40 పరుగులు చేసి షమి చేతికి చిక్కాడు. కెప్టెన్ డారి మిఛెల్ 65 బంతుల్లో ఐదు బౌండరీలు చేసి వెనుదిరిగాడు. ఉమేశ్ యాదవ్ అద్భుత బంతితో మిఛెల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆటగాడు నిషమ్ (1) నిరాశ పరిచాడు. అతన్ని షమి క్లీన్‌బౌల్డ్ చేశాడు. వికెట్ కీపర్ క్లివర్(13)ను సైని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐష్ సోధి (14)ను అశ్విన్ వెనక్కి పంపాడు. దీంతో కివీస్ ఎలెవన్ ఇన్నింగ్స్ 235 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో షమి 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, సైని, ఉమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి ఏడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడారు. ఇద్దరు పోటీ పడి ఫోర్లు కొట్టడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. దూకుడుగా ఆడిన పృథ్వీషా 25 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్స్‌తో 35 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. మయాంక్ అగర్వాల్ ఒక సిక్స్, మరో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ ఆధిక్యం 87 పరుగులకు చేరింది.

India lead by 87 runs against New Zealand XI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News