Sunday, April 28, 2024

రసపట్టులో తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

India vs England:India's target is 420 runs

 

అశ్విన్ మాయ, రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్, భారత్ గెలుపు లక్షం 420, ప్రస్తుతం 39/1, ఆసక్తికరంగా మారిన చివరి రోజు ఆట

చెన్నై: భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగి పోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే కుప్పకూలింది. అయితే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 241 పరుగుల ఆధిక్యంతో టీమిండియా ముందు 420 భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మంగళవారం ఆఖరి రోజు భారత్ మరో 381 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. ఇక పిచ్ కూడా బౌలింగ్‌కే అనుకూలంగా కనిపిస్తుండడంతో ఇంగ్లండ్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పుజారా, రహానె తదితరులు తమ మార్క్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం టీమిండియా డ్రాతో గట్టెక్కినా ఆశ్చర్యం లేదు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 20 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (15; 35 బంతుల్లో 3×4), పుజారా 15 (నాటౌట్) క్రీజులో ఉన్నారు.

సుందర్ ఒంటరి పోరాటం

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. 257/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. యువ బ్యాట్స్‌మన్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుందర్ 138 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు సాధించాడు. అశ్విన్, సుందర్‌లు ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఇక అశ్విన్, నదీమ్‌లు నిరాశ పరిచారు. ఇషాంత్ (4), బుమ్రా కూడా విఫలమయ్యారు. దీంతో భారత్ 95.5 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బెస్ నాలుగు, అండర్సన్, లీచ్, ఆర్చర్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. కాగా ఇంగ్లండ్‌కు 241 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక టీమిండియాను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా ఇంగ్లండ్ దాన్ని వదులుకుని రెండో ఇన్నింగ్స్ చేపట్టింది.

చెలరేగిన అశ్విన్

కాగా, రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ బర్న్ (0)ను అశ్విన్ తొలి బంతికే ఔట్ చేశాడు. తర్వాత ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెరుగైన బౌలింగ్‌తో చెలరేగి పోయారు. ముఖ్యంగా అశ్విన్ తన మార్క్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పతనాన్ని శాసించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ జో రూట్ ఒంటరి పోరాటం చేశాడు. ధాటిగా ఆడిన రూట్ ఏడు ఫోర్లతో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో పోప్ (28), బట్లర్ (24) మాత్రమే కాస్త రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు, నదీమ్ రెండు వికెట్లు పడగొట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News