Sunday, April 28, 2024

తేలి పోతున్న షట్లర్లు

- Advertisement -
- Advertisement -

Indian Badminton

 

తిరోగమనంలో భారత బ్యాడ్మింటన్

మన తెలంగాణ/క్రీడా విభాగం: గతంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత షట్లర్లు రెండేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగుల్చుతున్నారు. కొత్త సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడిచి పోయినా భారత క్రీడాకారులు ఒక్క టైటిల్ కూడా సాధించలేక పోయారు. కొత్త సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తారని భావించిన భారత షట్లర్లు అత్యంత చెత్త ఆటతో తొలి రౌండ్‌లలోనే ఇంటిదారి పడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు, సైనా నెహ్వాల్ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ తదితరులు ఆరంభంలోనే చేతులెత్తేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు వరుసటైటిల్స్‌తో పెను ప్రకంపనలే సృష్టించారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్, సమీర్, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ తదితరులు అసాధారణ ఆటతో భారత్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దారు.

తీరుమారని శ్రీకాంత్
శ్రీకాంత్, ప్రణయ్‌లు అయితే ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించారు. శ్రీకాంత్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా అగ్రస్థానానికి కూడా చేరుకున్నాడు. అయితే సాఫీగా సాగుతున్న తరుణంలో గాయాలు శ్రీకాంత్ శాపంగా మారాయి. వరుస గాయాలు, ఫిట్‌నెస్ లేమి అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఒకప్పుడూ వరుస విజయాలతో పురుషుల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కనిపించిన శ్రీకాంత్ ఆ తర్వాత వరుస ఓటములతో నిరాశే మిగిల్చాడు. రెండేళ్ల కాలంలో శ్రీకాంత్ కనీసం ఒక్క టైటిల్ కూడా సాధించలేదంటే అతని ఆట ఎంత పేలవంగా సాగుతుందో ఊహించవచ్చు. జపాన్, చైనా, కొరియా, డెన్మార్క్, ఇండోనేషియా, తైపీ తదితర దేశాలకు చెందిన షట్లర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ ఆ తర్వాత గాడి తప్పాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ దశ కూడా దాటలేక పోతున్నాడు.

ఈ సీజన్‌లో కూడా అతని ఆట తీరు మాత్రం మారలేదు. ఆడిన రెండు మూడు టోర్నీల్లో కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. రానున్న రోజుల్లోనైనా శ్రీకాంత్ మెరుగైన ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న శ్రీకాంత్ కనీసం ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించలేక పోయారు. అతని ఆట ఇలాగే ఉంటే భవిష్యత్తులో తెరమరుగు కావడం ఖాయం. ఇక, కశ్యప్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్ దశను దాటడమే గొప్పగా మారింది.

పెద్ద టోర్నీల్లో ఆడుతున్నా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రణయ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతంలో పెద్ద పెద్ద స్టార్లను సయితం అలవోకగా ఓడించిన ఘనత ప్రణీత్‌కు ఉండేది. కానీ, ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇతను కూడా రెండేళ్లుగా కనీసం ఒక్క టైటిల్ కూడా సాధించలేక పోయారు. సమీర్ వర్మ, సౌరభ్ వర్మ తదితరుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యువ సంచలనం లక్షసేన్ మాత్రం కాస్త మెరుగ్గా ఆడుతున్నాడు. కిందటి ఏడాది రెండు, మూడు టైటిల్స్ సాధించి కాస్త పరువును కాపాడాడు. ఈసారి కూడా అతనిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

సైనాను వీడని వైఫల్యాలు
గతంలో మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన ఘనత తెలుగుతేజం సైనా నెహ్వాల్‌కే దక్కుతోంది. టోర్నీ ఏదైనా చివరి వరకు గట్టిగా పోరాడేది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన షట్లర్‌గా పేరు తెచ్చుకుంది. ఎన్నో చిరస్మరణీయ విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌ను బలమైన శక్తిగా మార్చింది. అయితే కొన్నేళ్లుగా సైనా ఆట తీరులో ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. ఆమె ఆటలో మునుపటి జోష్ కనిపించడం లేదు. టోర్నీ ఏదైనా క్వార్టర్ ఫైనల్‌కు కూడా చెరకుండానే నిష్క్రమిస్తోంది. ఆమె పేలవమైన ఆటతో సతమతమవుతుండడం మహిళల బ్యాడ్మింటన్‌లో భారత్ అనామక జట్టుగా మారి పోయిందనే చెప్పాలి. గతంలో స్పెయిన్, చైనా, జపాన్, తైపీ, ఇండోనేషియా, మలేసియా షట్లర్లకు దీటుగా సైనా ఆధిపత్యాన్ని చెలాయించింది. అయితే రానురాను సైనా ఆట రోజురోజుకు తీసి కట్టుగా తయారైంది. రెండేళ్లుగా ఆమె ఒక్క టైటిల్‌ను కూడా సాధించలేదంటే సైనా ఆట ఎంత పేలవంగా సాగుతుందో ఊహించుకోవచ్చు.

సింధు కూడా అంతే
ఇక, ప్రపంచ ఛాంపియన్ సింధు కూడా కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతోంది. మహిళల బ్యాడ్మింటన్‌ను చాలా రోజుల పాటు శాసించిన సింధు ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తోంది. గతంలో టోర్నీ ఏదైనా ఫైనల్‌కు చేరడం సింధుకు అలవాటుగా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా సింధు ఆటలో జోష్ కనిపించడం లేదు. ఫైనల్ మాట అటుంచి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరడం కూడా సింధుకు గగనంగా మారింది. ప్రపంచ టైటిల్ సాధించడం తప్పిస్తే సింధు రెండేళ్లుగా పేలవమైన ఆటతో సతమతమవుతోంది. ఈ ఏడాది కూడా ఆమె ఆట తీరు ఏమాత్రం మెరుగ పడలేదు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. రానున్న టోర్నీల్లోనైనా మెరుగ్గా ఆడుతుందా లేదా అనేది సందేహమే. ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలు సమీపిస్తున్న తరుణంలో భారత షట్లర్లు పేలవమైన ఆటతో సతమతమవుతుండం ఆందోళన కలిగించే పరిణామమే.

Indian Badminton Poor performance
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News