Monday, April 29, 2024

వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు

- Advertisement -
- Advertisement -

agriculture

 

 

హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లు దాటుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారానికి భవిష్యత్‌లో భారీగా డిమాండ్ పెరుగుతుందన్నారు. ప్రకృతిలో సహజ వనరులైన నీరు, నేల తరిగిపోతుందని చెప్పారు. పట్టణీకరణ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతున్నందున ఆహార ఉత్పత్తి, వినియోగంపై ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న వ్యవవసాయ విధానాలు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పారు.

ప్రపంచంలో 570 మిలియన్ల చిన్న, సన్నకారు రైతులతో కలిపి ప్రపంచ జనాభాలో 28 శాతం మంది వ్యవసాయ, ఆహార రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 2030 నాటికి ఆహార కొరతలేని సుస్థిర అభివృద్ధి జరగాలంటే వ్యవసాయ రంగంలో సమూల మార్పులు జరగాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహార రంగాలు అందిపుచ్చుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో మొబైల్ రిమోట్ సెన్సింగ్, కంప్యూటర్లు కొంత వరకు ఉపయోగపడుతున్నాయన్నారు. మొబైల్‌ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితులలో వీటి సేవలు మరింత వినియోగించుకోవాలని సూచించారు.

వ్యవసాయం అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రస్తుత స్థాయికి చేరిందని, రాబోయే కాలంలో ప్రపంచ అవసరాల మేరకు ఆధునిక సాంకేతికత సాయంతో మరో విప్లవం సృష్టించాల్సిన అవసరముందన్నారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయరంగం అందిపుచ్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్దతులు, గ్రామీణ ఆర్థిక స్థితి, సహజవనరుల యాజమాన్యాన్ని సంపూర్ణంగా మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఐటిసి డైరెక్టర్ శివకుమార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అశ్విని ఛాత్రే, జినేశ్‌షా, రామ్ కౌండిస్య, రాజ్‌కుమార్, సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Innovations in agriculture and food
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News