Monday, April 29, 2024

కెసిఆర్ కు పరామర్శల వెల్లువ

- Advertisement -
- Advertisement -

యశోద ఆస్పత్రికి వరుసకట్టిన నేతలు, సినీ ప్రముఖులు

కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గవర్నర్
కెసిఆర్‌కు చంద్రబాబు సహా పలువురు నేతల పరామర్శ

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం గవర్నర్ తమిళిసై కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సర్జరీ తర్వాత కెసిఆర్ రికవరీ ఎలా ఉందని గవర్నర్ వాకబు చేశారు. ఈ నెల 9వ తేదీన రాజ్‌భవన్ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం సందర్భంగా కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి హరీశ్‌రావును గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
కెసిఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలి : చంద్రబాబు
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను చంద్రబాబు పరామర్శించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ.. కెసిఆర్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను అని, కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారని అన్నారు. త్వరలోనే కెసిఆర్ మామూలుగా నడుస్తారని చంద్రబాబు అన్నారు. యశోద ఆస్పత్రిలో ఉన్న కెసిఆర్‌ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కెసిఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తనకు చెప్పినట్లు భట్టి వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారని అన్నారు. అలాగే బిఎస్‌పి నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, భీమ్ ఆర్మీ ఛీఫ్ ఆజాద్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కెసిఆర్‌ను పరామర్శించి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
కెసిఆర్‌ను పరామర్శించిన చిరంజీవి, ప్రకాశ్‌రాజ్
ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌లు యశోద ఆసుపత్రిలో కెసిఆర్‌ను పరామర్శించారు. ఆసుపత్రిలో మాజీ సిఎం కెసిఆర్ దగ్గర కెటిఆర్, కవిత, గంగుల కమలాకర్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News