Monday, April 29, 2024

ఆర్‌బిఐ నిగ్గు తేల్చిన నిజం

- Advertisement -
- Advertisement -

Kashmir Six Parties Political Crisis కరోనా లాక్‌డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం పెంచడమే తరణోపాయమని రిజర్వు బ్యాంకు చేసిన తాజా హెచ్చరిక విధాన కర్తల వెన్నున చెళ్లుమన్న కొరడా దెబ్బలా ఉంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జులై సెప్టెంబర్)లో కూడా కొనుగోళ్లు, వినియోగం పెరిగి పరిస్థితి పుంజుకునే సూచనలు కనిపించడం లేదని ఆర్‌బిఐ 2019-2020 వార్షిక నివేదికలో వెల్లడించింది. లాక్‌డౌన్‌ను సడలించిన వెంటనే అంటే గత మే, జూన్ నెలల్లో ఆశాజనకంగా కనిపించిన ఆర్థిక పరిస్థితి జూలై, ఆగస్టు మాసాల్లో మళ్లీ నిరాశామయంగా మారిందని పేర్కొన్నది. అందుచేత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పతన గతి రెండో త్రైమాసికంలో కూడా కొనసాగనున్నట్లు అంచనా వేసింది.

కోవిడ్ 19 వైరస్ నిశ్శేషంగా అంతమైపోయిన తర్వాత గాని ప్రైవేటు వినియోగం మెరుగుపడే అవకాశం లేదని, అంతవరకు ప్రభుత్వ వినియోగమే దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ దారుణంగా పడిపోయిందని చెప్పింది. వాహనాల అమ్మకాలు ఏడాది క్రితం (2019 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం) స్థాయి కంటే ఐదో వంతు, గృహ వినియోగ వస్తువుల విక్రయం మూడో వంతు తగ్గిపోయినట్టు ఆర్‌బిఐ నివేదిక తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు ముమ్మరించడం వల్ల ట్రాక్టర్ల అమ్మకాలు 38.5 శాతం పెరిగాయని, మోటారు సైకిళ్ల వ్యాపారం కూడా జులైలో పుంజుకోడం ప్రారంభించిందని, వేతనాలు పెరగకపోడం, వలస కార్మికుల సంక్షోభం, ఉద్యోగాలూడిపోడం వంటి కారణాల వల్ల పల్లెల పరిస్థితి కూడా ఏమంత బాగులేదని నివేదిక నిగ్గు తేల్చింది.

అంటే కరోనా లాక్‌డౌన్ దేశాన్నంతటినీ ఇళ్లల్లోకి తోసేసి గడియవేసి తాళం బిగించేసిన తర్వాత మాసాల తరబడిగా పనిపాట్లు స్తంభించిపోయి ప్రజల ఆదాయాలు శూన్యస్థితికి చేరినందున మార్కెట్లు తెరుచుకున్న తర్వాత కొత్తగా దేనినీ కొనుక్కోగలిగే శక్తి వారికి బొత్తిగా లేకుండాపోయింది. దాని ప్రభావమే ఈ అపూర్వ ఆర్థిక పతన దుస్థితి. మరి గత మే 12న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అట్టహాసంగా ప్రకటించి, ఐదు రోజుల పాటు సీరియల్‌గా ఆవిష్కరించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంలో అణుమాత్రమైనా ఉపయోగపడలేదని స్పష్టపడిపోయినట్టే కదా! ఆమె అంత భారీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు దేశ ప్రజల కళ్లు మెరిసిపోయాయి, ఆశలు ఆకాశాన్నంటాయి. రుణాలు రద్దు అవుతాయని, పన్నులు, సుంకాలు తగ్గుతాయని, ఇంత కష్ట కాలంలోనూ బతుకు నల్లేరు మీద బండి అవుతుందని అనుకున్నారు. స్టాక్ మార్కెట్ సూచీ 2 శాతం పై కెగిరింది. రూపాయి మారకపు విలువ పెరిగింది. కాని ఆ ప్యాకేజీలోని చేదు వాస్తవం అనుభవంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తల్లకిందులయ్యాయి.

ఈ ప్యాకేజీ తాయిలాన్ని చూపి బొగ్గు, గనులు, విద్యుత్తు, పౌర విమాన యానం, రక్షణ ఉత్పత్తులు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాలను గంప గుత్తగా ప్రైవేటుకు అప్పగించే నిర్వాకాన్ని ఆర్థిక మంత్రి జరిపించేశారు. స్వామి కార్యం పేరుతో స్వకార్యాన్ని కానిచ్చేశారు. ప్యాకేజీ కిమ్మత్తు స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతమని, ఇంత భారీ ఉద్దీపన ప్రకటించిన ఘనత ఒక్క భారత దేశానికే దక్కుతుందని ఊదరగొట్టారు. వాస్తవంలో అందులో నుంచి ప్రజలకు మేలు జరిగేది జిడిపిలో 0.8 శాతమేనని తేలిపోయి ఆ మేలి ముసుగు కాస్తా తొలగిపోయింది. మూలంలో మినహాయించుకునే పన్ను (టిడిఎస్) ను వాయిదా వేయడం, రుణాలు, వాటికి హామీలు ఇవ్వబోవడం వల్ల వ్యాపారాలకుగాని, ప్రజలకుగాని కలిగిన మేలు సున్నా.

లాక్‌డౌన్ సంక్షోభంలోనూ పెట్రోల్, డీజెల్ ధరలు నిరాఘాటంగా పెంచుకుంటూ పోయిన పెద్ద సర్కారు దూకుడు దుష్ఫలితం నిలువెత్తున కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్‌బిఐ నివేదికను ఆధారం చేసుకొని మరో సారి మోడీ ప్రభుత్వంపై శరసంధానం చేశారు. ఈ విషయం తానెప్పుడో చెప్పానని ఎలుగెత్తారు. ‘రుణాలివ్వండి కాని భారత మాత తన బిడ్డల విషయంలో షావుకారు మాదిరిగా వ్యవహరించకూడదు, నేరుగా వారి చేతుకి డబ్బివ్వాలి, కాలి నడకన రోడ్డెక్కిన వలస కార్మికులకు, బాధల్లోని రైతులకు కావలసింది అప్పు కాదు, నగదు, అలా చేసి ప్రజల కొనుగోలు శక్తి పెంచకపోతే ముందు ముందు ఆర్థిక మహా సంక్షోభం ముంచుతుందని రాహుల్ గాంధీ గత మే 16 వ తేదీన హెచ్చరించారు. ఆ విషయాన్నే ఇప్పుడాయన గుర్తు చేశారు, తప్పు పట్టగలమా?!.

lockdown effect on indian economy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News