Monday, April 29, 2024

రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!

- Advertisement -
- Advertisement -

State Rural is the ideal of the country

తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది అని చెప్పవచ్చు. ఇటీవల ఖమ్మం జిల్లా గ్రామీణ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి రైతుల ద్వారా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే అవకాశం దొరికింది. వాటి ఆధారంగానే ఈ ఆర్టికల్ రాయాలనే ఆలోచన వచ్చింది. వ్యవసాయం ఎలా ఉంది? పంటలు ఎలా పండుతున్నాయి? సాగునీరు ఉందా? పంటలకు గిట్టుబాటు ధర దొరుకుతుందా? ప్రభుత్వం నుండి సహాయం అందుతుందా? ఇలా అనేక ప్రశ్నలను వేసినప్పుడు రైతులు చెప్పింది ఒక్కటే! ఒకనాడు నాట్లు వేయాలన్నా, కలుపు తీయాలన్నా కూలీలకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కావు.

అంతేకాదు విత్తనాలకు, ఎరువులకు డబ్బులు దొరకక ఇబ్బందిపడ్డ రోజులున్నాయి. ఒక్కొక్కసారి వడ్డీకి కూడా డబ్బులు పుట్టకపోతుండే. దానితో లేటుగా నాట్లు వేసుకోవాల్సి వచ్చేది. వడ్డీకి డబ్బులు తెచ్చి వ్యవసాయం చేసే వాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేకపోగా మీమే ఎవరికైనా పదో, పరకో చేబదులు ఇవ్వగలుగుతున్నాం అన్నారు. అది ఎలా సాధ్యం అయిందని అడిగా. కెసిఆర్ సర్కార్ రైతులకు రైతు బంధు, 24 గంటలు ఉచిత విద్యుత్తు, సబ్సిడీకి ఎరువులు, విత్తనాలు ఇస్తున్నది. ఆపదలో రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇన్సూరెన్సు ఉంది. వృద్ధులకు ఆసరా ఫించన్లు, ఆడపిల్లల పెళ్ళికి కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి. సాగునీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీరణ పెరిగింది. మెట్ట పొలాల్లో కూడా మంచి పంటలు పండిస్తున్నాం. పోయిన వేసవి కాలంలో వరితో పాటు మొక్కజొన్న, కాయగూరలు ఇతర పంటల దిగుబడి కూడా పెరిగింది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసింది. ఆ డబ్బులు కూడా మా బ్యాంకు ఖాతాలో పడ్డాయి. కరోనా లాక్ డౌన్ పిరియడ్‌లో నగరాలలో, పట్టణాలలో పనులు బంద్ కావడంతో అందరూ గ్రామాలకు వచ్చారు. అయినా ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదు అని అన్నారు. కారణం ఏమిటి అని అడిగా. ఒక వైపు వ్యవసాయ పనులు, మరోవైపు ఉపాధి హామీ పనులు ఉన్నాయి. దీనితో అందరికీ ఏదొక పని దొరికింది. నాలుగు డబ్బులు వచ్చాయి అని చెప్పారు. వారు ఇచ్చిన వివరణ వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఇంకా ఏమి మాట్లాడలేదు.

రైతులు ఇంకొక మాట కూడా అన్నారు. మా దగ్గర డబ్బులు ఉంటె సర్క్యూలేషన్‌లో ఉంటాయి, ఇతర వర్గాల దగ్గర డబ్బులుంటె దాచుకుంటారు అన్నారు. మీరు ఎందుకు దాచుకోరు అని అడిగా. దానికి వారు చెప్పింది ఒకటే. మీము వ్యవసాయం మీద పెట్టుబడి పెడతాం. కూలీలకు, ఎరువులకు, విత్తనాలకు, దుక్కి దున్నడానికి ఇలా అన్ని వర్గాలకు మా డబ్బు చేరుతుంది. అలాగే పిల్లల చదువులకు, వైద్యానికి ఖర్చు చేస్తాం. ఇంకా డబ్బులుంటే ట్రాక్టర్ కొనడమో, టూ వీలర్ కొనడమో లేదా ఇంకో రెండు ఎకరాలు కొనుకోవడమో చేస్తాం. అదికాదంటే రెండెకరాలు కౌలుకు తీసుకొనే వ్యవసాయం చేస్తాం. అంతేకాని బ్యాంకులలో మాత్రం దాచుకోము. అది మా రైతుల నైజం కాదు అన్నారు. వారు చెప్పింది నిజమే అనిపించింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతం లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వారు చెప్పింది వంద శాతం కరెక్ట్ అనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మోటార్లు, పైపులు, ట్రాక్టర్లు, టూ వీలర్లు విక్రయాలు పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యి జలాశయాలకు నీళ్లు రావడంతో పాటు విస్తారంగా వర్షాలు పడడం, భూగర్భ జలాలు పెరగడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీయడంతో చెరువులు కూడా అలుగులు పారడంతో పడావుపడ్డ భూములను కూడా సాగు చేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. దీనితో వ్యవసాయ పని ముట్లు అవసరం అయ్యాయి. రైతుబంధు అందరికీ అందడంతో వ్యవసాయ పరికరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. సగటున గత ఏడాది పది మోటార్లు అమ్ముడుపోతే ఈ ఏడాది ఇరవై మోటార్లు అమ్ముడుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే స్థాయిలో పైపులు ఇతర పరికరాల విక్రయం జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాగు విస్తీరణ చూస్తే ఏ స్థాయిలో మోటార్లు, పైపులు ఇతర పరికరాల విక్రయం జరిగి ఉంటుందో అంచనా వేయవచ్చు. 58 లక్షల 88 వేల ఎకరాలలో పత్తి, 46 లక్షల ఎకరాలలో వరి, 10 లక్షల ఎకరాలలో కంది, పెసర, మొక్కజొన్న, సొయా చిక్కుడుతో పాటు ఇతర పంటల సాగు సుమారు 8 లక్షల ఎకరాలు సాగు అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రభుత్వ అంచనాలకు మించి సాగు విస్తీరణ పెరిగింది. ఇదే స్థాయిలో వ్యవసాయ పరికరాల విక్రయం జరిగిందని తెలుస్తున్నది.

ఈ పరిణామాలే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది అనడానికి నిదర్శనం. ప్రస్తుత తెలంగాణ గ్రామీణ ఆర్ధిక పరిస్థితిమీద మాజీ స్పీకర్ మధుసూదన చారి తన అనుభవంతో ఒక మాట అన్నారు.మనకు డబ్బులు అవసరమైతే చేబదులు కోసం గతంలో పట్టణంలో ఉద్యోగం చేసుకునే వారినో, వ్యాపారం చేసుకునే వారినో అడిగే వాళ్ళం. కానీ ఇప్పుడు వారు మొహం చాటేస్తున్నారు. ఇవ్వడానికి ఇష్టపడడంలేదు. అదే గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కానీ ఇతర వర్గాల వారు కానీ మనం అడిగినంత కాకపోయినా ఎంతో కొంత చేబదులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలతో ఇది సాధ్యం అయిందని మా మధ్య జరిగిన సంభాషణలో అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న విజన్, పట్టుదలతో పాటు వ్యవసాయం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపట్ల ఆయనకు ఉన్న అంచనా కూడా దోహదపడింది. దానికి తగ్గట్టుగా సాగునీటి ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను డిజైన్ చేశారని, అందుకే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడిందని అన్నారు. ఇది ఇలా ఉంటే రైతుబంధు రూపంలో సుమారు రూ. 14 వేల కోట్లు, ఆసరా ఫింక్షన్ల రూపంలో సుమారు మరో రూ. 14వేల కోట్లు, కళ్యాణి లక్ష్మీ ద్వారా రూ. 2248 కోటు,్ల మత్య, పాడి పరిశ్రమ, గొర్రెలు రూపంలో సుమారు రూ.100 కోట్లు, విత్తనాలకు, ఎరువులకు రూ. 142 కోట్లు, రుణ మాఫీ రూపంలో రూ. 14 వేల కోట్లు, రైతులు పండించిన పంటలు ధాన్యం మొక్క జొన్న, కందులు ఇతర పంటలను కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది. ఇది సుమారు రూ.15 వేల కోట్ల దాకా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇతర రూపాలలోకూడా గ్రామీణ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు చేరాయి. అంటే సుమారుగా రూ. 75 వేల కోట్లకు పైగా డబ్బులు గ్రామీణ ప్రాంతానికి చేరాయి.

ఈ నగదులో ఎక్కువ శాతం సర్క్యులేషన్‌లో ఉండే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో నిధులు చేరడంతో పాటు వ్యవసాయ అంటే దండగ కాదు పండగ అనే విధంగా ఉండడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యింది. వీటన్నిటి ఫలితమే జాతీయ తలసరి ఆదా యం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. జాతీయ తలసరి ఆదాయం రూ. లక్ష 34 వేల 432 ఉంటే అదే తెలంగాణలో రూ. 2 లక్షల 28 వేల 216 గా ఉంది. ఎంత తేడా ఉందో చూడండి. అలాగే వృద్ధి రేటు కూడా ఆస్మాన్ ఫరక్ అంత తేడా ఉంది. మన రాష్ట్ర వృద్ధి రేటు 11.8 శాతం ఉంటే ఆల్ ఇండియా వృద్ధి రేటు కేవలం 6.3 శాతం ఉంది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థే అతలాకుతలం అయింది. భారత దేశం కూడా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిం ది. అయినా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధమాత్రం నిలదొక్కుకోవడమే కాకుండా బలపడింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం ముందు చూపు వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్ద పీఠ వేయడమే కారణం అని చెప్పవచ్చు.

పి.వి శ్రీనివాసరావు (ఇన్‌పుట్ ఎడిటర్ టి న్యూస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News